నేతాజీ అస్థికలను భారత్‌కు తీసుకురావాలి

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అస్థికలను భారత్‌కు తీసుకువచ్చి డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలని ఆయన కుమార్తె అనితా బోస్‌ ఫాఫ్‌ కోరారు. దీనివల్ల ఆయన ఆగస్టు 18, 1945లో మరణించారా? లేదా అనే సందేహానికి సరైన సమాధానం దొరుకుతుందని

Published : 16 Aug 2022 06:42 IST

డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తే మరణ రహస్యం వీడుతుంది

సుభాష్‌ చంద్రబోస్‌ కుమార్తె అనితా బోస్‌ విజ్ఞప్తి

దిల్లీ: నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అస్థికలను భారత్‌కు తీసుకువచ్చి డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలని ఆయన కుమార్తె అనితా బోస్‌ ఫాఫ్‌ కోరారు. దీనివల్ల ఆయన ఆగస్టు 18, 1945లో మరణించారా? లేదా అనే సందేహానికి సరైన సమాధానం దొరుకుతుందని స్పష్టం చేశారు. టోక్యోలోని రెంకోజీ ఆలయంలో ఉన్న నేతాజీ అస్థికలకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించడానికి జపాన్‌ ప్రభుత్వం, ఆలయ పూజారులు కూడా అంగీకరించారని ఆమె తెలిపారు. నేతాజీ ఏకైక కుమార్తె అయిన అనితా బోస్‌ ఆస్ట్రియాలో జన్మించి జర్మనీలో ఆర్థికవేత్తగా స్థిరపడ్డారు. ‘‘స్వాతంత్య్ర సంబరాలను నేతాజీ ఆస్వాదించలేకపోయారు. స్వతంత్ర భారతావనికి తిరిగి రావాలని ఆయన కోరుకునేవారు. చివరికి ఆయన అస్థికలనైనా మాతృభూమికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత అత్యాధునిక డీఎన్‌ఏ పరీక్షల ద్వారా రెంకోజీ ఆలయంలో ఉన్నది నేతాజీ అస్థికలేనని శాస్త్రీయంగా నిర్ధారించవచ్చు’’ అని అనితా బోస్‌ తెలిపారు. నేతాజీ త్యాగాన్ని, అంకితభావాన్ని భారత పౌరులు స్మరించుకోవడం, విగ్రహాలను ఏర్పాటు చేసి ఆయన జ్ఞాపకాలను సజీవంగా ఉంచడం హర్షణీయం అన్నారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ మరణం నేటికీ రహస్యంగానే మిగిలిపోయింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు విచారణ కమిషన్‌లు.. విమాన ప్రమాదంలోనే నేతాజీ మరణించారని పేర్కొన్నాయి. కానీ జస్టిస్‌ ఎం.కె.ముఖర్జీ నేతృత్వంలోని మూడో కమిషన్‌ మాత్రం విమాన ప్రమాదం నుంచి బయటపడిన నేతాజీ కొంతకాలం బతికి ఉన్నారని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని