ఏపీ నుంచి పార్లమెంట్‌కు రావాలనుకుంటున్నా: సుబ్రహ్మణ్యస్వామి

వచ్చే సార్వత్రిక ఎన్నికల (2024) అనంతరం ఆంధ్రప్రదేశ్‌ నుంచి పార్లమెంట్‌కు రావాలనుకుంటున్నట్లు కేంద్ర మాజీ మంత్రి, భాజపా నేత సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు.

Published : 15 Jul 2023 07:55 IST

ఈనాడు, దిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల (2024) అనంతరం ఆంధ్రప్రదేశ్‌ నుంచి పార్లమెంట్‌కు రావాలనుకుంటున్నట్లు కేంద్ర మాజీ మంత్రి, భాజపా నేత సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు. పార్లమెంట్‌లో తన ఆరేళ్ల పదవీ కాలంలో సంతోషంగా లేనని  వ్యాఖ్యానించారు. దిల్లీలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను మధురై దగ్గర గ్రామం నుంచి వచ్చినా, తన అల్లుడు విశాఖపట్నానికి చెందిన విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఈఏఎస్‌ శర్మ కుమారుడని తెలిపారు. తన ముత్తాతలు తితిదే ఆలయాలకు కమాండర్‌ ఇన్‌ చీఫ్‌గా పని చేశారని.. అలా తనకూ తితిదేతో సంబంధం ఉందని తెలిపారు. తనకు తెలుగు రాదని, తన తల్లి మాట్లాడతారని ఓ ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. కొందరు శ్రీవాణి ట్రస్టు పేరుతో వైకాపా నేతలు లూటీ చేస్తున్నారని, తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డి, ఆయన భార్య క్రైస్తవులని తప్పుడు ప్రచారాలు చేశారని మండిపడ్డారు. తమకు వచ్చే ఆదాయ వ్యయాలపై కాగ్‌తో ఆడిటింగ్‌కు తితిదే అంగీకరించిందని, దేశంలో అలా అంగీకరించిన దేవాలయం మరొకటి లేదన్నారు. తిరుపతి ఇప్పుడు ఉన్నంత వ్యవస్థీకృతంగా గతంలో ఎన్నడూ లేదని కొనియాడారు. ఏపీలో ఆలయాలపై దాడులు, మత మార్పిళ్లపై ప్రశ్నించగా అటువంటిదేమీ లేదని, అంతా వట్టి ప్రచారమేనంటూ కొట్టిపారేశారు. తాను భాజపా వ్యక్తినని, ఆ పార్టీ ముఖ్య నేతలతో తాను మాట్లాడానని, తితిదే, జగన్‌ తరఫున మాట్లాడవద్దని తనకు ఎవరూ చెప్పలేదన్నారు. కోర్టులో భాజపా న్యాయవాదులు తన వెంట ఉన్నారని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని