Kanthi Rana: విద్యుత్‌ నిలిపివేత సెక్యూరిటీ ప్రొటోకాల్‌లో భాగమే: విజయవాడ సీపీ కాంతిరాణా

సీఎం విజయవాడ పర్యటనలో తగినంత భద్రత కల్పించామని నగర సీపీ కాంతిరాణా టాటా తెలిపారు.

Published : 15 Apr 2024 19:24 IST

విజయవాడ: సీఎం విజయవాడ పర్యటనలో తగినంత భద్రత కల్పించామని నగర సీపీ కాంతిరాణా టాటా తెలిపారు. ఏపీ ఎస్పీ నుంచి నాలుగు ప్లాటూన్లతోపాటు ఆక్టోపస్‌, సీఎం సెక్యూరిటీ కూడా ఉందని చెప్పారు. సీఎం జగన్‌పై గులకరాయి దాడి ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం యాత్రలో విద్యుత్‌ నిలిపివేయడం అనేది సెక్యూరిటీ ప్రోటోకాల్‌లో భాగమేనన్నారు.  

‘‘కరెంట్ ఎందుకు లేదని ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి. యాత్ర జరిగిన మార్గంలో కరెంట్‌ లైన్లు, కేబుల్‌ లైన్లు ఎక్కువగా ఉన్నాయి. ఎన్నికల ప్రచారానికి అన్ని రకాల తీగలు తొలగించడం కుదరదు. రూఫ్‌టాప్‌ ఎత్తు ఎక్కువగా ఉన్నప్పుడు విద్యుత్‌ నిలిపివేయడం సర్వసాధారణం. సీఎం పర్యటనకు ఒక రోజు ముందే కేబుల్‌ లైన్లు తీసేశాం. యాత్ర సమయంలో ఆ రూఫ్‌టాప్‌కి విద్యుత్‌ వైర్లు తగిలే అవకాశముంది. సీఎం భద్రత కోసమే విద్యుత్‌ నిలిపివేశాం. 

ఈ కార్యక్రమం అంతా జనసమ్మర్థం ఉన్న ప్రాంతంలో జరిగింది. అజిత్‌సింగ్‌నగర్‌లో రాత్రి 8.04 గంటలకు వివేకానంద స్కూల్‌ సమీపంలో నుంచి ఒక వ్యక్తి సీఎం పైకి బలంగా రాయి విసిరాడు. సీఎం లక్ష్యంగా రాయి విసిరినట్లు తెలుస్తోంది. చీకట్లో.. గుంపు బాగా ఉండటం చూసుకొని దుండగుడు దాడి చేశాడు. రాయి సీఎం నుదుటికి తగిలి పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్‌పై పడింది. వెల్లంపల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. ఈ ఘటనపై దర్యాప్తు కోసం 8 బృందాలు ఏర్పాటుచేశాం. సీసీటీవీ కెమెరాలు, ప్రజలు సెల్‌ఫోన్‌లో తీసిన వీడియోల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నాం. దుండగుడు ఎయిర్‌గన్‌తో కొట్టాడా? చేతితో విసిరాడా తెలియాల్సి ఉంది. దర్యాప్తు వేగంగా సాగుతోంది. అతి త్వరలోనే నిందితుడిని పట్టుకుంటాం’’అని సీపీ కాంతిరాణా వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని