Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 30 Mar 2024 17:00 IST

1. క్విట్‌ జగన్‌.. సేవ్‌ రాయలసీమ : ప్రొద్దుటూరు సభలో చంద్రబాబు

జగన్‌ ఇంటికి పోవడం ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఐదేళ్లలో రాయలసీమకు ఏం చేశారో చెప్పాలని సవాల్‌ విసిరారు. ప్రొద్దుటూరు ప్రజాగళం ప్రచార సభలో చంద్రబాబు ప్రసంగించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రాష్ట్ర ప్రయోజనాలను జగన్‌ తాకట్టు పెట్టారు: వైఎస్‌ షర్మిల

కాంగ్రెస్‌ పార్టీలో అభ్యర్థుల ఎంపిక ప్రజాస్వామ్యయుతంగా ఉంటుందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తెలిపారు. ప్రాంతీయ పార్టీల తరహాలో ఎంపిక జరగదని అన్నారు. విజయవాడలోని ఓ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన కాంగ్రెస్‌ నేతల సమావేశంలో ఆమె మాట్లాడారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ‘దమ్ముంటే టచ్‌ చేసి చూడు’.. మహేశ్వర్‌ రెడ్డి, మంత్రి పొన్నం మాటల యుద్ధం

లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. మంత్రి కోమటిరెడ్డి.. భాజపా ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని చేసిన వ్యాఖ్యలపై భాజపా శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను ఒకరిని ముట్టుకున్నా 48గంటల్లో ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరించారు. మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఎదురుదాడి చేశారు. భాజపా నేతలకు దమ్ముంటే తమ ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడాలని సవాల్ విసిరారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. భారాస నేతలు అయోమయంలో ఉన్నారు: కడియం శ్రీహరి

భారాస నేతలు అయోమయంలో ఉన్నారని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆ పార్టీని వీడేందుకు సిద్ధమైన ఆయన తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. కాంగ్రెస్‌ ఆహ్వానం నేపథ్యంలో ఆ పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈమేరకు కుమార్తె కావ్యతో కలిసి మంత్రుల నివాస ప్రాంగణంలో తన అనుచరులతో సమావేశమయ్యారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పెళ్లైన కొన్ని గంటల్లోనే కన్నుమూసిన వధువు

పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం దబ్బగడ్డ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కాళ్లపారాణి ఆరకముందే నవ వధువు అఖిల (20) మృతి చెందింది. శుక్రవారం రాత్రి 10 గంటలకు అఖిలకు వివాహమైంది. వివాహ క్రతువు ముగిసిన తర్వాత నీరసంగా ఉందని నిద్రలోకి జారుకుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. అదనపు ఎస్పీల పాత్రపై దర్యాప్తు ముమ్మరం

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను రెండో రోజు దర్యాప్తు బృందం కస్టడీలోకి తీసుకొని విచారిస్తోంది. వీరి స్టేట్‌మెంట్‌ కీలకంగా మారడంతో పాటు మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని సమాచారం.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఆ కాల్‌ ఫార్వర్డింగ్‌లు ఆపండి.. టెలికాం ఆపరేటర్లకు డాట్‌ సూచన

యూఎస్‌ఎస్‌డీ (USSD) కాల్‌ ఫార్వర్డింగ్‌లను ఏప్రిల్‌ 15 నుంచి డీయాక్టివేట్‌ చేయాలని టెలికాం ఆపరేటర్లకు టెలికాం విభాగం (DoT) సూచించింది. ఆ సేవలను రీయాక్టివేట్‌ చేసుకోవడానికి ప్రత్యామ్నాయ పద్ధతులకు మళ్లాలని పేర్కొంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ‘కిచెన్‌’ వ్యాఖ్యలు.. సైనా నెహ్వాల్‌ ఆగ్రహం

కర్ణాటక (Karnataka)లో కాంగ్రెస్‌ (Congress) సీనియర్‌ నేత, ఎమ్మెల్యే శివశంకరప్ప మహిళలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. భాజపా అభ్యర్థి గాయత్రి సిద్ధేశ్వరను ఉద్దేశిస్తూ ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘ఆమె వంట గదికి మాత్రమే సరిపోతారు’ అంటూ కించపర్చారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ (Saina Nehwal) సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఇజ్రాయెల్‌కు అమెరికా రెండు వేల బాంబులు

ఇజ్రాయెల్‌ దళాలు గాజాలోని రఫాపై సైనిక దాడులతో విరుచుకుపడుతున్న సమయంలో ప్రపంచ దేశాలతో సహా అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది.  అయినప్పటికీ తన మిత్రదేశమైన ఇజ్రాయెల్‌కు యుద్ధంలో సహాయ సహకారాలు అందిస్తూనే ఉంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆశ్చర్యం.. మద్దిచెట్టు నుంచి ఉబికివస్తున్న నీరు

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం తింటుకూరు అటవీ ప్రాంతంలో ఓ మద్దిచెట్టు నుంచి నీరు ఉబికివస్తోంది. బేస్‌క్యాంప్‌ వద్ద జిల్లా అటవీ శాఖ అధికారితో పాటు సిబ్బంది ఫీల్డ్‌ వర్క్‌కు వెళ్లారు. ఈ నేపథ్యంలో 100 మద్ది చెట్లను గుర్తించారు. వాటిలో ఒక చెట్టుకు రంధ్రం చేయగా సుమారు 20 లీటర్ల వరకు నీరు వచ్చింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని