Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 15 Apr 2024 21:03 IST

1.జగనన్న కాదు.. జలగన్న: చంద్రబాబు

రాష్ట్రంలో దొంగలు పడ్డారని, అందరం కలిసి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఐదేళ్లపాటు ప్రజలు అనేక బాధలు పడ్డారని అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. మద్యం, కరెంటు బిల్లు, ఇసుక, సిమెంట్‌, ఇనుము, పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర వస్తువుల ధరలు పెంచేసి.. ప్రజల రక్తాన్ని జగన్‌ జలగలా పీల్చేశారని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఆగస్టు 15 నాటికి రైతు రుణమాఫీ: రేవంత్‌ రెడ్డి

రాష్ట్రంలో 15 ఎంపీ సీట్లను గెలిపిస్తే ముదిరాజ్‌ బిడ్డను మంత్రిగా చేస్తానని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 10శాతం జనాభా ఉన్న ముదిరాజ్‌లకు కేసీఆర్‌ ఒక్క టికెట్‌ కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల మేర రైతు రుణమాఫీ చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ధాన్యాన్ని కనీస మద్దతు ధర కంటే తక్కువకు అమ్ముకోవద్దు: మంత్రి ఉత్తమ్‌

తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో రైతులు నష్టపోతున్నట్లు ప్రతిపక్షాలు చేస్తోన్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను గత ప్రభుత్వం కంటే ఎక్కువ ఏర్పాటుచేశామని తెలిపారు. తెలంగాణ రైతులు ఒక్క గింజ ధాన్యం కూడా కనీస మద్దతు ధరకు తక్కువకు అమ్ముకోవద్దన్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. వైకాపాకి ఓటేస్తే.. ఈసారి ప్రజల్ని అమ్మేస్తారు: షర్మిల

వైకాపాకి మరోసారి ఓటు వేస్తే ప్రజల్ని కూడా అమ్మేస్తారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్‌.. ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారని ప్రశ్నించారు. కుంభకర్ణుడైనా ఆరు నెలలకు ఒకసారి నిద్ర లేస్తాడు కానీ, జగన్‌ మాత్రం నాలుగున్నర సంవత్సరాల తర్వాత నిద్ర లేచి.. ఎన్నికల ముంగిట హడావుడిగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చారని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. విద్యుత్‌ నిలిపివేత సెక్యూరిటీ ప్రొటోకాల్‌లో భాగమే: విజయవాడ సీపీ కాంతిరాణా

సీఎం విజయవాడ పర్యటనలో తగినంత భద్రత కల్పించామని నగర సీపీ కాంతిరాణా టాటా తెలిపారు. ఏపీ ఎస్పీ నుంచి నాలుగు ప్లాటూన్లతోపాటు ఆక్టోపస్‌, సీఎం సెక్యూరిటీ కూడా ఉందని చెప్పారు. సీఎం జగన్‌పై గులకరాయి దాడి ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం యాత్రలో విద్యుత్‌ నిలిపివేయడం అనేది సెక్యూరిటీ ప్రోటోకాల్‌లో భాగమేనన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. భాజపాపై మీ ఉత్సాహం వారికి నిద్ర లేకుండా చేస్తోంది: మోదీ

గత పదేళ్ల పాలనలో తమిళనాడు అభివృద్ధి కోసం తాము రేయింబవళ్లు పని చేశామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన తిరునల్వేలిలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సభకు విచ్చేసిన జనాన్ని ఉద్దేశిస్తూ.. ‘భాజపాపై మీ ఉత్సాహం డీఎంకే, విపక్ష ‘ఇండియా’ కూటమికి నిద్ర లేకుండా చేస్తున్నాయి’ అని మోదీ వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. దేశంలో ఒకే నాయకుడు ఉండాలనే భాజపా ఆలోచన అవమానకరం: రాహుల్ గాంధీ

కేంద్ర ప్రభుత్వం దేశంలో ఒకే నాయకుడు ఉండాలని కోరుకుంటుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం ఆరోపించారు.  ఇలాంటి ఆలోచన దేశ ప్రజలను అవమానించడమే అవుతుందని మండిపడ్డారు.  రాహుల్‌ వయనాడ్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ రోడ్ షో నిర్వహించారు. అనంతరం నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు, ఆటగాళ్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు..! ఉల్లంఘిస్తే జరిమానా

ఐపీఎల్‌ మ్యాచ్‌ జరిగే రోజు ఆ మ్యాచ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను స్టేడియం నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై బీసీసీఐ సీరియస్‌ అయినట్లు తెలుస్తోంది. మ్యాచ్‌ జరిగే రోజు వ్యాఖ్యాతలు, ఆటగాళ్లు, ఫ్రాంచైజీ యజమానులు, ఐపీఎల్‌ జట్లకు సంబంధించిన సోషల్ మీడియా, కంటెంట్ టీమ్‌లు స్టేడియం నుంచి ఎలాంటి ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయొద్దని బీసీసీఐ ఆదేశించినట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. 4 లోక్‌సభ స్థానాలు.. 200 సంకల్ప్‌ సభలు- ఆప్‌ నిర్ణయం

లోక్‌సభ ఎన్నికల వేళ కేజ్రీవాల్‌ అరెస్టు నేపథ్యంలో ఆమ్‌ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు లోక్‌సభ నియోజకవర్గాల్లో 200 సంకల్ప్‌ సభలు నిర్వహించాలని నిర్ణయించింది. ఆప్‌ జాతీయ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ అరెస్టుకు వ్యతిరేకంగా ప్రజల మద్దతు కూడగట్టనున్నట్లు ఆ పార్టీ సీనియర్‌ నేత గోపాల్‌రాయ్‌ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. టెస్లాలో ఉద్యోగాల కోత.. 14వేల మందికి ఉద్వాసన!

ఎలాన్‌ మస్క్‌కు చెందిన విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఉద్యోగ కోతలు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఆ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగుల్లో 10 శాతం మందిని తొలగించాలని నిర్ణయించింది. దీనివల్ల సుమారు 14వేల మందిపై ఈ ప్రభావం పడనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని