Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..

Updated : 09 Apr 2024 21:03 IST

1. ‘ఆ 40 మంది బందీలు చనిపోయారు’.. చర్చల వేళ హమాస్‌ ప్రకటన

హమాస్‌ (Hamas) చెరలో బందీలుగా ఉన్న తమ పౌరులను విడిపించేందుకు ఇజ్రాయెల్‌ (Israel) తీవ్రంగా యత్నిస్తోంది. హమాస్‌ను సమూలంగా నాశనం చేసేందుకు ప్రతిన బూనిన ఇజ్రాయెల్‌.. గాజాపై భీకర పోరు కొనసాగిస్తోంది. హమాస్‌ చెరలో దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న 40 మంది పౌరులకు విముక్తి కలిగేలా అమెరికాకు చెందిన సెంట్రల్‌ ఇంటలిజెన్స్‌ ఏజెన్సీ (CIA) ముందుకొచ్చింది. ఇరువైపులా కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చేందుకు ప్రయత్నిస్తోంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. ‘సోలో ట్రావెల్‌ సో బెటరు’.. ఆ దేశాల్లో ‘ఒంటరి’ పర్యటనకు భారతీయుల మొగ్గు

విదేశీ పర్యటనకు వెళ్తోన్న భారతీయుల సంఖ్య ఇటీవల గణనీయంగా పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈక్రమంలో పలు దేశాలకు ఒంటరిగా వెళ్లేందుకు భారతీయ పురుషులు ఆసక్తి చూపుతున్నారట. ముఖ్యంగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE), ఈజిప్టు, సింగపుర్, వియత్నాం దేశాలకు వెళ్తున్నవారిలో వీరి సంఖ్య ఎక్కువగా ఉందని తాజా నివేదిక వెల్లడించింది. వీసాల కోసం వస్తోన్న దరఖాస్తుల్లో అధిక భాగం ఇవేనని ఈ-వీసా దరఖాస్తు ప్రక్రియ చేపట్టే ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ వేదిక ‘అట్లిస్‌’ పేర్కొంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. తెలంగాణకు చల్లని కబురు.. రాగల 5రోజులు తేలికపాటి వర్షాలు

తెలంగాణలో రాగల ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్య మహారాష్ట్ర వద్ద కేంద్రీకృతమైన ఆవర్తనం అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. ఏడాదిలో 12 వేల కిలోమీటర్ల రహదారుల నిర్మాణం

 గత ఆర్థిక సంవత్సరంలో (2023-24) దేశవ్యాప్తంగా 12,349 కిలోమీటర్ల మేర రహదారులను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ నిర్మించిందని ప్రభుత్వానికి చెందిన సీనియర్‌ అధికారి తెలిపారు. జాతీయ రహదారుల నిర్మాణం విషయంలో ఇదే రెండో అత్యధికమని పేర్కొన్నారు. 2020-21లో అత్యధికంగా 13,327 కిలోమీటర్ల మేర రహదారులను కేంద్రం నిర్మించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. హేమమాలినిపై అనుచిత వ్యాఖ్యలు.. సూర్జేవాలాకు ఈసీ షోకాజ్‌ నోటీసులు

భాజపా ఎంపీ, నటి హేమమాలిని (Hemamalini)పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రణ్‌దీప్‌ సూర్జేవాలా చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఆమెపై అమర్యాదకర వ్యాఖ్యలు చేసినందుకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ ప్రసంగాల సమయంలో మహిళల గౌరవాన్ని కాపాడేందుకు తమ సలహాలను కచ్చితంగా పాటించేలా తీసుకున్న చర్యలేంటో వివరించాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను  కోరింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. త్వరలో కాంగ్రెస్‌లో చేరతా: చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి

చీరాల నియోజకవర్గ అభిమానులతో బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ సమావేశమయ్యారు. త్వరలో షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు. తెదేపా అధినేత చంద్రబాబు అంటే తనకెంతో గౌరవమని, తన భావజాలానికి తెదేపాతో కలిసి ప్రయాణించలేకపోయానని పేర్కొన్నారు. వైకాపా అధిష్ఠానం తనకు సముచిత స్థానం ఇచ్చి పర్చూరు నుంచి పోటీ చేయమందని తెలిపారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. యాపిల్‌ ఫోన్ల తయారీ.. పెగట్రాన్‌తో టాటాల చర్చలు!

యాపిల్‌ ఫోన్ల తయారీలోకి అడుగుపెట్టిన టాటా గ్రూప్‌ (Tata group).. తన పాద ముద్రను మరింత విస్తరించాలనుకుంటోంది. ఇప్పటికే బెంగళూరులోని విస్ట్రాన్‌ ప్లాంట్‌ను కొనుగోలు చేసిన టాటా గ్రూప్‌నకు చెందిన టాటా ఎలక్ట్రానిక్స్‌.. ఇప్పుడు యాపిల్‌ ఐఫోన్లను తయారుచేసే పెగట్రాన్‌తోనూ చర్చిస్తోంది. భారత ఫ్యాక్టరీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేయాలనుకుంటోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. చైనా ప్రాంతాల పేర్లను భారత్‌ మారిస్తే..? డ్రాగన్‌కు రాజ్‌నాథ్‌ హెచ్చరిక

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు చైనా (China) కొత్త పేర్లు పెట్టడాన్ని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) మరోసారి ఖండించారు. ఒకవేళ భారత్‌ కూడా చైనా విషయంలో ఇదే పని చేస్తే.. అక్కడున్న భూభాగాలు మనవి అయిపోతాయా? అని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) నేపథ్యంలో అరుణాచల్‌లో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న రాజ్‌నాథ్‌.. ఈ రాష్ట్రం భారత్‌లో అంతర్భాగమని ఉద్ఘాటించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. రాణిని ఆశ జూపి.. రాజును చంపాలనుకున్నారు..!: అఖిలేశ్‌పై జయంత్ విమర్శలు

ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ (Akhilesh Yadav)పై రాష్ట్రీయ లోక్‌దళ్‌ (RLD) చీఫ్ జయంత్ చౌధరీ (Jayant Chaudhary) విమర్శలు చేశారు. రాణిని ఆశజూపి.. రాజును చంపాలనుకున్నారంటూ చెస్‌ పరిభాషను ఉపయోగించారు. ‘‘నా గురించి మీకు తెలుసు. నా నోటి నుంచి పదాలు రాకముందే మీరు నన్ను అర్థం చేసుకోగలరు. ప్రజా, రాజకీయ జీవితంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలి’’ అని జయంత్‌ వ్యాఖ్యలు చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. అన్నామలై, తమిళిసైతో కలిసి ప్రధాని మోదీ రోడ్‌ షో

లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) చెన్నైలోని టి.నగర్‌ ప్రాంతంలో రోడ్‌షో నిర్వహించారు. రోడ్డుకు ఇరువైపులా ప్రజలు పెద్దఎత్తున నిలబడి పూల వర్షంతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. ప్లకార్డులు పట్టుకొని మోదీ అనుకూల నినాదాలతో హోరెత్తించారు. ప్రత్యేకంగా అలంకరించిన కారు నుంచి మద్దతుదారులకు ప్రధాని అభివాదం చేసుకుంటూ ముందుకుసాగారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని