Swarnalatha: కమీషన్‌కు ఆశపడి తప్పు చేశా.. విచారణలో ఆర్‌ఐ స్వర్ణలత వెల్లడి!

కేవలం తాను డబ్బుకు ఆశపడి మాత్రమే తప్పు చేసినట్లుగా విశాఖ సిటీ రిజర్వ్‌ హోంగార్డ్సు ఇన్‌స్పెక్టర్‌(ఆర్‌ఐ) స్వర్ణలత పోలీసు ఉన్నతాధికారుల ముందు తెలియజేసినట్లు సమాచారం.

Updated : 15 Jul 2023 06:59 IST

విశాఖపట్నం(ఎం.వి.పి.కాలనీ), న్యూస్‌టుడే: కేవలం తాను డబ్బుకు ఆశపడి మాత్రమే తప్పు చేసినట్లుగా విశాఖ సిటీ రిజర్వ్‌ హోంగార్డ్సు ఇన్‌స్పెక్టర్‌(ఆర్‌ఐ) స్వర్ణలత పోలీసు ఉన్నతాధికారుల ముందు తెలియజేసినట్లు సమాచారం. నోట్ల మార్పిడి వ్యవహారంలో ఏ4 నిందితురాలిగా రిమాండ్‌లో ఉన్న ఆమెకు ఒక రోజు పోలీసు కస్టడీ ముగిసింది. శుక్రవారం ఉదయం ఆమెను కేజీహెచ్‌కు తరలించి, వైద్య పరీక్షలు చేసి తిరిగి జైలుకు తరలించారు. క్రైమ్‌ డీసీపీ నాగన్నతోపాటు ఏసీపీ, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, మహిళా సిబ్బంది ఆధ్వర్యంలో ఆమెను గురువారం ఉదయం జైలు నుంచి తీసుకొచ్చి ఎంవీపీకాలనీ పోలీసుస్టేషన్‌లో విచారించారు. అయితే వివరాలను పోలీసు ఉన్నతాధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ముందుగా విచారణకు పూర్తిస్థాయిలో సహకరించక ముభావంగా ఉండటంతో పోలీసు అధికారులు ఆమెకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవటంతో గట్టిగానే ప్రశ్నించారు. నగరంలోని ఓ నేత వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను త్వరగా మార్పిస్తే 10 శాతం కమీషన్‌ వస్తుందని మరో నాయకుడి ద్వారా తెలుసుకుని ఈ మోసానికి పాల్పడినట్లుగా ఒప్పుకున్నట్లు సమాచారం. తన వాహన డ్రైవర్‌ ఒత్తిడి చేయటం వల్లనే డబ్బులకు ఆశపడి వెళ్లినట్లుగా తెలియజేసినట్లు తెలుస్తోంది. అయితే నగదు మార్పిడికి సంబంధించి తమ వాహనంలో ఎలాంటి రూ.2 వేలు నోట్లు తీసుకెళ్లలేదని, అవతల వ్యక్తుల నుంచి రూ.500 నోట్లను తీసుకురావటం జరిగిందని చెప్పినట్లు సమాచారం. సినిమా షూటింగ్‌ నిమిత్తం ఆమె నృత్య వీడియోలపై కూడా పోలీసు ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు