Monkeypox: మంకీపాక్స్‌ కట్టడికి టాస్క్‌ఫోర్స్‌

దేశంలో మంకీపాక్స్‌ వ్యాధి కట్టడికి గాను ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వ్యాధి నిర్ధారణ, చికిత్సలకు

Updated : 29 Jul 2022 04:53 IST

దిల్లీ: దేశంలో మంకీపాక్స్‌ వ్యాధి కట్టడికి గాను ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వ్యాధి నిర్ధారణ, చికిత్సలకు సంబంధించి వసతుల విస్తరణ; అవసరమైన ఏర్పాట్లు చేయడం; వ్యాక్సినేషన్‌ తదితర అంశాలపై ఈ టాస్క్‌ఫోర్స్‌ సూచనలు చేస్తుందని తెలిపాయి. ఇటీవల నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. మంకీపాక్స్‌ వ్యాప్తి చెందకుండా చేపట్టాల్సిన చర్యలు, ప్రజారోగ్యానికి సంబంధించిన ఏర్పాట్లు వంటి అంశాలపై ప్రధానమంత్రి ప్రిన్సిపల్‌ సెక్రటరీ స్థాయిలో ఈ సమావేశం జరిగింది. కేబినెట్‌ కార్యదర్శి, నీతి ఆయోగ్‌ సభ్యుడు, కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి; అదనపు కార్యదర్శి (పీఎంవో) ఇతర సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. దేశంలో ఇంతవరకు 4 మంకీపాక్స్‌ (కేరళలో 3, దిల్లీలో 1) కేసులు బయటపడిన సంగతి తెలిసిందే. ఈమేరకు కేసుల నిర్ధారణ, చికిత్సలు అందించడం, ఇతర కట్టడి చర్యలకు సంబంధించి కార్యాచరణకు గాను జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ, డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌లకు నిర్దేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే వ్యాధి నిర్ధారణకు తగిన ఏర్పాట్లకు గాను ఐసీఎంఆర్‌ నెట్‌వర్క్‌ ల్యాబ్‌లకు కూడా సూచనలు చేసినట్లు చెప్పాయి. మంకీపాక్స్‌ను ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ఇప్పటికే డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. అంతకుముందే కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ వ్యాధి కట్టడికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మంకీపాక్స్‌ నిర్ధారణ పరీక్షలకు గాను ఐసీఎంఆర్‌ పరిధిలో 15 ల్యాబొరేటరీలను ఏర్పాటు చేసింది.

అనుమానిత రోగికి ‘నెగెటివ్‌’

మంకీపాక్స్‌ అనుమానంతో దిల్లీలోని లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ (ఎల్‌ఎన్‌జేపీ) ఆసుపత్రిలో చేరిన ఓ వ్యక్తికి నిర్ధారణ పరీక్షల్లో ‘నెగెటివ్‌’గా తేలిందని ఆసుపత్రి మెడికల్‌ డైరెక్టర్‌ సురేశ్‌ కుమార్‌ తెలిపారు. దీంతో అతన్ని గురువారం డిశ్ఛార్జి చేసినట్లు వెల్లడించారు. గాజియాబాద్‌కు చెందిన ఆ వ్యక్తికి జ్వరం, శరీరంపై పొక్కులు వంటి లక్షణాలు కనిపించడంతో రెండు రోజుల క్రితం ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు సురేశ్‌ తెలిపారు.

పాక్‌ మాజీ అధ్యక్షుడు జర్దారీకి కొవిడ్‌

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్‌ అలీ జర్దారీ కొవిడ్‌ బారిన పడ్డారు. ఆయన పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్‌తో పాటు బూస్టర్‌ డోసు కూడా తీసుకున్నారని.. స్వల్ప లక్షణాలతో చికిత్స పొందుతున్నట్లు ఆయన కుమారుడు, పాక్‌ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో జర్దారీ తెలిపారు. తన 67వ జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి జులై 26న ఆసిఫ్‌ అలీ జర్దారీ దుబాయ్‌ వెళ్లారు. అక్కడే ఆయనకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కోలుకోగానే ఆయన పాక్‌కు తిరిగి వస్తారని చెప్పారు.


ఆఫ్రికాలో ఒక్క టీకా డోసూ లేదు!

నైరోబీ: ప్రపంచంలో ఒక్క ఆఫ్రికాలోనే మంకీపాక్స్‌ మరణాలు నమోదైనప్పటికీ.. ఈ ఖండంలో ఇంతవరకు ఒక్క టీకా డోసు కూడా లేదని ఆఫ్రికా సీడీసీ (సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌) ఆందోళన వ్యక్తం చేసింది. ఆఫ్రికా ఖండంలోని దాదాపు 130 కోట్ల జనాభా ఒక్క డోసు కూడా లేకుండా ఉన్నారని సీడీసీ డైరెక్టర్‌ అహ్మద్‌ ఒగ్వెల్‌ పేర్కొన్నారు. 11 ఆఫ్రికన్‌ దేశాల్లో ఇంతవరకు 75 మంది ఈ వ్యాధితో మృతి చెందినట్లు తెలిపారు. టీకాలు పొందేందుకు పలు అంతర్జాతీయ భాగస్వాములతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో ‘శుభవార్త’ అందవచ్చని, అయితే ఎప్పుడనేది చెప్పలేమని పేర్కొన్నారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని