కాంగ్రెస్‌ ‘దేశం కోసం విరాళం’

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ బలోపేతానికి దేశవ్యాప్తంగా ప్రజలవద్ద నుంచి విరాళాలు సేకరించనున్నట్లు కాంగ్రెస్‌ ప్రకటించింది.

Published : 17 Dec 2023 04:06 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ బలోపేతానికి దేశవ్యాప్తంగా ప్రజలవద్ద నుంచి విరాళాలు సేకరించనున్నట్లు కాంగ్రెస్‌ ప్రకటించింది. సోమవారం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించింది. ‘దేశం కోసం విరాళం’ పేరుతో క్రౌడ్‌ఫండింగ్‌ను చేపట్టనున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, కోశాధికారి అజయ్‌ మాకన్‌ తెలిపారు. శనివారం వారు మీడియాతో మాట్లాడారు. 18ఏళ్లు దాటినవారు రూ.138 నుంచి విరాళాలను అందించవచ్చని, అది రూ.1380గానీ, రూ.13,800గానీ కావొచ్చని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ 138వ వార్షికోత్సవం సందర్భంగా రూ.138ని కనీస విరాళంగా నిర్ణయించామని, దానికి ఎన్ని రెట్లైనా ఇవ్వవచ్చని చెప్పారు. వందేళ్ల క్రితం 1920-21లో మహాత్మా గాంధీ ప్రారంభించిన చారిత్రక ‘తిలక్‌ స్వరాజ్‌ ఫండ్‌’ స్ఫూర్తితో ఈ నిధుల సమీకరణ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నెల 28 వరకూ ప్రధానంగా ఆన్‌లైన్‌ వేదికగా, ఆ తర్వాత క్షేత్ర స్థాయిలో విరాళాల సేకరణ చేపడతామని చెప్పారు. 28న నాగ్‌పుర్‌లో భారీ సభ నిర్వహిస్తామని, ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులుసహా దాదాపు 10 లక్షల మంది హాజరవుతారని చెప్పారు. ఎన్నికల వేళ నిధుల కొరతను అధిగమించేందుకు కాంగ్రెస్‌ ‘క్రౌడ్‌ఫండింగ్‌’కు పిలుపునిచ్చినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని