Mehbooba: ఆ క్రెడిట్‌ అంతా సీబీఐ, ఈడీలకే దక్కుతుంది: ముఫ్తీ

మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వం పతనం కావడంలో క్రెడిటంతా భాజపాకో, శివసేన రెబల్‌ నేత ఏక్‌నాథ్‌ శిందేకో దక్కదని..

Published : 05 Jul 2022 01:57 IST

శ్రీనగర్‌: మహారాష్ట్రలో మహావికాస్‌ అఘాడీ సర్కార్‌ను పడగొట్టడంలో క్రెడిట్‌ అంతా సీబీఐ, ఈడీలకే దక్కుతుందని పీడీపీ అధ్యక్షురాలు, జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti) అన్నారు. ఇటీవల మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభంతో నెలకొన్న పరిణామాలపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వం పతనం కావడంలో క్రెడిట్‌ అంతా భాజపాకో, శివసేన రెబల్‌ నేత ఏక్‌నాథ్‌ శిందేకో దక్కదని.. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ, ఎన్‌ఐఏలకే దక్కుతుందని వ్యాఖ్యానించారు. ఇందులో భాజపా లేదా ఏక్‌నాథ్‌ శిందే చెప్పుకోదగిన రీతిలో ఏమీ చేయలేదన్నారు. దేశ అభ్యున్నతి కోసం పని చేయాల్సిన సంస్థలు భాజపా ప్రభుత్వం ఆదేశాల మేరకు పనిచేస్తున్నాయని ముఫ్తీ మండిపడ్డారు.

అమర్‌నాథ్‌ యాత్ర నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేయడంతో జమ్మూకశ్మీర్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపైనా మీడియా అడిగిన ప్రశ్నపై ఆమె స్పందించారు. యాత్రికులు జమ్మూకశ్మీర్‌ ప్రజలకు అతిథులని.. కానీ, వారి రాకతో స్థానికులకు నష్టం జరగకూడదని పేర్కొన్నారు. యాత్రికులకు మంచి ఆతిథ్యం కల్పించడం తామందరి బాధ్యత అన్నారు. కాకపోతే, ఆ ప్రభావం ఎవరిపైన పడుతుందనే దాన్ని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. రవాణాదారులతో పాటు త్వరగా చెడిపోయే అవకాశం ఉన్న పండ్లు, కూరగాయల వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని ముఫ్తీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని