Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 19 Jul 2023 09:12 IST

1. ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు కొత్త డిజిటల్‌ కార్డులు

రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పరిమితి రూ.2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచిన నేపథ్యంలో లబ్ధిదారులకు కొత్త డిజిటల్‌ కార్డులను అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. వీటిని స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా జిల్లాల్లోని లబ్ధిదారులకు అందించనుంది. ఆరోగ్యశ్రీ రోగులకు ఫేస్‌ రికగ్నిషన్‌(ముఖ గుర్తింపు) సాఫ్ట్‌వేర్‌ వినియోగానికి ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ అనుమతించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఎన్నికల ప్రచార వ్యయంపై మరింత నిఘా!

ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల వ్యయంపై మరింత నిఘా పెట్టేందుకు ప్రత్యేక సాంకేతికతను జోడించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న ఎన్నికల వ్యయంపై నిఘాను మరింత విస్తృతం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. అభ్యర్థుల ఖర్చుల వివరాలను రహస్య పరిశీలన రిజిస్టర్‌(షాడో అబ్జర్వేషన్‌ రిజిస్టర్‌) పేరుతో ఎన్నికల సంఘం నమోదు చేస్తుంది. ఇందుకోసం ప్రస్తుతం ‘అభ్యర్థుల ఖర్చుల పర్యవేక్షణ వ్యవస్థ’ (క్యాండిడేట్‌ ఎక్స్‌పెండిచర్‌ మానిటరింగ్‌ సిస్టం) పేరిట ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఈసీ సిద్ధం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ 24 నుంచి..

: ఇంజినీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఈనెల 24 నుంచి ప్రారంభిస్తున్నట్లు కన్వీనర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈనెల 24 నుంచి ఆగస్టు మూడో తేదీ వరకు రిజిస్ట్రేషన్లు, 25 నుంచి ఆగస్టు 4 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కోర్సులు, కళాశాలల ఎంపిక ఐచ్ఛికాల నమోదుకు ఆగస్టు 3 నుంచి 8వరకు అవకాశం కల్పించామని, ఐచ్ఛికాల మార్పు ఆగస్టు 9న చేసుకోవచ్చని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ప్రపంచంలో అతిపెద్ద కార్యాలయం.. సూరత్‌లో

ప్రపంచంలో అతిపెద్ద కార్యాలయం ఏదంటే.. అమెరికాలోని పెంటగాన్‌ అని చాలామంది చెబుతారు. దీన్ని మించిన పెద్ద కార్యాలయం.. ప్రపంచ వజ్రాల రాజధానిగా గుర్తింపు పొందిన గుజరాత్‌లోని సూరత్‌లో నిర్మించడం విశేషం. ప్రపంచంలోని 90 శాతం వజ్రాలు సూరత్‌లోనే తయారు చేస్తారు. నిత్యం వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారులు ఇక్కడకు వస్తుంటారు. వ్యాపారం సులువుగా సాగేందుకు ‘సూరత్‌ డైమండ్‌ బోర్స్‌’ (ఎస్‌డీబీ) సంస్థ కార్యాలయ నిర్మాణం చేపట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పాన్‌ చెల్లుబాటులో లేదా?

ఆధార్‌తో అనుసంధానించక పోవడం వల్ల పాన్‌ చెల్లుబాటులో లేని ప్రవాస భారతీయులు(ఎన్నారైలు) వెంటనే పన్ను అధికారులను సంప్రదించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం సూచించింది. పలువురు ఎన్నారైలు తమ పాన్‌ పనిచేయడం లేదని ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో ఐటీ విభాగం ట్విటర్‌లో స్పందించింది. ఎన్నారైలు/ఓవర్సీస్‌ సిటిజన్స్‌ ఆఫ్‌ ఇండియా(ఓసీఐ) వారి పాన్‌ పనిచేయకపోవడంపై ఆందోళన చెందుతున్నట్లు అందులో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఏపీ విద్యార్థులకు 200 స్థానికేతర ఎంబీబీఎస్‌ సీట్లు

 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన తరవాత కొత్తగా ఏర్పడ్డ 7 ప్రభుత్వ, 5 ప్రైవేటు వైద్య కళాశాలల్లో 15 శాతం స్థానికేతర సీట్లను రాష్ట్ర విద్యార్థులతో భర్తీ చేయనున్నామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ర్యాంకర్లకు ఊరట లభించింది. సుమారు 200 ఎంబీబీఎస్‌ సీట్లను స్థానికులకే కేటాయించనున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఆల్‌ ఇండియా కోటా కింద 15 శాతం సీట్లు పోగా మిగిలిన 85 శాతం సీట్లను ఇక నుంచి లోకల్‌ అభ్యర్థులకే కేటాయించనున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ప్రకాశంలోనే ఉంటా.. దమ్ముంటే వస్తారా!

యువగళం పాదయాత్ర 158వ రోజైన మంగళవారం కొండపి నియోజకవర్గంలోని చెరుకూరివారిపాలెంలో సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైంది. 5 గంటలకు కె.అగ్రహారంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణానికి లోకేశ్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీళ్లిచ్చే గడువులను ఇప్పటికి ఆరుసార్లు మార్చారు. కానీ ఎప్పటికి పూర్తవుతుందో తెలియకుంది అని ఎద్దేవా చేశారు. గుండ్లకమ్మ జలాశయం గేట్లు కొట్టుకుపోతే ఏడాదైనా అమర్చలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. సంకటంలో స్థానిక ప్రయాణం

కేవలం రూ.5 టిక్కెట్‌తో 20 కిలోమీటర్ల దూరం.. రూ.10 టిక్కెట్‌తో 40 కిలోమీటర్ల దూరం.. కాలుష్యం లేని వేగవంతమైన ప్రయాణం ఎంఎంటీఎస్‌ల సొంతం. ముంబయిలో నిత్యం 2,250 సర్వీసులు క్షణం ఆలస్యం లేకుండా ప్రయాణాలు సాగించే తీరు ఇతర నగరాలకు ఆదర్శమనే చెప్పాలి. ఒక్కో మార్గంలో కనీసం నాలుగు, ఆరు లైన్లకు తగ్గకుండా ఉండడంతో ఆ మార్గాల్లోనే లోకల్‌ రైళ్లతో పాటు ఎక్స్‌ప్రెస్‌లు, పాసింజర్లు పరుగులు పెడుతుంటాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. బ్రాంచి మారాలా..వద్దా తేల్చుకోలేకపోతున్నా

ఉద్యోగావకాశాలు అనేవి బ్రాంచిని బట్టి మాత్రమే కాకుండా నైపుణ్యాలు, విషయ పరిజ్ఞానంపై ఆధారపడి ఉంటాయి. బ్రాంచి మారే నిర్ణయం తీసుకునేముందు మీ దీర్ఘకాలిక, స్వల్పకాలిక ఆశయాలను దృష్టిలో పెట్టుకోండి. అసలు మీరు ఇంజినీరింగ్‌లో మీ ఇష్ట ప్రకారమే చేరారా? ఎవరైనా బలవంతంగా చేర్పించారా? అనేది గుర్తుకు తెచ్చుకోండి. బంధువులు, స్నేహితులు సలహాలు ఇస్తూనే ఉంటారు. కానీ, ఆ సలహాల పర్యవసానాల్ని మీరే భరించాలి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. 134 ఎకరాలు హాంఫట్‌

రూ. కోట్ల విలువైన దేవుడి మాన్యాలు ఆక్రమణ చెరలో చిక్కాయి. దక్షిణ సింహాచలంగా గణతికెక్కిన పాతసింగరాయకొండ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ భూములను అధికార పార్టీ నేతలు ఆక్రమించుకుని విక్రయిస్తున్నా యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది. ఈ అంశం కలెక్టర్‌ దృష్టికి వెళ్లడంతో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించి ఆక్రమణదారులపై కొరడా ఝుళిపించాలని ఆదేశాలివ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని