Star Actors: ఇక్కడ ప్రభాస్‌, విష్ణు.. అక్కడ రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌: వీరి చిత్రాల స్పెషల్‌ ఏంటంటే?

ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే?

Published : 19 Apr 2024 10:06 IST

తెరంతా నటులతో నిండిపోతే ప్రేక్షకుడికి కనుల పండగే. ఒకప్పటి సినిమాల్లో ఎక్కువ మంది క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌లు, కమెడియన్లు కనిపించి, సందడి చేసేవారు. ఇటీవల ఆ సంఖ్య తగ్గింది. కానీ, అగ్ర తారలు కలిసి నటించడం ఇప్పుడో ట్రెండ్‌ అయింది. ఆయా కథలను పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందించడం, పాత్రలకు తగ్గ వారినే ఎంపిక చేసుకోవాలని దర్శక, నిర్మాతలు పట్టుబట్టడంతో అన్ని చిత్ర పరిశ్రమలకు చెందిన స్టార్‌ నటులు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తున్నారు. ఇలా.. టాలీవుడ్‌లో ప్రభాస్‌, మంచు విష్ణు, కోలీవుడ్‌లో రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ తమ చిత్రాలతో కొత్త అనుభూతి పంచనున్నారు. ఆ సినిమా సంగతులివీ..

అందరి చూపు కన్నప్ప వైపు..

ఒక్కో భాష నుంచి ఒక్కో నటుడు కీలక పాత్ర పోషిస్తుండడంతో సినీ ప్రియులందరి దృష్టి ‘కన్నప్ప’ (Kannappa)పై పడింది. మంచు విష్ణు (Vishnu Manchu) డ్రీమ్‌ ప్రాజెక్టు ఇది. ఈయన కీలక పాత్రలో బాలీవుడ్‌ డైరెక్టర్‌ ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ తెరకెక్కిస్తున్నారు. ప్రీతీ ముకుందన్‌ హీరోయిన్‌. మోహన్‌బాబు (Mohan Babu)తోపాటు మలయాళ నటుడు మోహన్‌ లాల్‌ (Mohanlal), కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌ (Shiva Rajkumar), తమిళ నటుడు శరత్‌కుమార్‌ (Sarathkumar), బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar) నటిస్తున్నారు. టాలీవుడ్‌ స్టార్‌ హీరో ప్రభాస్‌ (Prabhas), నయనతార (Nayanthara) సైతం ఈ మూవీలో భాగం కానున్నారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు గానీ విష్ణు ఆ రూమర్స్‌పై సానుకూలంగా స్పందించారు. విష్ణు తనయుడు అవ్రామ్‌ ఈ సినిమాతో తెరంగేట్రం చేయనున్నాడు. సింహభాగం చిత్రీకరణ న్యూజిలాండ్‌లో జరిగింది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో సిద్ధం చేసిన ప్రత్యేక సెట్‌లో షూటింగ్‌ సాగుతోంది. విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు.


కల్కి.. స్టార్లు కలిసి..

ప్రభాస్‌ హీరోగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఈ కాంబోనే ఒకెత్తు అయితే దీనికి స్టార్‌ నటులు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan), కమల్‌ హాసన్‌ (Kamal Haasan) తోడవ్వడం మరో ఎత్తు. వీరితోపాటు దీపికా పదుకొణె (Deepika Padukone), దిశా పటానీ (Disha Patani), రాజేంద్ర ప్రసాద్‌ (Rajendra Prasad) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో 6000 వేల సంవత్సరాల మధ్య జరిగే కథాంశంతో రూపొందిన ఈ మూవీని మే 9న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొన్ని నెలల క్రితం ప్రకటించింది. ఎన్నికల దృష్ట్యా సినిమా రిలీజ్‌ని వాయిదా వేసయనున్నట్లు తెలుస్తోంది.


విశ్వంభర.. హీరోయిన్ల హవా

చిరంజీవి (Chiranjeevi) హీరోగా తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara). ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. చిరు సరసన త్రిష (Trisha) సందడి చేయనున్నారు. హీరోయిన్లు ఇషా చావ్లా (Isha Chawla), సురభి (Surbhi)తోపాటు మరికొందరు భామలు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.


భారతీయుడుతో వీరు..

కమల్‌ హాసన్‌ (Kamal Haasan)- డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘భారతీయుడు’ (Bharateeyudu). 28 ఏళ్ల తర్వాత దానికి సీక్వెల్‌ రూపొందింది. ‘భారతీయుడు 2’ (Indian 2) పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో సిద్ధార్థ్‌ (Siddharth), కాజల్‌ (Kajal Aggarwal), రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh), ప్రియా భవానీ శంకర్‌ (Priya Bhavani Shankar) కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.


మూడు దశాబ్దాల అనంతరం వేట్టయాన్‌ కోసం..

రజనీకాంత్‌ (Rajinikanth)- అమితాబ్‌ బచ్చన్‌ మూడు దశాబ్దాల తర్వాత ‘వేట్టయాన్‌’ (Vettaiyan) కోసం మళ్లీ కలిసి పనిచేస్తున్నారు. చెన్నైలో జరిగిన ఓ బూటకపు ఎన్‌కౌంటర్‌ ఆధారంగా ‘జై భీమ్‌’ ఫేమ్‌ టి.జె. జ్ఞానవేల్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. రజనీకాంత్‌కు 170వ సినిమా. మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil), టాలీవుడ్‌ నటుడు రానా (Rana Daggubati), మంజు వారియర్‌ (Manju Warrier), రితికా సింగ్‌ (Ritika Singh), దుషారా విజయన్‌.. ఇలా ఈ సినిమా భారీ తారాగణంతో నిండి ఉంది. ప్రస్తుతం చిత్రీకరణలో దశలో ఉన్న ఈ ప్రాజెక్టు అక్టోబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది.


థగ్‌ లైఫ్‌లో మార్పులు!

‘నాయకన్‌’ (నాయకుడు)తో హిట్‌ కాంబోగా నిలిచారు కమల్‌ హాసన్‌- దర్శకుడు మణిరత్నం. 37 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘థగ్‌ లైఫ్‌’ (Thug Life). కమల్‌కు ఇది 234వ సినిమా. త్రిష హీరోయిన్‌. మలయాళ నటులు దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan), జోజు జార్జ్‌ (Joju George), తమిళ నటులు జయం రవి (Jayam Ravi), గౌతమ్‌ కార్తీక్‌, ఐశ్వర్య లక్ష్మిలు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. డేట్స్‌ సర్దుబాటుకాకపోవడంతో దుల్కర్‌, జయం రవి ఈ సినిమా నుంచి వైదొలిగినట్లు ప్రచారం జరిగింది. దుల్కర్‌ స్థానంలో కోలీవుడ్‌ హీరో శింబు (Silambarasan)ను తీసుకున్నారని కోలీవుడ్‌ మీడియా పేర్కొంటోంది. దీనిపై అధికారిక ప్రకటన లేదు. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు