Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Updated : 15 Jul 2023 09:04 IST

1. ఫ్రాన్స్‌ అధ్యక్షుడి సతీమణికి.. తెలంగాణ చీర

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌ పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌కు చందనపు చెక్కతో చేసిన సితార వాయిద్యాన్ని మోదీ కానుకగా అందజేశారు. అలాగే మెక్రాన్‌ సతీమణికి తెలంగాణకు చెందిన పోచంపల్లి సిల్క్‌ ఇక్కత్‌ చీరను అందజేశారు. ఫ్రాన్స్‌ పర్యటనలో భాగంగా మోదీకి పలు బహుమతులను మెక్రాన్‌ అందజేశారు. కాగా, శుక్రవారం పారిస్‌లో అట్టహాసంగా జరిగిన బాస్టీల్‌ డే పరేడ్‌ వేడుకలకు ప్రధాని మోదీ గౌరవ అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. తెలంగాణ ప్రత్యేక భద్రత దళంలో విచిత్ర పరిణామాలు

ఎక్కడైనా సరే అందుబాటులోని పోస్టుల ఆధారంగా పదోన్నతుల ప్రక్రియను చేపడతారు. కానీ ఆ విభాగం మాత్రం అందుకు భిన్నం. భవిష్యత్తులో రాబోయే పోస్టులను ఊహించుకొని ముందస్తుగానే పదోన్నతులిచ్చేసుకుంది. ఈ తొందరపాటు చర్యే ఇప్పుడు క్షేత్రస్థాయి సిబ్బందికి చిక్కులు తెచ్చిపెడుతోంది. ఈ పరిణామాలకు తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక భద్రత దళం (టీఎస్‌ ఎస్‌పీఎఫ్‌) కేంద్ర బిందువుగా మారింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. సుద్దముక్కకూ దిక్కులేదు!

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు ఇచ్చే నిధులను ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది. గత ఏడాది అరకొరగా నిధులు విడుదల చేయగా.. ఈ సంవత్సరం అసలు మంజూరు చేయలేదు. దీంతో ప్రభుత్వ బడుల్లో సుద్దముక్కలు, రిజిస్టర్లు, డస్టర్లు, ఇతర సామగ్రి కొనుగోలు ఉపాధ్యాయులకు ప్రతిబంధకంగా మారింది.  నిధులు లేక పోవడంతో పలు పాఠశాలల్లో నాలుగైదు నెలలుగా విద్యుత్తు బిల్లులు సైతం చెల్లించడం లేదు. దీంతో విద్యుత్తు కనెక్షన్లు తొలగిస్తామంటూ పాఠశాలలకు ఆ శాఖ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఏపీ నుంచి పార్లమెంట్‌కు రావాలనుకుంటున్నా: సుబ్రహ్మణ్యస్వామి

వచ్చే సార్వత్రిక ఎన్నికల (2024) అనంతరం ఆంధ్రప్రదేశ్‌ నుంచి పార్లమెంట్‌కు రావాలనుకుంటున్నట్లు కేంద్ర మాజీ మంత్రి, భాజపా నేత సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు. పార్లమెంట్‌లో తన ఆరేళ్ల పదవీ కాలంలో సంతోషంగా లేనని  వ్యాఖ్యానించారు. దిల్లీలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను మధురై దగ్గర గ్రామం నుంచి వచ్చినా, తన అల్లుడు విశాఖపట్నానికి చెందిన విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఈఏఎస్‌ శర్మ కుమారుడని తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కమీషన్‌కు ఆశపడి తప్పు చేశా.. విచారణలో ఆర్‌ఐ స్వర్ణలత వెల్లడి!

కేవలం తాను డబ్బుకు ఆశపడి మాత్రమే తప్పు చేసినట్లుగా విశాఖ సిటీ రిజర్వ్‌ హోంగార్డ్సు ఇన్‌స్పెక్టర్‌(ఆర్‌ఐ) స్వర్ణలత పోలీసు ఉన్నతాధికారుల ముందు తెలియజేసినట్లు సమాచారం. నోట్ల మార్పిడి వ్యవహారంలో ఏ4 నిందితురాలిగా రిమాండ్‌లో ఉన్న ఆమెకు ఒక రోజు పోలీసు కస్టడీ ముగిసింది. శుక్రవారం ఉదయం ఆమెను కేజీహెచ్‌కు తరలించి, వైద్య పరీక్షలు చేసి తిరిగి జైలుకు తరలించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. తెలంగాణలో ఈ నెల 18 నుంచి మళ్లీ వర్షాలు!

బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంలో ఈ నెల 16న గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు. ఇది తీవ్రమైతే ఈ నెల 18 నుంచి తెలంగాణలో భారీ వర్షాలు పడే సూచనలున్నట్లు చెప్పారు. శుక్రవారం ఉత్తర కోస్తాంధ్రపై 5.8 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఆగస్టు 29, 30 తేదీల్లో విద్యాసంస్థలకు సెలవు

తెలంగాణలో ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్షలు జరగనున్నందున పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేసిన విద్యాసంస్థలకు ఆ రెండు రోజులు సర్కార్‌ సెలవులు ప్రకటించింది. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నత విద్యామండలి, కళాశాల విద్యాశాఖ, ఇంటర్‌ బోర్డు, పాఠశాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రూప్‌-2 పరీక్షలకు మొత్తం 5.5 లక్షల మంది దరఖాస్తు చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఏపీలో 180 డిగ్రీ కళాశాలల మూసివేత

ఏపీలో ఈ ఏడాది 180 ప్రైవేటు డిగ్రీ కళాశాలలను ప్రభుత్వం మూసివేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,008 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇందులో 150 కళాశాలలకు ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఫీజులను నిర్ణయించలేదు. మరో 30 కళాశాలలు బోధన రుసుములు  నిర్ణయించేందుకు కమిషన్‌కు ఆర్థిక వ్యవహారాలను సమర్పించలేదు. దీంతో ఈ ఏడాది వాటిలో ప్రవేశాలను ప్రభుత్వం నిలిపివేసింది. విద్యార్థుల ప్రవేశాలు 25శాతం కంటే తక్కువగా ఉన్నందున 150 కళాశాలలకు ఫీజులను నిర్ణయించలేదని ప్రభుత్వం ప్రకటించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

09. రుతురాజ్‌కు పగ్గాలు

ఆసియా క్రీడల్లో పోటీ పడే భారత క్రికెట్‌ జట్టుకు యువ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ సారథ్యం వహించనున్నాడు. సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 8 వరకు జరిగే ఈవెంట్‌ కోసం 15 మంది సభ్యుల జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఐపీఎల్‌ స్టార్‌ రింకు సింగ్‌ తొలిసారిగా భారత జట్టులో చోటు సంపాదించాడు. మరోవైపు ఈ క్రీడల్లో బరిలోకి దిగే మహిళల జట్టులో తెలుగమ్మాయిలు అంజలి శర్వాణి, బారెడ్డి అనూష చోటు దక్కించుకున్నారు. హర్మన్‌ప్రీత్‌ కెప్టెన్‌గా వ్యవహరించనుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అ‘స్పిన్‌’ మాయాజాలంతో విండీస్‌ విలవిల..

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (2023-25) సైకిల్‌లో భారత్‌ (Team India)కు అదిరే ఆరంభం లభించింది. డొమినికా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టడంతో మ్యాచ్‌ మూడ్రోజుల్లోనే ముగిసింది. 312/2 ఓవర్‌ నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. 421/5 వద్ద డిక్లేర్‌ చేసింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో 271 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని