ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఆశ్రమంలో సందడిగా దుర్గాష్టమి వేడుక

భారీ సంఖ్యలో హాజరైన భక్తుల మధ్య బెంగళూరులోని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఆశ్రమంలో సోమవారం దుర్గాష్టమి సంబరాలు సందడిగా జరిగాయి.

Published : 04 Oct 2022 04:49 IST

శ్రీశ్రీ రవిశంకర్‌ ఆధ్వర్యంలో చండీ హోమం, సామూహిక ధ్యానం

 

బెంగళూరు: భారీ సంఖ్యలో హాజరైన భక్తుల మధ్య బెంగళూరులోని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఆశ్రమంలో సోమవారం దుర్గాష్టమి సంబరాలు సందడిగా జరిగాయి. ఈ ఆశ్రమంలో రెండేళ్ల విరామం తర్వాత జరిగిన ఈ వేడుకకు 82 దేశాల నుంచి లక్షన్నర మందికిపైగా హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌ ఆధ్వర్యంలో సామూహిక ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మానవ సంక్షేమం, ప్రపంచ శాంతి కోసం మంత్రోచ్ఛారణల మధ్య చండీ హోమాన్ని నిర్వహించారు. ‘‘చండీ అంటే చాలా శక్తిమంతమైనది అని అర్థం. హోమగుండంలో అర్పించే ప్రతి మూలికకూ ఒక ప్రత్యేక గుణం ఉంటుంది. హోమగుండంలో వేసినప్పుడు అది వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది’’ అని రవిశంకర్‌ పేర్కొన్నారు. నవరాత్రి సంబరాలు మనలో నిద్రాణమైన దైవిక శక్తిని జాగృతపరుస్తాయని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని