Kiren Rijiju: 50 కేసులను పరిష్కరిస్తుంటే.. 100 కొత్త కేసులొస్తున్నాయ్‌..!

న్యాయ వ్యవస్థల్లో పెండింగ్‌ కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా పలు కోర్టుల్లో కలిపి మొత్తం దాదాపు 5 కోట్ల కేసులు విచారణ దశలో ఉన్నాయి.

Published : 20 Aug 2022 19:09 IST

దిల్లీ: న్యాయ వ్యవస్థల్లో పెండింగ్‌ కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా పలు కోర్టుల్లో కలిపి మొత్తం దాదాపు 5 కోట్ల కేసులు విచారణ దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోపెండింగ్‌ కేసులపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులు కేసులు పరిష్కరిస్తున్న కొద్దీ.. అంతకు రెట్టింపు సంఖ్యలో కొత్త పిటిషన్లు వస్తున్నాయన్నారు.

‘‘ఇప్పుడు ప్రజలకు న్యాయవ్యవస్థ పట్ల అవగాహన పెరిగింది. తమ వివాదాలను పరిష్కరించుకునేందుకు కోర్టులను ఆశ్రయించేవారు పెరుగుతున్నారు. న్యాయమూర్తులు 50 కేసులను పరిష్కరిస్తుంటే.. 100 కొత్త వ్యాజ్యాలు దాఖలవుతున్నాయి’’ అని రిజిజు వ్యాఖ్యానించారు. కోర్టుల్లో పెండింగ్‌ కేసులను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. సాయుధ బలగాల ట్రైబ్యునల్‌ సెమినార్‌లో పాల్గొన్న రిజిజు ఈ వ్యాఖ్యలు చేశారు. కోర్టుల్లో వ్యాజ్యాలను తగ్గించేలా మధ్యవర్తిత్వంపై చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఈ సందర్భంగా  ఆయన తెలిపారు. అయితే, పెండింగ్‌ కేసుల విషయంలో భారత్‌ను ఇతర దేశాలతో పోల్చడం సరికాదన్నారు. కొన్ని దేశాల్లో అక్కడి మొత్తం జనాభా కూడా 5కోట్లు ఉండదని, అందువల్ల ఇతర దేశాలతో పోల్చి చూడొద్దని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా పలు కోర్టుల్లో మొత్తంగా 4.83కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు ఇటీవల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కేంద్ర న్యాయశాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందులో 4కోట్లకు పైగా కేసులో కింది కోర్టుల్లో ఉండగా.. సుప్రీంకోర్టు వద్ద 72వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని