Sunetra-Supriya: ప‘వార్‌’ వేళ.. వదిన x మరదళ్ల సవాల్‌ ఉంటుందా..?

సార్వత్రిక ఎన్నికల తేదీ ప్రకటన దగ్గరపడుతోన్న సమయంలో పవార్(Pawar) కుటుంబ రాజకీయాలు ఆసక్తిగా మారాయి. 

Updated : 17 Feb 2024 20:37 IST

ముంబయి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న వేళ లోక్‌సభ నియోజకవర్గం ‘బారామతి’(Baramati)పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. శరద్ పవార్(Sharad Pawar) కుటుంబానికి పట్టున్న ఈ స్థానానికి ఆయన కుమార్తె సుప్రియా సూలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  వచ్చే ఎన్నికల్లో ఆమె సోదరుడు అజిత్‌ పవార్‌(Ajit Pawar) సతీమణి సునేత్ర( Sunetra Pawar) కూడా ఇక్కడినుంచే పోటీచేసే అవకాశాలున్నట్టు పలు వార్తా కథనాలు వెల్లడవుతున్నాయి. శుక్రవారం అజిత్‌ చేసిన వ్యాఖ్యలే ఇందుకు దోహదం చేస్తున్నాయి.

సుప్రియా సూలే(Supriya Sule) బారామతి  సిట్టింగ్‌ ఎంపీ. 2009 నుంచి అక్కడ విజయం సాధిస్తున్నారు. ఇంతవరకు ఎన్నికల్లో పోటీ చేయని వారిని ఆమెపై బరిలోకి దింపుతామని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్‌సీపీ నేత అజిత్‌ పవార్ వెల్లడించారు. మొదటిసారి పోటీ చేసే అభ్యర్థిని గెలిపించాలని, అభివృద్ధికి ఓటేయాలని అభ్యర్థించారు. దాంతో ఆయన సతీమణినే బరిలో దింపుతారనే వార్తలు మొదలయ్యాయి. తదుపరి లోక్‌సభ ఎంపీ అంటూ ఇటీవల సునేత్ర పవార్‌ పేరిట కొన్ని బ్యానర్లు వెలిశాయి. అది కూడా ప్రస్తుత వార్తలకు బలం చేకూరుస్తోంది. ఇంతవరకు ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించని సునేత్ర పవార్.. ఎన్విరాన్‌మెంటల్‌ ఫోరమ్ ఆఫ్ ఇండియా అనే ఎన్‌జీఓను నెలకొల్పి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. విద్యా ప్రతిష్ఠాన్‌ విద్యాసంస్థకు ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు.

గతేడాది జులైలో ఎన్సీపీలోని మెజార్టీ ఎమ్మెల్యేలతో కలిసి భాజపా- శిందే సర్కారుకు మద్దతు పలికిన అజిత్‌ పవార్‌ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఎన్సీపీలో చీలిక ఏర్పడింది. ఆ తర్వాత నుంచి శరద్‌ పవార్‌(Sharad Pawar) ఎన్సీపీపై క్రమంగా పట్టు కోల్పోతూ వచ్చారు. ఇక పార్టీ ఎవరిదనే విషయమై దానిలోని రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదాన్ని ఇటీవలే ఈసీ పరిష్కరించింది. అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని వర్గాన్నే అసలైన ఎన్సీపీగా గుర్తించింది. పవార్‌ వర్గానికి ‘నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ-శరద్‌చంద్ర పవార్‌’ అనే పేరు కేటాయించింది. ఈసీ ఆదేశాలను సీనియర్ పవార్ సుప్రీంకోర్టులో సవాలు చేసిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని