Assembly Polls: పార్టీ ఓటమిని ఊహించలేదు.. ఇది ఆందోళనకరమే : కాంగ్రెస్‌ నేత చిదంబరం

మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పరాజయం ఆందోళన కలిగిస్తోందని ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం పేర్కొన్నారు.

Updated : 17 Dec 2023 14:42 IST

కోల్‌కతా: ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ అసెంబ్లీలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోతుందని (Congress Defeat) ఊహించలేదని ఆ పార్టీ సీనియర్‌ నేత పి. చిదంబరం పేర్కొన్నారు. అంతేకాకుండా ఇది పార్టీకి ఆందోళనకర అంశమన్నారు. ప్రతి ఎన్నికనూ తుది సమరం వలే భావిస్తూ ‘భాజపా’ పోరాడుతోందని.. ఈ విషయాన్ని విపక్షాలు గ్రహించాలని సూచించారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పి. చిదంబరం (P Chidambaram) ఈ వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్‌ ‘దేశం కోసం విరాళం’

‘2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో (Assembly Elections) విజయం సాధించడం భాజపాలో ఉత్సాహం నింపింది. ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పరాజయం మాత్రం ఊహించలేదు. ఇది పార్టీకి ఆందోళన కలిగించే అంశం. ఈ బలహీనతను అగ్రనాయకత్వం పరిష్కరిస్తుందని విశ్వసిస్తున్నాను’ అని పి.చిదంబరం పేర్కొన్నారు. ఈ మూడు రాష్ట్రాలతోపాటు తెలంగాణలోనూ పార్టీ ఓటు బ్యాంకు మాత్రం చెక్కుచెదరలేదన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి ఇది 45శాతానికి పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

21న సీడబ్ల్యూసీ భేటీ..

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఎదుర్కొనే వ్యూహ రచనకు కాంగ్రెస్‌ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా డిసెంబర్‌ 21న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (CWC) సమావేశం కానున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ప్రతికూల ఫలితాలతోపాటు రాహుల్‌ గాంధీ ‘భారత్‌ జోడో యాత్ర’పై (తూర్పు నుంచి పడమరకు) ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. మరోవైపు సీట్ల పంపకమే ప్రధాన అజెండాగా విపక్షాల కూటమి ఇండియా (INDIA) నాలుగోసారి సమావేశం కానుంది. డిసెంబర్‌ 19వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు దిల్లీలో ఈ భేటీ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని