Tollywood Actresses: నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే

త్వరలో విడుదల కాబోయే సినిమాలు ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి. అందుకు కారణం ఒకే మూవీలో ఇద్దరు/ ముగ్గురు హీరోయిన్లు కలిసి నటిస్తుండటమే..

Published : 18 Apr 2024 09:47 IST

అందమైన ఓ కథానాయిక తెరపై కనిపిస్తోందంటే చాలు... ప్రేక్షకుల దృష్టంతా అటువైపే ఉంటుంది. అలాంటిది ఓ హీరో కోసం ‘నువ్వా- నేనా’ అంటూ ఇద్దరు హీరోయిన్లు పోటీపడితే ఆ సందడి మరో స్థాయిలో ఉంటుంది. మరోవైపు, కథానాయికలు.. కథానాయకుడితో కలిసి ఆడిపాడకుండా ప్రత్యేక పాత్రల్లో మెరిసినా ప్రేక్షకుడికి కనుల పండగే. ఇప్పటికే ఇలా ఎందరో భామలు కలిసి నటించి, తెలుగు ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేయగా మరికొందరు హీరోయిన్లు సిద్ధంగా ఉన్నారు. వారెవరు? ఆ సినిమాలేంటి?

భయపెడుతూ నవ్వించేందుకు..

హారర్‌ కామెడీ జానర్‌లో రూపొందిన ‘అరణ్మనై’ (Aranmanai) సిరీస్‌ సినిమాలకు కోలీవుడ్‌తో పాటు తెలుగులోనూ మంచి ఆదరణ దక్కింది. ఇప్పుడీ సిరీస్‌ నుంచి వస్తున్న నాలుగో చిత్రం ‘బాక్‌’ (Baak). సుందర్‌ సి. నటిస్తూ దర్శకత్వం వహించారు. తమన్నా (Tamannaah Bhatia), రాశీ ఖన్నా (Raashii Khanna) హీరోయిన్లు. ఒకప్పటి కథానాయికలు సిమ్రన్‌, ఖుష్బూ అతిథి పాత్రల్లో మెరవనున్నారు. ఇటీవల విడుదలైన ‘పంచుకో’ ప్రోమో సాంగ్‌లో తమన్నా, రాశీ తమ అందం, నృత్యంతో అదరగొట్టారు. సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించారు. ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది.


దీపిక తొలిసారి.. దిశా రెండోసారి..

ప్రభాస్‌ (Prabhas) హీరోగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న సైన్స్‌ ఫిక్షన్‌ ఫిల్మ్‌ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఈ సినిమాతోనే బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె (Deepika Padukone) టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. మరో భామ దిశా పటానీ (Disha Patani) కూడా ఈ సినిమాలో సందడి చేయనున్నారు. ‘లోఫర్‌’తో తెరంగేట్రం చేసిన ఆమెకు ఇది రెండో తెలుగు సినిమా. మహాభారతంతో మొదలై.. క్రీస్తుశకం 2898లో పూర్తయ్యే కథాంశంతో రూపొందిన ఈ ప్రాజెక్టులో అగ్ర నటులు అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ కీలక పాత్రలు పోషించారు.


క్రేజీ సీక్వెల్‌లో అందాల మెరుపుల్‌

కమల్‌ హాసన్‌ (Kamal Haasan)- డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘భారతీయుడు’. ఇన్నేళ్ల తర్వాత దానికి సీక్వెల్‌ రూపొందింది. ‘భారతీయుడు 2’ (Indian 2) పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal), రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh), ప్రియా భవానీ శంకర్‌ (Priya Bhavani Shankar) కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.


పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాలో..

నిఖిల్‌ (Nikhil Siddhartha) హీరోగా దర్శకుడు భరత్‌ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘స్వయంభూ’ (Swayambhu). యుద్ధ నేపథ్య కథాంశంతో రూపొందుతున్న ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాలో నిఖిల్‌.. యోధుడిగా కనిపించనున్నారు. ఆయన సరసన సంయుక్త (Samyuktha), నభా నటేశ్‌ (Nabha Natesh) నటిస్తున్నారు. రిలీజ్‌ డేట్‌ ఇంకా ఫిక్స్‌ కాలేదు.


రాజాసాబ్‌తో ముగ్గురు

ప్రభాస్‌ (Prabhas) - దర్శకుడు మారుతి (Maruthi) కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘రాజా సాబ్‌’ (Raja Saab). రొమాంటిక్‌ హారర్‌ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్‌కు జోడీగా ముగ్గురు నాయికలు ఆడిపాడనున్నారు. వారే.. నిధి అగర్వాల్‌ (Nidhhi Agerwal), మాళవిక మోహనన్‌ (Malavika Mohanan), రిద్ధి కుమార్‌ (Riddhi Kumar). ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.


వరుణ్‌తో ఈ ఇద్దరు..

‘పలాస’ ఫేమ్‌ కరుణ కుమార్‌ దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా సినిమా ‘మట్కా’ (Matka). విశాఖపట్నం నేపథ్యంలో సాగే పీరియాడికల్‌ ఫిల్మ్‌ ఇది. ఇందులో మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) మెయిన్‌ హీరోయిన్‌కాగా బాలీవుడ్‌ బ్యూటీ నోరా ఫతేహి (Nora Fatehi) కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె ఓ ప్రత్యేక గీతంతోనూ అలరించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.


త్రిషతో పాటు వీళ్లు..

‘స్టాలిన్‌’ తర్వాత చిరంజీవి (Chiranjeevi)- త్రిష (Trisha) జోడీ ‘విశ్వంభర’ (Vishwambhara)తో అలరించనుంది. ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ తెరకెక్కిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ ఇది. త్రిష ప్రధాన కథానాయిక కాగా ఇషా చావ్లా (Isha Chawla), సురభి (Surbhi)తోపాటు మరికొందరు భామలు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని