Uddhav Thackeray: నా రాజీనామా లేఖ సిద్ధంగా ఉంది: ఉద్ధవ్‌ ఠాక్రే

మహారాష్ట్రలో తీవ్ర రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ శివసేన అధినేత, ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే తొలిసారి స్పందించారు....

Published : 23 Jun 2022 01:11 IST

ముంబయి: మహారాష్ట్రలో తీవ్ర రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ శివసేన అధినేత, ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే తొలిసారి స్పందించారు. శివసేన ఎప్పుడూ హిందుత్వను వదిలిపెట్టలేదన్నారు. ఫేస్‌బుక్‌ లైవ్‌ ద్వారా ఆయన రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘‘హిందుత్వ మా ఊపిరి. హిందుత్వ మా గుర్తింపు. మా భావజాలం.  హిందుత్వం కోసం ఎవరేం చేశారో మాట్లాడే సమయం ఇది కాదు. బాలాసాహెబ్‌ హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకే నేను ప్రయత్నిస్తున్నాను. శివసేన ఎప్పుడూ హిందుత్వను వదిలిపెట్టలేదు’’ అని స్పష్టం చేశారు. సీఎంగా తన బాధ్యతలను నిర్వర్తించానని.. కరోనా సమయంలో తమ కృషికి మంచి గుర్తింపు లభించిందని చెప్పారు. మంత్రి ఏక్‌నాథ్‌ శిందేతో వెళ్లిన ఎమ్మెల్యేల నుంచి తనకు ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయని.. తమను బలవంతంగా లాక్కెళ్లారని వారంతా వాపోతున్నారని ఉద్ధవ్‌ చెప్పారు. 


‘మహా’ Updates..

బాల్‌ఠాక్రే కుమారుడిని.. పదవికోసం వెంపర్లాడను

‘‘నన్ను అసమర్థుడని ఒక్క ఎమ్మెల్యే అన్నా.. నేను సీఎం పదవికి రాజీనామా చేస్తా. రాజీనామా లేఖ సిద్ధంగా ఉంచుకున్నా. నేను బాల్‌ఠాక్రే కుమారుడిని.. పదవి కోసం వెంపర్లాడను. రాజీనామాకు సిద్ధమే. నా తర్వాత కూడా శివసేన నేత సీఎం అయితే సంతోషిస్తా. అనుకోకుండా నాకు సీఎం పదవి దక్కింది. సీఎం పదవి తీసుకోవాలని గతంలో శరద్‌ పవార్‌ నన్ను కోరారు. పవార్‌ కోరిక మేరకు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాం. సీఎం పదవి కోసం పోరాటం చేయను. సీఎంగా నా బాధ్యతలు నిర్వర్తించాను. కొందరు ప్రేమతో గెలుస్తారు.. ఇంకొందరు కుట్రలతో గెలుస్తారు. నాకు సీఎంగా కొనసాగాలని లేదు. అసంతృప్త ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేస్తే శివసేన అధినేత పదవి కూడా వదులుకుంటా’’ అని ఉద్ధవ్‌ ఠాక్రే వ్యాఖ్యానించారు.

సొంత ఎమ్మెల్యేలే వద్దునుకుంటే ఏం అనగలను?

‘‘ఇదంతా నాకు చాలా దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ప్రభుత్వంలోని ప్రధాన భాగస్వామ్యపక్షాలైన కాంగ్రెస్‌, ఎన్సీపీనో నన్ను సీఎంగా వద్దనుకుంటే అది వేరు. ఈరోజు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ కూడా నన్ను సీఎంగా ఉండాలని కోరారు. కానీ, నా సొంత పార్టీ ఎమ్మెల్యేలే నన్ను సీఎంగా వద్దనుకుంటున్నప్పుడు నేనేం అనగలను?. శివసైనికులంతా నాతో ఉన్నంత వరకు భయపడాల్సిన అవసరం లేదు’’ అని తన ప్రసంగంలో ఆవేదన వ్యక్తంచేశారు. 

గవర్నర్‌కు రెబల్‌ ఎమ్మెల్యేలు లేఖ

మరోవైపు, మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే దిశగా ఏక్‌నాథ్‌ శిందే జోరుగా పావులు కదుపుతున్నారు. తమదే అసలైన శివసేన అంటూ 30మంది ఎమ్మెల్యేలు గవర్నర్‌కు లేఖ రాశారు. శివసేన శాసనసభాపక్ష నేతగా ఏక్‌నాథ్‌ శిందేను గుర్తించాలని కోరారు. శివసేన తన సిద్ధాంతంతో రెండేళ్ల క్రితమే రాజీపడిపోయిందని ఆరోపించారు. మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వంలో అవినీతిపట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రస్తుతం జైలులో ఉన్న అనిల్‌ దేశ్‌ముఖ్‌, నవాబ్‌ మాలిక్‌ పేర్లను ప్రస్తావించారు. ఈ తీర్మానంలో మొత్తం 34మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేయగా.. వీరిలో నలుగురు స్వతంత్రులు ఉన్నారు. ప్రభుత్వంలో అవినీతిపై శివసేన సభ్యులు, పార్టీ క్యాడర్‌లో తీవ్ర అసంతృప్తి ఉందని లేఖలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని