logo

ప్రకాశంలోనే ఉంటా.. దమ్ముంటే వస్తారా!

కొండపి నియోజకవర్గానికి జగన్‌ అనేక హామీలు ఇచ్చారు. ఆ తర్వాత వాటి ఊసే మరిచారు. అధికార పార్టీకి గతంలో ఉన్న ఇన్‌ఛార్జి సాగించిన దోపిడికీ జనం జడుసుకున్నారు

Published : 19 Jul 2023 03:10 IST

జిల్లా అభివృద్ధిపై చర్చించేందుకు సిద్ధం

గుర్తుంచుకుంటాం.. వడ్డీతో సహా చెల్లిస్తాం

యువగళం బహిరంగ సభలో నారా లోకేశ్‌

కొండపి మండలం కె.అగ్రహారం బహిరంగ సభ వేదిక పైనుంచి అభివాదం చేస్తున్న లోకేశ్‌.. చిత్రంలో ఎమ్మెల్యేలు స్వామి, గొట్టిపాటి, మాజీ ఎమ్మెల్యేలు జనార్దన్‌, అశోక్‌రెడ్డి, నాయకులు సత్య, నూకసాని బాలాజీ, కొండయ్య, రఘునాథరెడ్డి తదితరులు

‘కొండపి నియోజకవర్గానికి జగన్‌ అనేక హామీలు ఇచ్చారు. ఆ తర్వాత వాటి ఊసే మరిచారు. అధికార పార్టీకి గతంలో ఉన్న ఇన్‌ఛార్జి సాగించిన దోపిడికీ జనం జడుసుకున్నారు. అతని స్థానంలో వచ్చిన మరొకరి దెబ్బకు ప్రజలు భయపడి ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు. త్వరలో మూడు, తర్వాత నాలుగో ఇన్‌ఛార్జి కూడా వస్తారు. నియోజకవర్గంలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అక్రమంగా ఇసుక, మట్టి తవ్వకాలు సాగిస్తూ ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పడుతున్నారు. అంగన్‌వాడీ టీచర్‌ హనుమాయమ్మను వైకాపా నేత ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేకపోయింది. అన్నీ గుర్తు పెట్టుకుంటాం. వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం..’ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు.  

ఈనాడు, ఒంగోలు, న్యూస్‌టుడే, టంగుటూరు 

లోకేశ్‌తో కరచాలనం చేసేందుకు విద్యార్థినుల ఉత్సాహం

యువగళం పాదయాత్ర 158వ రోజైన మంగళవారం కొండపి నియోజకవర్గంలోని చెరుకూరివారిపాలెంలో సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైంది. 5 గంటలకు కె.అగ్రహారంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణానికి లోకేశ్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీళ్లిచ్చే గడువులను ఇప్పటికి ఆరుసార్లు మార్చారు. కానీ ఎప్పటికి పూర్తవుతుందో తెలియకుంది అని ఎద్దేవా చేశారు. గుండ్లకమ్మ జలాశయం గేట్లు కొట్టుకుపోతే ఏడాదైనా అమర్చలేదు. కల్పతరువు వంటి జలాశయాన్ని ఏకంగా ప్రమాదంలోకి నెట్టారు. నిమ్జ్‌, దొనకొండ పారిశ్రామిక కారిడార్‌ వంటి అనేక ప్రాజెక్టులను వైకాపా ప్రభుత్వం గాలికొదిలేసింది. కొండపి నియోజకవర్గంలో అభివృద్ధి చేసిన ఘనత తెదేపా అని అన్నారు. మరో రెండు వారాలు ప్రకాశం జిల్లాలోనే తాను ఉంటానని.. వైకాపాకు దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్‌ విసిరారు.

నిమ్మకాయలతో తయారు చేసిన గజమాలతో లోకేశ్‌కు స్వాగతం పలుకుతున్న తెదేపా నాయకులు.. చిత్రంలో ఉగ్ర నరసింహారెడ్డి

* వారిదంతా దోపిడీ...: కొండపిలో ఇదివరకు ఉన్న అధికార పార్టీ ఇన్‌ఛార్జి దోపిడీ చేసి వెళ్లిపోయారు. తర్వాత వచ్చిన వ్యక్తి ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో చిచ్చు రేపుతూ అరాచకాలకు పాల్పడుతున్నారు. అభివృద్ధి చేయమని అడగటం ఎమ్మెల్యే స్వామి చేసిన తప్పా అని ప్రశ్నించారు. దళిత ఎమ్మెల్యేపై అక్రమ కేసులు పెట్టి వేధించారని.. వీటన్నింటికీ బదులిస్తామన్నారు. ఫ్లూటు జింక ముందు ఊదాలి కానీ సింహం ముందు కాదన్నారు. 2024 ఎన్నికల్లో సింహం వంటి స్వామిని గెలిపించాలని ప్రజలను కోరారు.
* కష్టాలు చూశా.. తప్పక తీరుస్తా...: రైతులకు మద్దతు ధర కల్పించి, ప్రాజెక్టులను పూర్తిచేస్తామని లోకేశ్‌ హామీ ఇచ్చారు. మూసివేసిన ఒంగోలు డెయిరీని మళ్లీ తెరిపిస్తామని చెప్పారు. సంగమేశ్వరం ప్రాజెక్టును నిర్మించి తాగు, సాగు నీరు ఇస్తామన్నారు. మూసి, మానేరు, పాలేరు నదులపై చెక్‌ డ్యాములు నిర్మించి, వెలిగొండ తూర్పు కాలువలను అనుసంధానం చేస్తామని హామీ ఇచ్చారు. పొగాకు, జామాయిల్‌ రైతుల కష్టాలు దగ్గరగా చూశానని, పెట్టుబడి తగ్గించి, గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. తెదేపా అధికారంలోకి రాగానే విద్యుత్తు ధరలు తగ్గించి, దాణా, మందులు, యంత్రాల వ్యయం తగ్గించి ఆక్వా రైతులను అదుకుంటామని లోకేశ్‌ హామీ ఇచ్చారు. తనపై చూపిన ప్రేమకుగాను ప్రకాశం జిల్లా వాసులకు రుణపడి ఉంటానని వ్యాఖ్యానించారు.
*   పవిత్ర నేల ఇది...: తెదేపా కంచుకోట కొండపి నియోజకవర్గం.. వరాహ లక్ష్మీనరసింహాస్వామి, వల్లూరమ్మ ఆలయాలు ఉన్న పుణ్యభూమి ఇది. నియోజకవర్గం రూపురేఖలు మార్చింది తెదేపా, దామచర్ల కుటుంబమేనని లోకేశ్‌ అన్నారు. పవిత్రనేలపై పాదయాత్ర చేయడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. కొండపి అభివృద్ధిలో దామచర్ల సత్య, స్వామి జోడీ భాగస్వామ్యం కృషి కనిపిస్తోందని, వారు గత ప్రభుత్వ హయాంలో పోరాడి నిధులు సాధించారని గుర్తు చేశారు.
* కనిగిరిలోకి యువగళం...: నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర కొండపి నియోజకవర్గంలో మంగళవారం సాయంత్రంతో ముగిసింది. ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు వైభవంగా సాగింది. కొండపి, కందుకూరు, కనిగిరి, ఒంగోలు ఇతర నియోజకవర్గాల నుంచి భారీసంఖ్యలో తెదేపా శ్రేణులు తరలివచ్చాయి. పాదయాత్ర కనిగిరి నియోజవర్గంలోకి ప్రవేశించింది. పీసీపల్లి మండలం పెద అలవలపాడు సమీపంలో పాలేటి గంగమ్మ దేవాలయం వద్ద లోకేశ్‌కు మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు