WI vs IND: అ‘స్పిన్‌’ మాయాజాలంతో విండీస్‌ విలవిల.. భారత్‌కు ఇన్నింగ్స్‌ విజయం

డొమినికా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టి ఇన్నింగ్స్‌, 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Updated : 15 Jul 2023 05:34 IST

డొమినికా: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (2023-25) సైకిల్‌లో భారత్‌ (Team India)కు అదిరే ఆరంభం లభించింది. డొమినికా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టడంతో మ్యాచ్‌ మూడ్రోజుల్లోనే ముగిసింది. 312/2 ఓవర్‌ నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. 421/5 వద్ద డిక్లేర్‌ చేసింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో 271 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన కరీబియన్‌ జట్టు.. అశ్విన్ (7/71) స్పిన్‌ మాయాజాలంతో 130 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్‌ ఇన్నింగ్స్‌, 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌ 150 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. అరంగేట్రంలోనే శతకంతో ఆకట్టుకున్న యశస్వి జైస్వాల్ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. రెండో టెస్టు జులై 20న మొదలుకానుంది.

విండీస్ పతనం సాగిందిలా..

తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టి విండీస్‌ను దెబ్బకొట్టిన అశ్విన్‌.. రెండో ఇన్నింగ్స్‌లోనూ తన స్పిన్‌ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. దీంతో కరీబియన్‌ జట్టు బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. త్యాగ్‌నారాయణ్‌ చందర్‌పాల్ (7)ను జడేజా ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపడంతో విండీస్ పతనం మొదలైంది. కొద్దిసేపటికే క్రెయిగ్ బ్రాత్‌వైట్ (7) అశ్విన్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో రహానెకు చిక్కాడు. టీ విరామ సమయానికి 27/2తో నిలిచిన వెస్టిండీస్‌ చివరి సెషన్‌లో ఎనిమిది వికెట్లు కోల్పోయింది. చివరి సెషన్‌ ఆరంభం కాగానే  బ్లాక్‌వుడ్ (5)ను అశ్విన్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కాసేపటికే రీఫర్‌ (11)ను జడేజా పెవిలియన్‌కు పంపాడు. సిరాజ్‌ బౌలింగ్‌లో ద సిల్వా (13) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 

చివరి ఐదు అశ్విన్‌కే 

విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో చివరి ఐదు వికెట్లు అశ్విన్‌ ఖాతాలోనే చేరాయి. నిలకడగా ఆడుతూ విండీస్‌ను ఆదుకునే ప్రయత్నం చేసిన అథనేజ్‌ (28) స్లిప్‌లో యశస్వి జైస్వాల్‌కు చిక్కాడు. అల్జారీ జోసెఫ్‌ (13) శుభ్‌మన్‌ గిల్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. భారీకాయుడు రఖీమ్‌ కార్న్‌వాల్‌ (4), కీమర్‌ రోచ్‌ (0)లు ఒకే ఓవర్‌లో ఔటయ్యారు. ఈ క్రమంలో మూడో రోజు నిర్ణీత ఓవర్లు ముగిశాయి. అయితే, ఆలౌట్‌కు విండీస్‌ ఒక వికెట్ దూరంలోనే ఉండటంతో మ్యాచ్‌ను అరగంట సేపు పొడగించారు. ఆఖర్లో మూడు ఫోర్లు బాదిన వారికన్ (18) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడంతో విండీస్‌ ఆలౌటైంది.

మొదటి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా ప్లేయర్లలో యశస్వి జైస్వాల్‌ (171; 387 బంతుల్లో 16×4, 1×6) తొలి మ్యాచ్‌లోనే సత్తాచాటాడు. కెప్టెన్‌ రోహిత్ శర్మ (103; 221 బంతుల్లో 10×4, 2×6) శతకం సాధించగా.. స్టార్‌ ప్లేయర్ విరాట్ కోహ్లీ (76; 182 బంతుల్లో 5×4) అర్ధ శతకం బాదాడు. జడేజా (37 నాటౌట్‌; 82 బంతుల్లో 3×4, 1×6) కూడా రాణించాడు. విండీస్‌ బౌలర్లలో కీమర్‌ రోచ్‌, అల్జారీ జోసెఫ్‌, రఖీమ్‌ కార్న్‌వాల్, వారికన్, అథనేజ్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని