Maharashtra: శివసేన ఆదేశాలు చెల్లవు.. ఏక్‌నాథ్‌ శిందే ట్వీట్‌

మహారాష్ట్ర రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శివసేనలో భగ్గుమన్న అసమ్మతి సెగ నుంచి బయటపడేందుకు ఆ పార్టీ విస్తృత ప్రయత్నాలు చేస్తోంది.

Published : 23 Jun 2022 01:08 IST

ముంబయి: మహారాష్ట్ర రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శివసేనలో భగ్గుమన్న అసమ్మతి సెగ నుంచి బయటపడేందుకు ఆ పార్టీ విస్తృత ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ సాయంత్రం 5 గంటలకు పార్టీ ఎమ్మెల్యేలంతా (తిరుగుబాటు చేసిన నేతలతో కలిపి) సమావేశానికి రావాలని అల్టిమేటం జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలపై తిరుగుబాటు నేత, మంత్రి ఏక్‌నాథ్‌ శిందే ట్విటర్‌ వేదికగా స్పందించారు. అవి చట్టపరంగా చెల్లవని పేర్కొన్నారు.

ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో శివసేన చీఫ్‌ విప్‌ సునిల్‌ ప్రభు పార్టీ శాసనసభాపక్ష నేతలకు ఇవాళ ఆదేశాలు జారీ చేశారు. ‘‘ఈ సాయంత్రం వర్ష భవనంలో శివసేన అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలంతా హాజరుకావాలి. ఒకవేళ రాని పక్షంలో వారిని పార్టీ వీడుతున్నట్లుగా పరిగణించాల్సి వస్తుంది. అప్పుడు వారిపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద చర్యలు తీసుకుంటాం’’ అని సునిల్‌ ప్రభు ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ లేఖను శివసేన ఎమ్మెల్యేలకు వాట్సప్‌, ఈ-మెయిళ్ల ద్వారా పంపించారు. ఈ ఆదేశాలపై ఏక్‌నాథ్‌ శిందే తాజాగా స్పందించారు. ‘‘శివసేన శాసనసభా పక్ష చీఫ్‌ విప్‌గా ఎమ్మెల్యే భరత్‌ గొగవాలే కొత్తగా నియమితులయ్యారు. అందువల్ల సునిల్‌ ప్రభు ఇచ్చిన ఆదేశాలు చెల్లవు’’ అని శిందే ట్వీట్ చేశారు.

శాసనసభాపక్ష నేతగా శిందేనే..

ఠాక్రే సర్కారుపై శిందే తిరుగుబాటు చేయగానే ఆయనను శివసేన శాసనసభాపక్ష నేత హోదా నుంచి పార్టీ తప్పించింది. అయితే, రెబల్‌ ఎమ్మెల్యేలు మాత్రం ఆయనే తమ శాసనసభ నేతగా పేర్కొంటూ తీర్మానం చేశారు. ‘‘ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి పట్ల మేం అసంతృప్తిగా ఉన్నాం. రాజకీయ వ్యక్తిగత అవసరాల కోసం పార్టీ నేతలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వీటిని పార్టీ నాయకత్వం పట్టించుకోవట్లేదు. అందుకే మేం తిరుగుబాటు చేస్తున్నాం. అయితే అసెంబ్లీలోనే శివసేన పార్టీ అంటే మాదే. అందుకే ఏక్‌నాథ్‌ శిందేనే శివసేన శాసనసభాపక్ష నేతగా కొనసాగించాలని నిర్ణయించుకున్నాం. పార్టీ చీఫ్‌ విప్‌గా సునిల్‌ ప్రభు స్థానంలో భరత్‌ గొగవాలేను నియమించుకున్నాం’’ అని రెబల్స్ పేర్కొన్నారు. ఈ తీర్మానంపై 34 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ వీరు గవర్నర్‌కు, డిప్యూటీ స్పీకర్‌కు లేఖ రాశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని