logo

సంకటంలో స్థానిక ప్రయాణం

కేవలం రూ.5 టిక్కెట్‌తో 20 కిలోమీటర్ల దూరం.. రూ.10 టిక్కెట్‌తో 40 కిలోమీటర్ల దూరం.. కాలుష్యం లేని వేగవంతమైన ప్రయాణం ఎంఎంటీఎస్‌ల సొంతం.

Updated : 19 Jul 2023 07:28 IST

చీటికీమాటికీ  ఎంఎంటీఎస్‌ల రద్దు
లైన్ల పెంపుతోనే సమస్యకు పరిష్కారం

కేవలం రూ.5 టిక్కెట్‌తో 20 కిలోమీటర్ల దూరం.. రూ.10 టిక్కెట్‌తో 40 కిలోమీటర్ల దూరం.. కాలుష్యం లేని వేగవంతమైన ప్రయాణం ఎంఎంటీఎస్‌ల సొంతం. ముంబయిలో నిత్యం 2,250 సర్వీసులు క్షణం ఆలస్యం లేకుండా ప్రయాణాలు సాగించే తీరు ఇతర నగరాలకు ఆదర్శమనే చెప్పాలి. ఒక్కో మార్గంలో కనీసం నాలుగు, ఆరు లైన్లకు తగ్గకుండా ఉండడంతో ఆ మార్గాల్లోనే లోకల్‌ రైళ్లతో పాటు ఎక్స్‌ప్రెస్‌లు, పాసింజర్లు పరుగులు పెడుతుంటాయి. అలాంటి ప్రజారవాణా కాకపోయినా కనీసం నాలుగు లైన్లు నగరంలో ఉండాలని ఇక్కడి ప్రయాణికులు కోరుతున్నారు. అప్పుడే ఎంఎంటీఎస్‌ రైళ్ల ప్రయాణం ఆటంకం లేకుండా సాగుతందని రవాణారంగ నిపుణులు చెబుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వమే చొరవ చూపాలి

నగరంలో ఉన్నవి రెండే లైన్లు. వీటిపైనే వందల సంఖ్యలో రైళ్లు పరుగులు తీయాల్సిన పరిస్థితి. దూరప్రాంతాలకు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల మధ్య ఖాళీ దొరికితే ఎంఎంటీఎస్‌లు నడపాల్సిన పరిస్థితి. దీంతో అరగంట, గంటకో ఎంఎంటీఎస్‌ నడుపుతున్నారు. కొన్నిసార్లు అవి కూడా రద్దు చేస్తున్నారు. కరోనాకు ముందు ఎంఎంటీఎస్‌ 121 సర్వీసుల్లో 1.80 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించేవారు. కరోనా తర్వాత రెండోదశ ఎంఎంటీఎస్‌ ప్రారంభించినా 86 సర్వీసులు 60 వేల మంది ప్రయాణికులతో కునారిల్లుతోంది. వీటిలోనూ 22 సర్వీసులను నెలలో నాలుగైదు సార్లు రద్దు చేస్తుండడం చికాకు తెప్పిస్తోంది. ప్రస్తుతం ఉన్న రెండు లైన్లకు అదనంగా మరో రెండు లైన్లు వస్తే ప్రతి 5 నిమిషాలకో ఎంఎంటీఎస్‌ నడపడానికి అవకాశం ఉంటుంది. అదనపు లైన్లు వేయడానికి పట్టాలకు ఆనుకుని ఉన్న ఆక్రమణలను తొలగించాలి. ఇందు కోసం వారికి ప్రత్యామ్నాయం చూపి తగిన స్థలం కేటాయిస్తే నాలుగు లైన్లు వేయడానికి రైల్వే సిద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని రవాణారంగ నిపుణుడు ప్రశాంత్‌ కోరుతున్నారు.

రెండో దశలోనూ...

నగరంలో ఎంఎంటీఎస్‌ మొదటి దశ లింగంపల్లి- బేగంపేట- సికింద్రాబాద్‌- కాచిగూడ- ఫలక్‌నుమా 44 కిలోమీటర్ల మేర అందుబాటులోకి వస్తే, రెండో మార్గం కింద బేగంపేట- నాంపల్లి మరో 4 కిలోమీటర్ల మేర ప్రయాణాలకు సాధ్యపడింది. ఇలా 48 కిలోమీటర్లను మొదటిదశలో అప్పటివరకూ ఉన్న రెండు లైన్లతోనే సర్దుబాటు చేశారు. కొత్తగా స్టేషన్లను మాత్రమే నిర్మించారు. రెండోదశ కింద 95 కిలోమీటర్లు అందుబాటులోకి తీసుకొస్తే మౌలాలి- ఘట్‌కేసర్‌ మధ్య మినహా అంతటా రెండు లైన్లే అందుబాటులోకి వచ్చాయి. ప్రత్యేక లైన్లు లేకపోవడంతో చీటికిమాటికి వాటిని రద్దు చేస్తున్నారు.

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని