ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు కొత్త డిజిటల్‌ కార్డులు

రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పరిమితి రూ.2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచిన నేపథ్యంలో లబ్ధిదారులకు కొత్త డిజిటల్‌ కార్డులను అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది.

Published : 19 Jul 2023 05:33 IST

ఎంజీఎంలోనూ కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీలు
ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ బోర్డు సమావేశంలో నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పరిమితి రూ.2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచిన నేపథ్యంలో లబ్ధిదారులకు కొత్త డిజిటల్‌ కార్డులను అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. వీటిని స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా జిల్లాల్లోని లబ్ధిదారులకు అందించనుంది. ఆరోగ్యశ్రీ రోగులకు ఫేస్‌ రికగ్నిషన్‌(ముఖ గుర్తింపు) సాఫ్ట్‌వేర్‌ వినియోగానికి ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ అనుమతించింది. మంగళవారం హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ కార్యాలయంలో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆధ్వర్యంలో బోర్డు సమావేశం జరిగింది. దీనికి వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ సీఈఓ విశాలాచ్చి, సీఎం ఓఎస్డీ గంగాధర్‌, డీఎంఈ రమేశ్‌రెడ్డి, ప్రజారోగ్యశాఖ సంచాలకులు జి.శ్రీనివాసరావు, వైద్యవిధానపరిషత్‌ కమిషనర్‌ అజయ్‌కుమార్‌, నిమ్స్‌ డైరెక్టర్‌ బీరప్ప హాజరయ్యారు.

మంత్రి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీలో బయోమెట్రిక్‌ విధానం వల్ల కొంత ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ప్రజలకు మరింత పారదర్శకంగా సేవలందించేందుకు ఫేస్‌ రికగ్నిషన్‌ విధానం అమలులోకి తేవాలన్నారు. కొత్త కార్డులను అందించేందుకు లబ్ధిదారుల కేవైసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. నిమ్స్‌ స్పెషలిస్ట్‌ వైద్యుల ద్వారా ఆరోగ్యశ్రీ కేసుల మెడికల్‌ ఆడిట్‌ నిర్వహించాలన్నారు. కొవిడ్‌ సమయంలో రికార్డు స్థాయిలో 856 బ్లాక్‌ఫంగస్‌ సర్జరీలను నిర్వహించిన కోఠి ఈఎన్టీ ఆసుపత్రికి రూ.1.30 కోట్ల అదనపు ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయించారు. పిల్లల వినికిడి సమస్య పరిష్కారానికి కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీలు ప్రస్తుతం కోఠి ఈఎన్టీ ఆసుపత్రిలో ప్రభుత్వం ఉచితంగా చేస్తుండగా.. త్వరలో వరంగల్‌ ఎంజీఎంలోనూ ఈ సర్జరీలను చేసేందుకు వీలుగా కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో డయాలసిస్‌ సేవలు మరింత నాణ్యంగా అందించేందుకు.. ఆన్‌లైన్‌లో పర్యవేక్షించేలా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపొందించి, వినియోగించేందుకు బోర్డు అనుమతించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని