రెచ్చగొట్టే దుస్తులు ధరిస్తే లైంగిక వేధింపుల కేసు నిలబడదు

లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి కేరళ కోర్టు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఫిర్యాదు చేసిన మహిళ అసభ్యకరమైన, రెచ్చగొట్టేలా ఉన్న దుస్తులు ధరించారని.. అందువలన ఆమె పెట్టిన లైంగిక వేధింపుల కేసు నిలవదని కోజికోడ్‌

Published : 18 Aug 2022 04:56 IST

దుమారం రేపుతున్న కేరళ కోర్టు ఉత్తర్వులు

కోజికోడ్‌: లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి కేరళ కోర్టు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఫిర్యాదు చేసిన మహిళ అసభ్యకరమైన, రెచ్చగొట్టేలా ఉన్న దుస్తులు ధరించారని.. అందువలన ఆమె పెట్టిన లైంగిక వేధింపుల కేసు నిలవదని కోజికోడ్‌ సెషన్స్‌ కోర్టు పేర్కొంది.  నిందితుడికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ ఉత్తర్వులపై ఆ రాష్ట్ర మహిళా కమిషన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది సమాజానికి తప్పుడు సందేశం పంపుతుందని తెలిపింది. కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి ‘‘శరీర భాగాలు కనిపించేలా దుస్తులు ధరించిన ఫిర్యాదుదారు ఫొటోలను నిందితుడు సమర్పించారు. ఇవి రెచ్చగొట్టేలా ఉన్నాయి. కాబట్టి సెక్షన్‌ 354 ఎ(లైంగిక వేధింపులు) ఇక్కడ వర్తించదు’’ అని వ్యాఖ్యానించారు. బాధితురాలు చేసిన ఆరోపణలు నమ్మశక్యంగా లేవని అభిప్రాయపడ్డారు.‘‘శారీరక పరిమితులు ఉన్న 74ఏళ్ల వ్యక్తి ఫిర్యాదుదారును ఒడిలో బలవంతంగా కూర్చోబెట్టుకుంటారని అనుకోవడం నమ్మే విధంగా లేదు’’ అని తెలిపారు. కేసు వివరాలు ప్రకారం.. 2020 ఫిబ్రవరిలో నిందితుడు చంద్రన్‌.. కొయిలాని ప్రాంతంలోని నంది బీచ్‌ వద్ద కవి సమ్మేళనం నిర్వహించారు. ఇందులో ఫిర్యాదు చేసిన మహిళ కూడా పాల్గొన్నారు. శిబిరంలో పాల్గొన్న వ్యక్తులందరూ సరదాగా తిరిగేందుకు వెళ్లగా.. బాధిత మహిళను నిందితుడు చెయ్యి పట్టుకొని బలవంతంగా నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె రహస్య భాగాలపై చేతులు వేసేందుకు ఒడిలో కూర్చోవాలని కోరాడు. ఈ నేపథ్యంలో ఐపీసీ సెక్షన్‌ 354-ఎ(2), 341, 354 ప్రకారం చర్యలు తీసుకోవాలని మహిళ ఫిర్యాదు చేశారు. అయితే, ఈ కేసులో తనకు బెయిల్‌ ఇప్పించాలని నిందితుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఈ బెయిల్‌ అభ్యర్థనను పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వ్యతిరేకించారు. గతంలోనూ నిందితుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలు ఉన్నాయని న్యాయస్థానం ముందు ప్రస్తావించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని