Army: ఆర్మీ యూనిఫామ్‌ అక్రమ తరలింపు.. మిలిటరీ ఇంటెలిజెన్స్‌ సాయంతో దాడులు..

సైన్యం వినియోగించే సరికొత్త కాంబాట్‌ యూనిఫామ్‌ను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు.  

Updated : 04 Feb 2024 14:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌:  సైన్యానికి యుద్ధ రంగంలో ఉపయోగపడేలా ప్రత్యేకంగా డిజిటల్‌ టెక్నాలజీ సాయంతో సిద్ధం చేసిన యూనిఫామ్‌లను పోలిన దుస్తుల విక్రయాలపై దాడులు మొదలయ్యాయి. తాజాగా పుణె, అహ్మద్‌నగర్‌లోని భింగర్‌ క్యాంప్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలో తనిఖీలు చేపట్టారు. దక్షిణ కమాండ్‌ సైనిక ఇంటెలిజెన్స్‌ విభాగం సాయంతో పోలీసులు వీటిని నిర్వహించారు. 40 నకిలీ యూనిఫామ్‌లను స్వాధీనం చేసుకుని ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నాసిక్‌ జిల్లా వాసి. ఎలాంటి లైసెన్స్‌లు లేకుండా వీటిని కొనుగోలు చేసినట్లు అతడు తెలిపాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

2022 జనవరి 15న భారత సైన్యం కోసం సరికొత్త యూనిఫామ్‌ను ఆవిష్కరించారు. దీనిని డిజిటల్‌ టెక్నాలజీ సాయంతో తయారు చేశారు. ప్రస్తుతం ఉన్న యూనిఫామ్‌ను దీంతో భర్తీ చేస్తున్నారు. ఈ వస్త్రం తేలిగ్గా, బలంగా, గాలి ఆడేట్లు, నిర్వహణకు తేలిగ్గా ఉండేట్లు తయారు చేశారు. 

ఈ యూనిఫామ్‌ డిజైన్‌పై సైన్యానికి 10 ఏళ్లపాటు మేధో హక్కులు ఉన్నాయి. ఇప్పటికే 50 వేల జతలు క్యాంటీన్‌ స్టోర్‌ డిపార్ట్‌మెంట్‌ కొనుగోలు చేసింది. వీటిని సరైన విధానంలో కుట్టేలా ఆర్మీ, పౌర దర్జీలకు శిక్షణ శిబిరాలు కూడా నిర్వహిస్తున్నారు.

బహిరంగ మార్కెట్లో సైనిక దుస్తులను ఎలాంటి అనుమతులు లేకుండా విక్రయించేవారిని నిరోధించేందుకే తాజాగా దాడులు చేసినట్లు అధికారులు తెలిపారు. వీటిని అక్రమంగా విక్రయించడం దళాల భద్రతకు కూడా ప్రమాదకరమని అధికారులు చెబుతున్నారు. సైన్యం కొత్త దుస్తులను కేవలం క్యాంటీన్లలోనే విక్రయిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని