సుద్దముక్కకూ దిక్కులేదు!.. ప్రభుత్వ బడి వెలుగుతోందిలా..

పేదల కుటుంబాల్లో వెలుగులు నింపేలా ప్రభుత్వ బడి వెలుగుతోంది. ఈ నాలుగేళ్లలో కేవలం విద్యా రంగంలో సంస్కరణల కోసం రూ.66,722 కోట్లు ఖర్చు చేశాం.

Updated : 15 Jul 2023 07:36 IST

పాఠశాలల నిర్వహణ నిధులకు జగన్‌ సర్కారు మంగళం
కేంద్రం ఇచ్చే 60 శాతం వాటా మొత్తాన్నీ దారి మళ్లిస్తున్న వైనం
రిజిస్టర్లు, డస్టర్లు, ఇతర సామగ్రి కొనుగోలుకు ప్రతిబంధకం
సొంత నగదు వెచ్చించి బిల్లుల కోసం ప్రధానోపాధ్యాయుల ఎదురుచూపు
ఈనాడు - అమరావతి

పేదల కుటుంబాల్లో వెలుగులు నింపేలా ప్రభుత్వ బడి వెలుగుతోంది. ఈ నాలుగేళ్లలో కేవలం విద్యా రంగంలో సంస్కరణల కోసం రూ.66,722 కోట్లు ఖర్చు చేశాం. ప్రైవేటు పాఠశాలలకు తీసిపోకుండా పోటీపడే పరిస్థితి మొదటి సారిగా రాష్ట్రంలో వచ్చింది

ఈ ఏడాది జూన్‌ 28న ‘అమ్మఒడి’ నిధులు విడుదల సభలో సీఎం జగన్‌ మాటలివి..


  • తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలోని ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పాఠశాల నిర్వహణకు గత ఏడాది రూ.35 వేలు తన సొంత నిధులు ఖర్చు చేశారు. ఈ మొత్తాన్ని ఇంతవరకు ప్రభుత్వం మంజూరు చేయలేదు. ఈ పాఠశాలకు నిర్వహణ కోసం రూ.50 వేలు ఇవ్వాల్సి ఉండగా.. గత ఏడాది కేవలం రూ.15 వేలు మాత్రమే మంజూరు చేశారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వక పోవడంతో రూ.15 వేలు సొంతంగా ఖర్చు చేసి అడ్మిషన్‌ రిజిస్టర్లు, హాజరు పట్టికలు, సుద్దముక్కలు, డస్టర్లు, ఇతర సామగ్రి కొనుగోలు చేశారు.

  • వైఎస్సార్‌ జిల్లాలోని దొరసానిపల్లి ప్రధానోపాధ్యాయుడు 2021-22 విద్యా సంవత్సరంలో సొంత నగదు రూ.1.04 లక్షలు వ్యయం చేశారు. ఇంతవరకు ఈ నిధులను ప్రభుత్వం మంజూరు చేయలేదు. ఇదే జిల్లాలో శెట్టిపల్లి ప్రధానోపాధ్యాయుడు 2020-21లో రూ.1.15 లక్షలు ఖర్చు చేయగా నిధులు విడుదల చేయలేదు. ప్రభుత్వం ఇచ్చిన నిర్వహణ నిధులు సరిపోక పోవడంతో సొంతంగా ఖర్చు చేశారు.

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు ఇచ్చే నిధులను ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది. గత ఏడాది అరకొరగా నిధులు విడుదల చేయగా.. ఈ సంవత్సరం అసలు మంజూరు చేయలేదు. దీంతో ప్రభుత్వ బడుల్లో సుద్దముక్కలు, రిజిస్టర్లు, డస్టర్లు, ఇతర సామగ్రి కొనుగోలు ఉపాధ్యాయులకు ప్రతిబంధకంగా మారింది.  నిధులు లేక పోవడంతో పలు పాఠశాలల్లో నాలుగైదు నెలలుగా విద్యుత్తు బిల్లులు సైతం చెల్లించడం లేదు. దీంతో విద్యుత్తు కనెక్షన్లు తొలగిస్తామంటూ పాఠశాలలకు ఆ శాఖ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. పాఠశాలల రోజువారీ నిర్వహణకు అవసరమయ్యే ఖర్చులను ప్రధానోపాధ్యాయులు సొంతంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఏడాది కూడా ఈ నిధులను సక్రమంగా విడుదల చేయలేదు. ప్రభుత్వ బడుల్లో నిర్వహణ నిధులను కేంద్రం సమగ్ర శిక్ష అభియాన్‌ కింద కేటాయిస్తుంది.దీనికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంటు విడుదల చేయాల్సి ఉండగా...కేంద్రం ఇచ్చిన నిధులను సైతం రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లిస్తోంది.

గత ఏడాది 40 శాతమే..

రాష్ట్రంలో పాఠశాలల్లో నిర్వహణ నిధుల కింద ఏటా రూ.122.04 కోట్లు మంజూరు చేయాల్సి ఉంది. ఇందులో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం భరించాల్సి ఉంటుంది. కేంద్రం ఇచ్చే 60 శాతం మొత్తాన్నీ ఇతర అవసరాలకు ప్రభుత్వం వాడేసుకుంటోంది.పాఠశాలల్లో సంస్కరణలకు రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్‌ గొప్పలు చెబుతుండగా.. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.  2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి గత ఏడాది ఆగస్టులో 20 శాతం, ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో 20 శాతం నిధుల విడుదలకు సమగ్ర శిక్ష అభియాన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరిలో ఇచ్చిన 20 శాతం నిధులను పలు పాఠశాలల్లో వినియోగించుకోకుండా వెనక్కి తీసేసుకున్నారు.

  • 2020-21, 2021-22 విద్యా సంవత్సరాలకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి. రూ.లక్షకు పైగా సొంత నిధులు ఖర్చు చేసిన ప్రధానోపాధ్యాయులు బిల్లుల కోసం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం లేదు. 
  • పురపాలక పాఠశాలలకు గత మూడేళ్లుగా ఈ నిధులు మంజూరు చేయలేదు. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్‌ఎంఎస్‌)కు బిల్లులు సమర్పించినా మంజూరు చేయలేదు.

నిబంధనలు ఇలా..

పాఠశాలలకు సమగ్ర శిక్ష అభియాన్‌ నుంచి ఏటా నిర్వహణ నిధులు విడుదల అవుతాయి.కేంద్రం 60% ఇస్తుండగా.. రాష్ట్రం తన వాటాగా 40% మొత్తాన్ని కలిపి విడుదల చేయాలి.అయా పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఈ నిధులు కేటాయిస్తారు.30 మంది విద్యార్థులు ఉంటే ప్రాథమిక పాఠశాలలకు రూ.10 వేలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు రూ.42 వేల వంతున విడుదల చేయాల్సి ఉంది. 30 నుంచి 100 మంది వరకు విద్యార్థులు ఉంటే అన్ని పాఠశాలలకు రూ.25 వేల వంతున కేటాయిస్తారు. 100 నుంచి 250 మంది వరకు విద్యార్థులు ఉంటే రూ.50 వేలు, 250 నుంచి 1000 మంది వరకు విద్యార్థుల సంఖ్య ఉంటే రూ.75 వేలు విడుదల చేయాలి.వెయ్యి మందికి పైన విద్యార్థులు ఉన్న పాఠశాలలకు రూ.లక్ష వరకు ఇవ్వాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని