PM Modi : ఫ్రాన్స్‌ అధ్యక్షుడి సతీమణికి.. తెలంగాణ చీర

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌ పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌కు చందనపు చెక్కతో చేసిన సితార వాయిద్యాన్ని మోదీ కానుకగా అందజేశారు.

Updated : 15 Jul 2023 09:50 IST

పారిస్‌: భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఫ్రాన్స్‌ పర్యటన (France Visit) ముగిసింది. ఈ సందర్భంగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌కు చందనపు చెక్కతో చేసిన సితార వాయిద్యాన్ని మోదీ కానుకగా అందజేశారు. అలాగే మెక్రాన్‌ సతీమణి బ్రిగెట్టికి తెలంగాణకు చెందిన పోచంపల్లి సిల్క్‌ ఇక్కత్‌ చీరను అందజేశారు. ఫ్రాన్స్‌ పర్యటనలో భాగంగా మోదీకి కూడా మెక్రాన్‌, ఫ్రాన్స్‌ ప్రధాని పలు బహుమతులను అందజేశారు. కాగా, శుక్రవారం పారిస్‌లో అట్టహాసంగా జరిగిన బాస్టీల్‌ డే పరేడ్‌ వేడుకలకు ప్రధాని మోదీ గౌరవ అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ప్రధాని మోదీ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర, సైనిక పురస్కారమైన గ్రాండ్‌ క్రాస్‌ ఆఫ్‌ ది లీజియన్‌ ఆఫ్‌ ఆనర్‌తో మెక్రాన్‌.. ప్రధాని మోదీని సత్కరించారు.

బాస్టీల్‌ డేలో భారత దళాలను చూడటం అద్భుతం..

ఫ్రాన్స్‌ జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన పరేడ్‌లో ఈసారి భారత సాయుధ దళాలు కూడా పాల్గొన్నాయి. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. బాస్టీల్‌ డేలో భారత బృందాలను చూడటం అద్భుతంగా ఉందన్నారు. ఈ పర్యటన తనకెప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొంటూ మెక్రాన్‌తో దిగిన సెల్ఫీని మోదీ ట్వీట్ చేశారు. బాస్టీల్‌ డే పరేడ్‌లో 269 మందితో కూడిన భారత త్రివిధ దళాల బృందం ఫ్రెంచ్‌ సైనిక దళాలతో కలిసి కవాతు చేసింది. ఫ్రాన్స్‌ వాయుసేనతో కలిసి భారత్‌కు చెందిన రఫేల్‌ విమానాలూ ఝుమ్మంటూ వేడుకకు ఆకాశంలో రంగులద్దాయి. భారత సైనిక బృందం పరేడ్‌కు రాగానే మోదీ లేచి నిల్చొని సెల్యూట్‌ చేశారు.

రెండు రోజుల ఫ్రాన్స్‌ పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) బయల్దేరారు. నేడు ఆయన అబుదబీలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా పలు రంగాల ప్రతినిధులతో మోదీ భేటీ కానున్నారు. యూఏఈ అధ్యక్షుడు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జాయోద్‌ అల్‌ నహ్‌యన్‌తో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని