Updated : 14/08/2021 09:22 IST

పఠాన్‌కోట్‌ దాడికి ఇంటిదొంగల సాయం

పాక్‌ ఉగ్రవాదులకు సహకరించిన స్థానిక పోలీసులు
బాంబులూ భారత్‌లోనే కొనుగోలు
సంచలనాలు బయటపెట్టిన తాజా పుస్తకం

దిల్లీ: పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై 2016లో ఉగ్రవాదులు జరిపిన దాడికి సంబంధించి తాజాగా సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవినీతిపరులైన కొందరు స్థానిక పోలీసులు ఈ దాడికి సహకరించి ఉండొచ్చని అంతర్జాతీయ పరిశోధనాత్మక పాత్రికేయులు ఆండ్రియాన్‌ లెవీ, క్యాథీ స్కాట్‌-క్లార్క్‌లు పేర్కొన్నారు. వీరు రాసిన ‘స్పై స్టోరీస్‌: ఇన్‌సైడ్‌ ద సీక్రెట్‌ వరల్డ్‌ ఆఫ్‌ ద ఆర్‌ఏడబ్లూ (రా) అండ్‌ ఐఎస్‌ఐ’ పుస్తకంలో దీన్ని ప్రస్తావించారు. 2016 జనవరి 2న.. భారత సైనిక దుస్తులను ధరించిన కొందరు ఉగ్రవాదులు భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దుల్లోని రావి నది పాయను దాటి పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరాన్ని చేరుకున్నారు. అక్కడే భద్రత దళాలతో ఎదురు కాల్పులు మొదలయ్యాయి. ఇందులో నలుగురు ఉగ్రవాదులు, ముగ్గురు భద్రతా సిబ్బంది చనిపోయారు. మరుసటి రోజు జరిగిన బాంబు పేలుడులో మరో నలుగురు భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వైమానిక స్థావరం మొత్తాన్నీ తమ అదుపులోకి తెచ్చుకోవడానికి భారత భద్రత దళాలకు మూడు రోజులు పట్టింది. ఈ ఘటనకు సంబంధించి పాకిస్థాన్‌పై భారత్‌ తీవ్ర విమర్శలు చేసింది.

తాజా పుస్తకంలో ప్రస్తావించిన అంశాలివీ..

భారత నిఘా వర్గాలు అందించిన అంతర్గత నివేదికలు నిక్కచ్చిగా ఉన్నాయి. ఈ ప్రాంతానికి పొంచి ఉన్న ముప్పుపై నిరంతరం హెచ్చరికలు వెలువడుతున్నప్పటికీ రక్షణకు సంబంధించిన కీలక చర్యలు అక్కడ కొరవడ్డాయి. పంజాబ్‌లోని 91 కిలోమీటర్ల మేర సరిహద్దుకు కంచె వేయలేదు. నదులు, ఎండిపోయిన నదీ పాయల వద్ద అప్రమత్తత అవసరమని నాలుగు నివేదికలు హెచ్చరించాయి. అయినా అక్కడ రక్షణ చర్యలు చేపట్టలేదు. లిఖితపూర్వకంగా ఆరు సార్లు విజ్ఞప్తి చేసినా.. అదనపు గస్తీ బృందాలను నియమించలేదు. నిఘా పరిజ్ఞానం, కదలికలను గుర్తించే ట్రాకర్‌ సాధనాలను ఏర్పాటు చేయలేదు.

సరిహద్దు రక్షణ చర్యలను జమ్మూ-కశ్మీర్‌లోనే కేంద్రీకరించినందువల్ల పంజాబ్‌లో తక్కువ సిబ్బందిని నియమించినట్లు సరిహద్దు భద్రతా దళ (బీఎస్‌ఎఫ్‌) అధికారి ఒకరు చెప్పారు. ఇక్కడ అదనపు బలగాలను మోహరించాలన్న తమ విజ్ఞప్తిని ఉన్నతాధికారులు పదేపదే విస్మరించారని ఆయన తెలిపారు. పఠాన్‌కోట్‌ దాడి కోసం 350 కిలోల పేలుడు పదార్థాలను సమకూర్చుకోవడానికి ఉగ్రవాద ముఠా జైష్‌-ఎ-మహ్మద్‌ చెల్లింపులు చేసింది. వాటిని భారత్‌లోనే కొనుగోలు చేశారు.

ఒక పోలీసు అధికారి గానీ అతడు ఏర్పాటు చేసిన వ్యక్తి గానీ పైకి ఎక్కి, తాడు కట్టారని కేసు దర్యాప్తు చేసిన ఐబీ అధికారి ఒకరు చెప్పారు. ఈ తాడు సాయంతో ముష్కరులు 50 కిలోల మందుగుండు సామగ్రి, 30 కిలోల గ్రెనేడ్లు, మోర్టార్లు, ఏకే-47 తుపాకులను వైమానిక స్థావరంలోకి చేరవేశారు.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని