Nawaz Sharif: సైన్యానికి తలొగ్గిన నవాజ్‌ షరీఫ్‌.. కుమార్తె కోసం రాజీ..!

Nawaz Sharif: కుమార్తె మరియం రాజకీయ భవిష్యత్తు కోసం పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్ సైన్యానికి తలొగ్గారు. ప్రధాని పదవికి తన సోదరుడిని నామినేట్ చేశారు.

Updated : 17 Feb 2024 20:39 IST

లాహోర్‌: పాకిస్థాన్‌ (Pakistan) రాజకీయాలను సైన్యం (Army) శాసిస్తుందనేది బహిరంగ రహస్యం. తాజాగా ఇది మరోసారి రుజువైంది. దేశ ప్రధానమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టాలని కలలు కన్న నవాజ్ షరీఫ్‌ (Nawaz Sharif) చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. ప్రధాని పదవికి తన సోదరుడు షహబాజ్‌ షరీఫ్‌ను నామినేట్‌ చేశారు. అయితే, ఈ సంచలన నిర్ణయం వెనక పాక్‌ ఆర్మీ హస్తం ఉన్నట్లు తేలింది. తన కుమార్తె మరియం రాజకీయ భవిష్యత్తు కోసమే నవాజ్‌ సైన్యానికి తలొగ్గినట్లు పార్టీ విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

‘‘పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌- నవాజ్‌ (పీఎంఎల్‌-ఎన్‌) ఆధ్వర్యంలోని సంకీర్ణ ప్రభుత్వానికి నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వం వహించేవారే..! కానీ, ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ పేలవ ప్రదర్శన చేయడంతో ఆయనకు సైన్యం కండీషన్స్‌ పెట్టింది. ‘ప్రధాని పదవి కావాలా? కుమార్తె పంజాబ్‌ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలా?’ రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలని ఆదేశించింది. ఒకవేళ ప్రధాని పదవిని ఎంచుకుంటే పంజాబ్ సీఎం పగ్గాలు షహబాజ్‌కు ఇవ్వాలని తెలిపింది. తన రాజకీయ వారసురాలైన మరియం భవిష్యత్తు కోసం నవాజ్‌ ప్రధాని రేసు నుంచి వైదొలిగారు’’ అని పీఎంఎల్‌-ఎన్‌ పార్టీ నేత ఒకరు మీడియాకు వెల్లడించారు.

విపక్షంలో కూర్చుంటాం.. ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీ ప్రకటన

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కలేదు. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మద్దతున్న స్వతంత్రులు 92 స్థానాల్లో గెలుపొందగా.. నవాజ్‌ పార్టీ 80, బిలావల్‌ భుట్టో నేతృత్వంలోని పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ 54 సీట్లు దక్కించుకుంది. దీంతో పీపీపీ, చిన్న పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు పీఎంఎల్‌-ఎన్‌ సిద్ధమైంది.

తొలుత నవాజ్‌ ప్రధాని పదవి చేపడతారని వార్తలు వచ్చినా అనూహ్యంగా రేసు నుంచి వెనక్కి తగ్గిన ఆయన.. తన సోదరుడిని నామినేట్‌ చేశారు. మార్చి తొలివారంలో షహబాజ్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇక, పంజాబ్‌ తొలి మహిళా ముఖ్యమంత్రిగా మరియం బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే, ప్రధానిగా షహబాజ్‌ ఉన్నా.. రాజకీయ చక్రం తిప్పేది నవాజ్‌ షరీఫే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని