Maharashtra: ‘నన్ను కిడ్నాప్‌ చేశారు’.. శివసేన ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి భాజపా ‘ఆపరేషన్‌ కమల్’ కారణమంటూ ఆరోపణలు వెల్లువెత్తుతోన్న వేళ శివసేన ఎమ్మెల్యే ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కిడ్నాప్‌ చేసి గుజరాత్‌కు బలవంతంగా

Published : 22 Jun 2022 15:38 IST

ముంబయి: మహారాష్ట్ర (Maharashtra Political Crisis) రాజకీయ సంక్షోభానికి భాజపా ‘ఆపరేషన్‌ కమల్’ కారణమంటూ ఆరోపణలు వెల్లువెత్తుతోన్న వేళ శివసేన(Shiv Sena) ఎమ్మెల్యే ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కిడ్నాప్‌ చేసి గుజరాత్‌కు బలవంతంగా తీసుకెళ్లారని ఆరోపించారు. వారి నుంచి తప్పించుకుని తాను ముంబయికి వచ్చేశానని, తన మద్దతు ఉద్ధవ్‌ ఠాక్రేకే అని స్పష్టం చేశారు. 

శివసేన ఎమ్మెల్యే నితిన్‌ దేశ్‌ముఖ్‌ ఈ ఉదయం గుజరాత్‌ నుంచి ముంబయి చేరుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఏక్‌నాథ్‌ శిందే నన్ను తప్పుదోవ పట్టించి సూరత్‌ తీసుకెళ్లారు. మహా సీఎంకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నామని నాకు ముందు చెప్పలేదు. అక్కడకు వెళ్లాక అసలు విషయం తెలిసి నేను హోటల్‌ నుంచి బయటకు వచ్చాను. కానీ నన్ను పోలీసులు అడ్డుకున్నారు. దాదాపు 100-150 మంది పోలీసులు నా వెనుకే వచ్చి నాకు గుండెపోటు వచ్చిందంటూ బలవంతంగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. నాకు ఎలాంటి అనారోగ్యం లేదు. నేను ఫిట్‌గా ఉన్నాను. ఆ తర్వాత ఆసుపత్రిలోనూ నన్ను హత్య చేయడానికి కుట్రలు జరిగాయి. ఏదో ఇంజెక్షన్‌ ఇవ్వడానికి ప్రయత్నించారు. ఎలాగొలా వారి నుంచి తప్పించుకుని ముంబయి చేరుకున్నా’’ అని దేశ్‌ముఖ్‌ వివరించారు. తాను ఎప్పటికీ శివ సైనికుడినేనని, ఉద్ధవ్‌ ఠాక్రేకు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. మరోవైపు, నితిన్‌ దేశ్‌ముఖ్‌తో పాటు మరో శివసేన ఎమ్మెల్యే కూడా రెబల్స్‌ శిబిరం నుంచి వెనక్కి వచ్చినట్లు తెలుస్తోంది.

కాగా.. నితిన్‌ దేశ్‌ముఖ్‌ కన్పించట్లేదంటూ నిన్న ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూన్‌ 20 రాత్రి 7 గంటలకు తన భర్తతో మాట్లాడానని, ఆ తర్వాత నుంచి ఆయన ఫోన్‌ స్విచ్చాఫ్‌ వస్తోందని దేశ్‌ముఖ్‌ భార్య ప్రాంజలి ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భర్తకు ప్రాణహాని ఉందని ఆరోపించారు.

5 గంటల్లోపు రావాలి.. శివసేన అల్టిమేటం

ఇదిలా ఉండగా.. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో శివసేన పార్టీ ఈ సాయంత్రం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. సాయంత్రం 5 గంటలకు శివసేన ఎమ్మెల్యేలంతా ఈ భేటీకి రావాలని ఆదేశించింది. లేదంటే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది. ‘‘ఈ రోజు సాయంత్రం 5 గంటలకు జరిగే సమావేశంలో మీరు(ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ) హాజరుకాకపోతే.. మీరు పార్టీని వీడుతున్నారని పరిగణించాల్సి వస్తుంది. మీ సభ్యత్వం రద్దవుతుంది’’ అని శివసేన ఓ లేఖలో స్పష్టం చేసింది.

కొద్ది సేపటి క్రితమే సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలో కేబినెట్‌ సమావేశం వర్చువల్‌గా జరిగింది. అయితే ఈ భేటీలో అసెంబ్లీ రద్దు అంశం చర్చకు రాలేదని తెలుస్తోంది. తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేల కోసం సాయంత్రం 5 గంటలకు వేచి చూడాలని శివసేన భావిస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాతే అసెంబ్లీ రద్దుపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని