కీళ్లవాత ఔషధంతో తగ్గనున్న కొవిడ్‌ టీకా రక్షణ

కీళ్లవాతం, మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌ వంటి రుగ్మతల చికిత్సలో భాగంగా మెథోట్రెక్సేట్‌ ఔషధాన్ని వాడుతున్న కొందరిలో కొవిడ్‌-19 టీకాతో పెద్దగా రక్షణ లభించకపోవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Published : 04 Jun 2021 04:24 IST

దిల్లీ: కీళ్లవాతం, మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌ వంటి రుగ్మతల చికిత్సలో భాగంగా మెథోట్రెక్సేట్‌ ఔషధాన్ని వాడుతున్న కొందరిలో కొవిడ్‌-19 టీకాతో పెద్దగా రక్షణ లభించకపోవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇలాంటివారిలో వ్యాక్సిన్‌ వల్ల రోగ నిరోధక స్పందన బలహీనంగా ఉండొచ్చని వివరించారు. సదరు ఇన్‌ఫ్లమేటరీ రుగ్మతలు రోగనిరోధక వ్యవస్థలో ఇబ్బందుల వల్ల వస్తుంటాయి. వ్యాధులపై పోరాడాల్సిన రోగనిరోధక వ్యవస్థ.. అసాధారణ స్థాయిలో ప్రేరేపితం కావడమే ఇందుకు కారణం. దీనివల్ల ఇన్‌ఫ్లమేషన్‌, నొప్పి, వాపు తలెత్తుతుంటాయి. వీటికి చికిత్స కోసం ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించే మందులు వాడుతుంటారు. వాటిలో మెథోట్రెక్సేట్‌ కూడా ఉంది. ఈ నేపథ్యంలో కొవిడ్‌ టీకా పొందినవారిపై ఈ ఔషధం చూపే ప్రభావాన్ని అమెరికాలోని ఎన్‌వైయూ గ్రాస్‌మాన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్తలు పరిశోధించారు. ఫైజర్‌/బయోఎన్‌టెక్‌ రూపొందించిన ఎంఆర్‌ఎన్‌ఏ టీకా పొందిన వ్యక్తులను వీరు పరిశీలించారు. వ్యాక్సిన్‌ పొందాక.. నిర్దేశిత వైరస్‌ను గుర్తించి, నిర్వీర్యం చేసే యాంటీబాడీలు ఉత్పత్తి కావాలి. మెథోట్రెక్సేట్‌ వల్ల కొందరిలో ఈ ప్రక్రియ అంత చురుగ్గా సాగడంలేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. కరోనా కట్టడికి సాయపడే సీడీ8టీ కణాలూ అంత మెరుగ్గా ఉత్పత్తి కావడంలేదని తేల్చారు. ఇన్‌ఫ్లమేషన్‌ కట్టడికి మెథోట్రెక్సేట్‌ కాకుండా ఇతర ఔషధాలు వాడేవారిలో రోగ నిరోధక ప్రతిస్పందన బాగానే ఉందని గుర్తించారు. ఈ నేపథ్యంలో మెథోట్రెక్సేట్‌ వాడుతున్న వారికి కొవిడ్‌ నుంచి రక్షణ కల్పించేందుకు ప్రత్యామ్నాయ వ్యూహాలను రూపొందించాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇందులో.. టీకా పొందే సమయంలో సదరు మందు వాడకాన్ని నిలిపివేయడం లేదా డోసేజీలో మార్పు లేదా టీకా బూస్టర్‌ డోసు ఇవ్వడం వంటి వాటిని పరిశీలించొచ్చని చెప్పారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts