మందుల పిచికారీకి హెలికాప్టర్‌.. రూ.7 కోట్లతో కొనుగోలు చేయనున్న రైతు

పొలంలో పురుగు మందుల పిచికారీ కోసం ఇటీవల డ్రోన్ల వినియోగం పెరిగింది. కొందరు రైతులు సొంతంగా వీటిని కొనుగోలు చేసుకుంటున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని ఓ రైతు మాత్రం ఏకంగా హెలికాప్టర్‌ కొనాలని నిర్ణయించుకున్నారు.

Published : 03 Jul 2023 06:03 IST

న్యూస్‌టుడే, చర్ల: పొలంలో పురుగు మందుల పిచికారీ కోసం ఇటీవల డ్రోన్ల వినియోగం పెరిగింది. కొందరు రైతులు సొంతంగా వీటిని కొనుగోలు చేసుకుంటున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని ఓ రైతు మాత్రం ఏకంగా హెలికాప్టర్‌ కొనాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణకు 300 కి.మీ దూరంలోని కొండగావ్‌ జిల్లాకు చెందిన రాజారాం త్రిపాఠి తన వెయ్యి ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని పర్యవేక్షించేందుకు రూ.7 కోట్లతో కొనుగోలు చేయబోతున్నారు. ఈ మేరకు హాలాండ్‌కు చెందిన రాబిన్సన్‌ కంపెనీ ఆర్‌-44 మోడల్‌(నాలుగు సీట్లు) హెలికాప్టర్‌ను బుక్‌ చేసుకున్నారు. పురుగు మందుల పిచికారీ, ఇతర వ్యవసాయ పనులకు అనుగుణంగా తయారు చేయించుకుంటున్నారు.

విదేశాల్లో చూసి..: రాజారాం ఇంగ్లండ్‌, జర్మనీలో పర్యటించినప్పుడు ఎరువుల పిచికారీకి హెలికాప్టర్ల వినియోగాన్ని చూశారు. దీంతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని తెలుసుకొని హెలికాప్టర్‌ కొనుగోలు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. తన కుమారుడు, తమ్ముడిని ఉజ్జయినిలోని ఏవియేషన్‌ అకాడమీకి పంపి పైలెట్‌ శిక్షణ ఇప్పించనున్నారు.

బ్యాంకు ఉద్యోగం వదిలి.. రైతుగా మారి..

బస్తర్‌(ఇందులో నుంచి కొండగావ్‌ జిల్లాగా వేరుపడింది)కు చెందిన వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రాజారాం 1998లో తన బ్యాంకు ఉద్యోగం వదిలేసి రైతుగా మారారు. ప్రస్తుతం బస్తర్‌, కొండగావ్‌ జిల్లాల్లో అత్యధికంగా తెల్లముస్లి(తెల్ల నేలతాడి), నల్ల మిరియాలు పండించడంతోపాటు హెర్బల్‌ సంస్థ నిర్వహిస్తున్నారు. 400 మంది గిరిజన కుటుంబాలతో వెయ్యి ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో నాలుగుసార్లు ఉత్తమ రైతు పురస్కారం అందుకున్నారు.తన సంస్థ ద్వారా ఏడాదికి రూ.25 కోట్ల టర్నోవర్‌ సాధిస్తున్నారు.  ఐరోపా, అమెరికా దేశాలకు నల్ల మిరియాలు ఎగుమతి చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని