Arvind Kejriwal: ఈ చిత్రాన్ని చూస్తే గుండె తరుక్కుపోతోంది: అరవింద్‌ కేజ్రీవాల్‌

దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా శనివారం అనారోగ్యంతో బాధపడుతున్న తన సతీమణి సీమాను స్వగృహంలో కలిశారు. ఈమేరకు కోర్టు 6 గంటల పాటు ఆయనకు సమయం కల్పించింది. దీనికి సంబంధించిన చిత్రాన్ని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఎక్స్‌(X)లో పోస్టు చేశారు.   

Updated : 12 Nov 2023 06:38 IST

(Photo: Twitter)

దిల్లీ: దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, మనీశ్‌ సిసోదియా(Manish Sisodia) ఈ రోజు తన సతీమణి సీమాను స్వగృహంలో కలిశారు. సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కేసు (Delhi liquor scam case)లో అరెస్టయి కొన్ని నెలలుగా సిసోదియా తిహార్‌(Tihar Jail) జైలులో ఉంటున్న విషయం తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య సీమాను కలిసేందుకు సిసోదియాకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సిటీ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో జైలు వ్యాన్‌లో పోలీసు సిబ్బందితో కలిసి దిల్లీలోని మథుర రోడ్‌లో ఉన్న తన నివాసానికి సిసోదియా వెళ్లారు. 

కోర్టు అనుమతి ఇచ్చిన 6 గంటల సమయంలో సిసోదియా తన కుటుంబంతో గడిపారు. ‘చోటీ దిపావళి’ సందర్భంగా ఇంట్లో దీపాలు వెలిగించారు. సమయం ముగిశాక ఆయన తిరిగి జైలుకు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా చెమ్మగిల్లిన కళ్లతో తన భార్యను ఆలింగనం చేసుకుని ఎంతో బాధతో వెనుదిరిగారు. ఈ చిత్రాన్ని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal) ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు చేశారు. ‘‘ఈ చిత్రాన్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. దేశంలోని పేద చిన్నారులకు జీవితంపై ఒక ఆశ కల్పించిన వ్యక్తికి ఇలా అన్యాయం చేయడం సరైందేనా?’’ అని ప్రశ్నించారు. 

దిల్లీ ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి, విద్య, ఎక్సైజ్‌ శాఖతో పాటు సిసోదియా పలు మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. ప్రభుత్వ మద్యం విధాన రూపకల్పన, అమలులో అవతవకలు చోటుచేసుకున్నాయని ఫిర్యాదు మేరకు దర్యాప్తులో భాగంగా సిసోదియాను ఈ ఏడాది ఫిబ్రవరిలో 26న సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. కోర్టు జ్యుడిషియల్‌ కస్టడీ విధించడంతో అప్పటి నుంచి ఆయన తిహాడ్‌ జైలులోనే ఉంటున్నారు. జూన్‌లో తన భార్యను కలిసేందుకు దిల్లీ హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ ఆమె ఒక్కసారిగా తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. దీంతో సిసోదియా ఆమెను అప్పుడు కలుసుకోలేకపోయారు. మద్యం కేసులో ఇటీవల సుప్రీంకోర్టు సిసోదియా బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని