బలగం రాకముందే..!

ఎక్కడైనా సరే అందుబాటులోని పోస్టుల ఆధారంగా పదోన్నతుల ప్రక్రియను చేపడతారు. కానీ ఆ విభాగం మాత్రం అందుకు భిన్నం. భవిష్యత్తులో రాబోయే పోస్టులను ఊహించుకొని ముందస్తుగానే పదోన్నతులిచ్చేసుకుంది.

Updated : 15 Jul 2023 05:18 IST

కొత్త పోస్టులను ఊహించుకుని పదోన్నతులిచ్చారు
తీరా 1203 పోస్టుల నియామకాలకు తిరస్కరణతో సందిగ్ధం
తెలంగాణ ప్రత్యేక భద్రత దళంలో విచిత్ర పరిణామాలు

ఈనాడు, హైదరాబాద్‌: ఎక్కడైనా సరే అందుబాటులోని పోస్టుల ఆధారంగా పదోన్నతుల ప్రక్రియను చేపడతారు. కానీ ఆ విభాగం మాత్రం అందుకు భిన్నం. భవిష్యత్తులో రాబోయే పోస్టులను ఊహించుకొని ముందస్తుగానే పదోన్నతులిచ్చేసుకుంది. ఈ తొందరపాటు చర్యే ఇప్పుడు క్షేత్రస్థాయి సిబ్బందికి చిక్కులు తెచ్చిపెడుతోంది. విధినిర్వహణలో కానిస్టేబుళ్లపై ఒత్తిడి పెరుగుతుండడం సమీప భవిష్యత్తులో వివాదాలకు కారణమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిణామాలకు తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక భద్రత దళం (టీఎస్‌ ఎస్‌పీఎఫ్‌) కేంద్ర బిందువుగా మారింది.

కొత్త పోస్టుల భర్తీకి మండలి నిరాకరణ..

టీఎస్‌ఎస్‌పీఎఫ్‌కు ప్రభుత్వం ఇటీవలే 1203 కొత్త పోస్టులు మంజూరుచేసింది. ప్రస్తుతం పోలీసు నియామక మండలి ఆధ్వర్యంలో రిక్రూట్‌మెంట్‌ జరుగుతుండడంతో కొత్త పోస్టులను భర్తీ చేయాలని ఎస్‌పీఎఫ్‌ ఉన్నతాధికారులు 5 నెలల క్రితం మండలికి లేఖరాశారు. గతేడాది జారీఅయిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఇప్పటికే 390 కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీ ప్రక్రియ చూస్తున్న మండలి కొత్త పోస్టుల భర్తీకి నిరాకరించడం కీలక పరిణామంగా మారింది. ఎస్‌పీఎఫ్‌లో కొత్తగా మహిళల పోస్టులను సృష్టించడంతో పాటు ఎస్టీ రిజర్వేషన్ల పెంపు అంశం అడ్డుగా నిలవడమే మండలి నిరాకరణకు కారణమైంది. ఈసారికైతే కొత్త పోస్టులను భర్తీ చేయలేమని స్పష్టంచేస్తూ మండలి ఉన్నతాధికారులు ఎస్‌పీఎఫ్‌కు తాజాగా సమాచారం పంపించారు. దీంతో మళ్లీ ఎప్పుడు నోటిఫికేషన్‌ వస్తుంది..? కొత్త పోస్టులు ఎప్పుడు భర్తీ అవుతాయి..? అనే ప్రశ్నలకు ఇప్పుడు ఎవరూ సరైన సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది.

భారమంతా వారిపైనే...

ఎస్పీఎఫ్‌కు కొత్తగా మంజూరైన వాటిలో తెలంగాణ హైకోర్టు, జిల్లా కోర్టుల భద్రత పర్యవేక్షణకు 730.. జెన్‌కో కోసం 277.. బేగంపేట విమానాశ్రయం కోసం 114 కానిస్టేబుళ్ల పోస్టులున్నాయి. అలాగే కొత్తగా మహిళా పోస్టులు మంజూరయ్యాయి. వీటిలో 12 మంది ఎస్సైలతో పాటు 70 మంది కానిస్టేబుళ్ల పోస్టులున్నాయి. ఇవిపోను ప్రస్తుతం అన్ని కేడర్లలో సుమారు 1650 మంది ఉన్నారు. వీరిలో కానిస్టేబుళ్లు 1400 మంది ఉండేవారు. ఎస్‌పీఎఫ్‌ తొందరపాటు నిర్ణయం వల్ల 250 మంది వరకు కానిస్టేబుళ్లు పదోన్నతి పొందారు. దీంతో ప్రస్తుతం ఉన్న 1150 మంది కానిస్టేబుళ్లపైనే అదనపు భారం పడుతోంది. వాస్తవానికి 2 వేల మంది అవసరం ఉంటే దాదాపు సగం మందే ఉన్నారు. .కొత్తగా మంజూరైన వాటితో కలిపి ఎస్‌పీఎఫ్‌లో మొత్తం 3,580 పోస్టులున్నాయని లెక్కలేసుకుని పదోన్నతుల ప్రక్రియను చేపట్టారు. కానీ వాటిలో సగం పోస్టులైనా అందుబాటులో లేకపోవడం గమనార్హం. మొత్తంమీద కొత్త బలగం రాకుండానే చేపట్టిన పదోన్నతుల ప్రక్రియ విమర్శలకు దారితీసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని