ఎన్నికల ప్రచార వ్యయంపై మరింత నిఘా!

ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల వ్యయంపై మరింత నిఘా పెట్టేందుకు ప్రత్యేక సాంకేతికతను జోడించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.

Published : 19 Jul 2023 03:55 IST

ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపొందించిన ఎన్నికల సంఘం
తెలంగాణ, మరో నాలుగు రాష్ట్రాల్లో అమలుకు యోచన
అసెంబ్లీ ఎన్నికలకు కసరత్తు ముమ్మరం

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల వ్యయంపై మరింత నిఘా పెట్టేందుకు ప్రత్యేక సాంకేతికతను జోడించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న ఎన్నికల వ్యయంపై నిఘాను మరింత విస్తృతం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. అభ్యర్థుల ఖర్చుల వివరాలను రహస్య పరిశీలన రిజిస్టర్‌(షాడో అబ్జర్వేషన్‌ రిజిస్టర్‌) పేరుతో ఎన్నికల సంఘం నమోదు చేస్తుంది. ఇందుకోసం ప్రస్తుతం ‘అభ్యర్థుల ఖర్చుల పర్యవేక్షణ వ్యవస్థ’ (క్యాండిడేట్‌ ఎక్స్‌పెండిచర్‌ మానిటరింగ్‌ సిస్టం) పేరిట ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఈసీ సిద్ధం చేసింది. త్వరలో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ అభ్యర్థులు చేసే ఖర్చులపై నిఘా పెట్టేందుకు ఈ సాఫ్ట్‌వేర్‌ వినియోగించాలని నిర్ణయించింది. ఈ సాంకేతికతను మరింత పటిష్ఠం చేసేందుకు సూచనలను అందించాలని ఆయా రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులను కోరింది. వారు సూచించిన మార్పులతో సాఫ్ట్‌వేర్‌కు తుదిరూపు తీసుకువచ్చినట్లు సమాచారం.

పది విభాగాలుగా వ్యయం

ఎన్నికల వ్యయానికి సంబంధించిన వివరాలను అభ్యర్థులు నిర్ధారిత వ్యవధుల్లో ఈసీ అధికారులకు అందజేస్తారు. ఆ కాగితాలు పెద్ద సంఖ్యలో ఉండటంతో తనిఖీలు చేయటం ప్రహసనమేనని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. ఈక్రమంలో నిఘాను పెంచేందుకు ప్రచార వ్యయాన్ని 10 విభాగాలుగా కేంద్ర ఎన్నికల సంఘం విభజించింది. ఆ విభాగాల పరిధిలో 50 అంశాలను పొందుపరిచింది. భారీ సభల నుంచి పత్రికల్లో ఇచ్చే ప్రకటనల వరకు అన్నింటినీ గుర్తించింది. పోటీలో అభ్యర్థులకు సొంత పత్రికలు, టెలివిజన్‌ ఛానల్స్‌, సోషల్‌ మీడియా సంస్థలు ఉంటే వాటిల్లో చేసే ప్రచార వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఎన్నికల ప్రచారం కోసం వినియోగించే వ్యక్తులకు చెల్లించే వేతనం, రోజువారీ వ్యయాలను లెక్కించనుంది. ఎన్నికల సమయంలో పట్టుపడిన నగదు, వివిధ రూపాల్లో పంపిణీ చేసే వస్తువులను, ఆయా అభ్యర్థుల ఎన్నికల వ్యయంలో నమోదు చేయాలని నిశ్చయించినట్లు సమాచారం. త్వరలో 5 రాష్ట్రాలకు, అనంతరం సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో నూతన సాఫ్ట్‌వేర్‌ను అమలులోకి తేవాలని సీఈసీ కసరత్తును ముమ్మరం చేసింది.

దిల్లీ నుంచి పర్యవేక్షణ

కొత్త సాఫ్ట్‌వేర్‌ ద్వారా నమోదు చేసే అభ్యర్థుల ప్రచార వ్యయాన్ని దిల్లీలోని ప్రధాన కార్యాలయంలోనూ పర్యవేక్షించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో బృందాన్ని ఏర్పాటు చేసి రోజువారీ వ్యయాన్ని ఆన్‌లైన్‌ ద్వారా పర్యవేక్షించాలని యోచిస్తోంది. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించటంతో పర్యవేక్షణ మరింత సులువవుతుందని ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’కు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు