Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 12 Apr 2024 21:03 IST

1.అధికారాన్ని అడ్డేసి మరీ.. హంతకుల్ని కాపాడుతోన్న జగనన్న: షర్మిల

‘‘ఒక వైపు వైఎస్‌ఆర్‌ బిడ్డ.. మరో వైపు హంతకుడు. మా వైపు న్యాయం, ధర్మం ఉంది. వైఎస్‌ఆర్‌ బిడ్డ కావాలో? వివేకా హత్యకేసు నిందితుడు అవినాష్‌రెడ్డి కావాలో పులివెందుల ప్రజలే తేల్చుకోవాలి.  మీ ఆడ బిడ్డలం.. కొంగుచాచి అడుగుతున్నాం. పులివెందుల ప్రజాలారా.. మాకు న్యాయం చేయండి’’ అంటూ పీసీసీ అధ్యక్షురాలు, కడప లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి షర్మిల భావోద్వేగానికి గురయ్యారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. ఇకపై విద్యార్థినులకు నెలసరి సెలవులు: పంజాబ్‌ యూనివర్సిటీ

 చండీగఢ్‌లోని పంజాబ్ యూనివర్శిటీ(పీయూ) 2024-25 వార్షిక సంవత్సరం నుంచి విశ్వవిద్యాలయ విద్యార్థినులకు నెలసరి సెలవులు ఇవ్వనున్నట్లుగా ప్రకటించింది. పీయూ వైస్ ఛాన్స్‌లర్‌ రేణువిగ్ ఈ ప్రతిపాదనను ఆమోదించారు. అయితే దీనికి కొన్ని నిబంధనలు, షరతులను విధించారు. అధికారిక నోటిఫికేషన్‌ ప్రకారం విద్యార్థులు ఒక సెమిస్టర్‌కు గరిష్టంగా నాలుగు లీవ్‌లు తీసుకునేందుకు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. ‘సిరా’ చుక్క కథ... తెలుసునా ఓటరూ..!

ఎన్నికల పోలింగ్‌లో ప్రతిఒక్కరి వేలికీ సిరా చుక్క పెడతారు తెలుసు కదా. ఎన్నికల్లో ఓటరు తన ఓటుహక్కు వినియోగించుకున్నాక మళ్లీ ఓటేసి రిగ్గింగ్‌కు పాల్పడకుండా అదో ప్రత్యేక ఏర్పాటు. ఒక్కసారి సిరా గుర్తు వేలిపై పడితే.. కొన్ని వారాల పాటు చెరిగిపోదు. అసలీ సిరా చుక్క వాడకం తొలిసారి ఎప్పుడు మొదలైంది? అది ఎందుకు చెరిగిపోదు? దీని ప్రత్యేకతలేంటి? తదితర వివరాలను పరిశీలిస్తే.. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. మరింత పెరిగిన బంగారం ధర.. రూ.75 వేల పైకి!

బంగారం ధర (Gold price) మళ్లీ పెరిగింది. గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతున్న పసిడి ధర.. ఎప్పటికప్పుడు సరికొత్త గరిష్ఠాలను దాటుకుంటూ ముందుకుపోతోంది. తాజాగా రూ.75 వేల మార్కును దాటింది. శుక్రవారం సాయంత్రం 6.30 గంటల సమయానికి బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి (24 క్యారెట్ల) ధర రూ.75,550గా (అన్ని ట్యాక్సులూ కలుపుకొని) నమోదైంది. ఒక్క రోజులోనే దాదాపు వెయ్యి రూపాయల మేర బంగారం ధర పెరగడం గమనార్హం. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. ఎన్నికల సమయంలో ఈసీ ఆదేశాలే శిరోధార్యం: సీఎఫ్‌డీ

ప్రజాస్వామ్యం అంటే అందరికీ సమాన అవకాశాలు దక్కడమని సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ఫోరం స్పష్టం చేసింది. పోటీ చేసే అభ్యర్థులకు, పార్టీలకు సమాన అవకాశాలు ఇవ్వాలని కోరింది. శుక్రవారం విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో సంస్థ ఉపాధ్యక్షుడు, మాజీ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఈసీ ఇచ్చిన ఆదేశాలే శిరోధార్యమని చెప్పారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. ఓటు వేసిన వారినే కాటేసే రకం.. జగన్‌: చంద్రబాబు

రాజధాని విషయంలో వైకాపా ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రోడ్లపై గుంతలు పూడ్చలేని సీఎం.. మూడు రాజధానులు కడతారా? అని ప్రశ్నించారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఓటు వేసిన వారినే కాటేసే రకం.. జగన్‌ అని విమర్శించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. కేజ్రీవాల్‌ ‘ఆలోచనలను’ నిర్బంధించలేరు - పంజాబ్‌ సీఎం

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)ను జైల్లో పెట్టవచ్చేమో కానీ ఆయన ఆలోచనలు, తీసుకువచ్చిన మార్పును మాత్రం నిర్బంధించలేరని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ (Bhagwant Mann) పేర్కొన్నారు. ఆమ్‌ఆద్మీ పార్టీ చేసే ఆలోచనలు దిల్లీ, పంజాబ్‌లలో స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. అస్సాంలోని డిబ్రూగఢ్‌లో ఏర్పాటుచేసిన ఎన్నికల ప్రచారంలో (Lok Sabha Elections) పాల్గొన్న మాన్‌.. భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. టీసీఎస్‌ లాభం ₹12,434 కోట్లు.. వారికి డబుల్‌ డిజిట్‌ ఇంక్రిమెంట్‌

దేశంలో త్రైమాసిక ఫలితాల సీజన్‌ ప్రారంభమైంది. దేశీయ అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) గత ఆర్థిక సంవత్సరం (2023-24) చివరి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో 9.1 శాతం వృద్ధితో రూ.12,434 కోట్ల నికర లాభాన్ని కంపెనీ నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో నికరలాభం రూ.11,392 కోట్లుగా ఉంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9.  ‘ఇజ్రాయెల్‌, ఇరాన్‌లకు వెళ్లొద్దు’.. భారత పౌరులకు విదేశాంగశాఖ అలెర్ట్‌

పశ్చిమాసియాలో ఉద్రిక్త (Israel Hamas Conflict) వాతావరణం నెలకొన్న వేళ భారత ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్‌ (Israel), ఇరాన్‌లకు ప్రయాణం చేయవద్దని భారత పౌరులకు సూచించింది. తదుపరి ప్రకటన ఇచ్చే వరకూ ఇవి పాటించాలని తెలిపింది. ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ ఏ క్షణమైనా దాడులు చేయొచ్చనే వార్తలు వస్తున్న నేపథ్యంలో విదేశాంగ శాఖ ఈ అడ్వైజరీ జారీ చేసింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. పాక్‌లో పోలీసులపై ఆర్మీ అధికారుల అరాచకం.. నెట్టింట్లో వైరల్‌

పాకిస్థాన్‌ (Pakistan)లో ఎన్నికైన ప్రభుత్వం కూడా ఆర్మీ కనుసన్నల్లోనే నడుస్తుందనేది బహిరంగ రహస్యం. ఆ మాటను నిజం చేస్తూ సైనికులు కొందరు తమ అధికారాన్ని ప్రదర్శించారు. పోలీసుస్టేషన్‌లోకి చొచ్చుకెళ్లి.. అక్కడి సిబ్బందిని చితకబాదారు. యూనిఫాంలో ఉన్న పోలీసుల్ని బలవంతంగా మోకాళ్లపై కూర్చోబెట్టిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని