Pegasus: కోర్టులో విచారిస్తుంటే.. సోషల్‌మీడియాలో చర్చలెందుకు?

న్యాయస్థానాలు జరిపే విచారణలపై పిటిషనర్లు విశ్వాసం ఉంచాలని సుప్రీంకోర్టు తెలిపింది. దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించిన పెగాసస్‌తో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై దాఖలపై పలు

Updated : 10 Aug 2021 12:03 IST

దిల్లీ: న్యాయస్థానాలు జరిపే విచారణలపై పిటిషనర్లు విశ్వాసం ఉంచాలని సుప్రీంకోర్టు తెలిపింది. దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించిన పెగాసస్‌తో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై దాఖలైన పలు పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంపై కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు సోషల్‌మీడియాలో చర్చలు ఎందుకు చేస్తున్నారంటూ పిటిషనర్లను ప్రశ్నించింది.

‘‘పెగాసస్‌ అంశంపై కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఇతర మాధ్యమాల వేదికగా సమాంతర చర్చలు జరగడం దురదృష్టకరం. చర్చలకు మేం వ్యతిరేకం కాదు. కానీ కేసు కోర్టుకు వచ్చినప్పుడు ఇక్కడే విచారణ జరగాలి. కోర్టుల్లో విచారణలపై పూర్తి విశ్వాసం ఉంచాలి. కోర్టు హాళ్లలో క్రమశిక్షణతో చర్చలు జరగాలి. వాద, ప్రతివాదులు సమాచారపరంగా సహకరించాలి. ఏం చెప్పాలనుకున్నా కోర్టులోనే చెప్పాలి. పిటిషనర్లు చెప్పే విషయాలు అపిడవిట్‌ రూపంలో ఇవ్వాలి. సోషల్‌ మీడియా, బయటి చర్చలకు పరిధి ఉండాలి. అలాంటి మాధ్యమాల్లో పిటిషనర్లు సమాంతర చర్చలు జరపకూడదు’’ అని జస్టిస్‌ ఎన్‌.వి. రమణ వ్యాఖ్యానించారు. న్యాయమూర్తి వ్యాఖ్యలకు ఇరుపక్షాల న్యాయవాదులు స్పందిస్తూ.. కక్షిదారులు పరిధి దాటకుండా చూస్తమన్నారు. సామాజిక మాధ్యమాల్లో చర్చలకు తావివ్వకుండా చూసుకుంటామని చెప్పారు.

పెగాసస్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టులో గతవారం విచారణ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత పిటిషనర్లలో ఒకరైన సీనియర్‌ జర్నలిస్టు ఎన్‌. రామ్‌పై సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయని ఆయన తరఫు సీనియర్‌ న్యాయవాది కపిల్ సిబల్‌ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ పై విధంగా వ్యాఖ్యలు చేసింది.

విచారణ సోమవారానికి వాయిదా..

మరోవైపు పెగాసస్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ వ్యవహారంలో పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం నుంచి తనకు ఇంకా సూచనలు రావాల్సి ఉందని, అందువల్ల వాదనలకు కొంత సమయం కావాలని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టును కోరారు. ఇందుకు అంగీకరించిన న్యాయస్థానం.. తదుపరి విచారణను ఆగస్టు 16వ తేదీకి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని