Tollywood: యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్‌ నటులు మెచ్చిన యంగ్‌ హీరోలెవరంటే?

విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ విజయాన్ని అందుకుంటున్న యంగ్‌ హీరోలపై ప్రత్యేక కథనం..

Published : 24 Apr 2024 10:00 IST

మూడు ఫైట్లు, ఆరు పాటల టెంప్లేట్‌ స్టోరీలకు కాలం చెల్లింది. ఓటీటీ విప్లవంతో ఇప్పుడు ప్రపంచ సినిమా దగ్గరైంది. ఇంగ్లిష్‌ మూవీస్‌ నుంచి కొరియన్‌ సిరీస్‌ల వరకు ప్రతిదీ ఇంట్లో కూర్చొని చూసే వెసులుబాటు ఉంది. మరి అలాంటప్పుడు ప్రేక్షకుడిని థియేటర్‌కు తీసుకురావాలంటే కొత్తగా ఆలోచించాల్సిందే! అలా వైవిధ్యాన్నే ఓ ఆయుధంగా మలుచుకున్న పలువురు యంగ్‌ హీరోలు విజయాల్ని అందుకుంటున్నారు. యువతరం ప్రతిభాపాటవాలివీ..

టిల్లు.. ఓ బ్రాండ్‌

‘ఇతడికి సినిమా అంటే పిచ్చి. ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్‌’లతో విజయాన్నే కాదు కలకాలం నిలిచిపోయే పాత్రనిచ్చాడు’’.. అంటూ ఓ వేదికపై ఎన్టీఆర్‌ కొనియాడడం సిద్ధు జొన్నలగడ్డ కష్టానికి దక్కిన ప్రతిఫలం. ఈయన ఓవర్‌నైట్‌ స్టార్‌ కాదు. 2009లో వచ్చిన ‘జోష్‌’లోని చిన్న పాత్రతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత వచ్చిన పలు చిత్రాల్లో అలా వచ్చి.. ఇలా వెళ్లిపోయే క్యారెక్టరే ఆయనది. ‘గుంటూరు టాకీస్‌’తో యువతలో మంచి గుర్తింపు తెచ్చుకుని ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’తో ఇంకో మెట్టు ఎక్కారు. ‘డీజే టిల్లు’తో తన ఇమేజ్‌ మారిపోయింది. దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘టిల్లు స్క్వేర్‌’ రూ.125 కోట్లకుపైగా వసూళ్లు చేసింది. డీజేలు కొడుతూ జీవించే టిల్లు జీవితంలోకి అమ్మాయి రావటం వల్ల ఎలాంటి సమస్యల్లో చిక్కుకున్నాడు? ఎలా బయటపడ్డాడనేదే ఈ రెండు సినిమాల కథాంశం. చిన్న కాన్సెప్టే అయినా ప్రేక్షకుడికి కావాల్సినంత వినోదాన్ని పంచడంలో ఇవి పెద్దవే! హెయిర్‌ స్టైల్‌ నుంచి మేనరిజం వరకూ ప్రతిదాంట్లోనూ సిద్ధు డిఫరెంట్‌ అనిపించుకున్నారు. చేసినవన్నీ రొమాంటిక్‌ బ్యాక్‌డ్రాప్‌ చిత్రాలే అయినా ఒకదానితో మరొకటి సంబంధం లేకుండా జాగ్రత్త పడ్డారు. నటనకే పరిమితం కాకుండా ఆయా దర్శకుల, రచయితలతో కలిసి తన సినిమాలకు తానే కథ రాసుకున్నారు. ‘జాక్‌’, ‘తెలుసు కదా’ చిత్రాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు.


తేజ.. సూపర్‌హీరో!

బాలనటుడిగా వివిధ చిత్రాల్లో సందడి చేసిన తేజ సజ్జ పెద్దయ్యాక నటించిన తొలి చిత్రం ‘ఓ బేబీ’. హీరోగా ఫస్ట్‌ మూవీనే జాంబీ జానర్‌లో ‘జాంబిరెడ్డి’ చేసి, టాలీవుడ్‌కు కొత్త అనుభూతి పంచారు. మనదైన ఫ్యాక్షన్‌ కథలోకి జాంబీల్ని తీసుకురావడం, వాటితో హీరో చేసే పోరాటం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘ఇష్క్‌’, ‘అద్భుతం’ వంటి డిఫరెంట్‌ కాన్సెప్టులనే ప్రయత్నించినప్పటికీ తేజకు ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు. కొంత విరామం తీసుకున్నా ఈ ఏడాది వచ్చిన ‘హనుమాన్‌’తో రూ. 300 కోట్లు రాబట్టారు. ‘జాంబిరెడ్డి’ దర్శకుడు ప్రశాంత్‌ వర్మతోనే మరోసారి చేతులు కలిపి ఈసారి ఈ ‘సూపర్‌హీరో’ ఫిల్మ్‌ని అందించారు. ఇతిహాసాలతో ముడిపడిన కథే అయినా నేటివిటీ మిస్‌ కాకుండా చూసుకోవడం కలిసొచ్చిన అంశమని చెప్పొచ్చు. ‘‘తేజ తనేంటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు యావత్‌ భారతదేశం అతడి నటనకు మెచ్చుకుంటోంది’’ అంటూ అగ్ర నటుడు చిరంజీవి ప్రశంసించారు. ప్రస్తుతం తేజ సూపర్‌ యోధుడిగా ‘మిరాయ్‌’లో నటిస్తూ అంచనాలు పెంచుతున్నారు. ‘జై హనుమాన్‌’లోనూ ఆయన నటించనున్నారు.


థ్రిల్‌ పంచే శేష్‌..

2002లో విడుదలైన ‘సొంతం’లో చిన్న పాత్ర పోషించిన అడివి శేష్‌.. 2016లో వచ్చిన ‘క్షణం’తో తన సత్తా చూపించారు. థ్రిల్లర్‌ జానర్‌లో కొత్త ఒరవడి సృష్టించారు. అదే నేపథ్యంలో తెరకెక్కిన ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘హిట్‌ 2’లతోనే కాకుండా బయోపిక్‌ ‘మేజర్‌’తోనూ మెప్పించారు. ట్విస్ట్‌లతో నిండిన కథలు, పాత్రల్లో అలవోకగా ఒదిగిపోయే శేష్‌కు ఈ సినిమా సవాలే. 26/11 ఉగ్ర దాడుల్లో అమరుడైన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాన్ని తెరపైకి తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు. శేష్‌ కాదు ఉన్నికృష్ణన్‌ క్యారెక్టరే ప్రేక్షకుడికి కనిపించాలని సంకల్పించి, శారీరకంగానూ శ్రమించారు. శేష్‌ నటన తనకు ఇష్టమని స్టార్‌ హీరో మహేశ్‌ బాబు పలు సందర్భాల్లో తెలిపారు. స్వతహాగా కథలు, స్క్రీన్‌ప్లే రాసే శేష్‌ ప్రస్తుతం ‘జీ 2’ (గూఢచారి సీక్వెల్‌), ‘డెకాయిట్‌’ల్లో నటిస్తున్నారు.


నవీన్‌.. ఉండాల్సిందే ఫన్‌

‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో హీరోగా తొలి ప్రయత్నంలోనే డిటెక్టివ్‌ స్టోరీని ఎంపిక చేసుకుని ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నవీన్‌ పొలిశెట్టి. తర్వాత, ‘జాతి రత్నాలు’, ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’తోనూ విజయాన్ని అందుకున్నారు. కథా నేపథ్యం ఏదైనా తన పాత్రకు కామెడీ టచ్‌ ఉండాల్సిందే. నవీన్‌ కామెడీ టైమింగ్‌ బాగుంటుందంటూ మహేశ్‌ బాబు ఓ సందర్భంలో ట్వీట్‌ చేశారు.


సుహాస్‌.. అదుర్స్‌

కమెడియన్‌గా కెరీర్‌ని ప్రారంభించి హీరోగా ఎదిగిన సుహాస్‌కు కథల ఎంపికలో మంచి అభిరుచి ఉంది. కథానాయకుడిగా తొలి ప్రయత్నమైన ‘కలర్‌ ఫొటో’తోనే ఆ విషయాన్ని చాటి చెప్పారు. ‘ఫ్యామిలీ డ్రామా’లో నెగెటివ్‌ ఛాయలున్న పాత్రలో, ‘రైటర్‌ పద్మభూషణ్‌’లో రచయిత కావాలనుకునే అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌గా విభిన్న కథలు పరిచయం చేశారు. ఇటీవల విడుదలైన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’లో మ్యారేజి బ్యాండు సభ్యుడిగా నటించి విజయాన్ని అందుకున్నారు. ‘శ్రీరంగనీతులు’తో అంతగా ఆకట్టుకోలేకపోయారు. ప్రస్తుతం ఆయన మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

వీరు ఇలా..

మాస్‌లో ప్రత్యేక శైలి కలిగిన నటుడు విశ్వక్‌సేన్‌. ‘ఫలక్‌నుమా దాస్‌’, ‘హిట్‌’లో పవర్‌ఫుల్‌ రోల్‌ ప్లే చేసిన ఆయన పూర్తిగా తనని తాను మార్చుకుని చేసిన చిత్రం ‘అశోక వనంలో అర్జున కల్యాణం’. వయసు 30 ఏళ్లు పైబడినా పెళ్లికాని యువకుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్జున్‌ కుమార్‌ అల్లం పాత్రతో చూపించారు. ‘గామి’తో ఈ ఏడాది తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. అఘోరాగా ఒదిగిపోయారు. తనకు మూడ్‌ బాగాలేకపోతే విశ్వక్‌ నటించిన ‘ఈ నగరానికి ఏమైంది’ చూస్తానంటూ ఓ ఈవెంట్‌లో ఎన్టీఆర్‌ ఆయన్ను పొగిడారు. త్వరలో ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’తో సందడి చేయనున్నారు విశ్వక్‌. రొటీన్‌కు భిన్నంగా నిఖిల్‌ ప్రయత్నించిన ఫస్ట్‌ మూవీ ‘స్వామి రారా’ ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. అప్పటి నుంచీ కొత్తదనం ఉన్న కథలనే ఎంపిక చేసుకుంటున్నారు. మిస్టరీ థ్రిల్లర్‌ స్టోరీల్లో నిఖిల్‌ నటిస్తే హిట్‌ అయినట్టే అనేది చాలామంది అభిప్రాయం. ‘స్పై’తో అభిమానుల్ని నిరాశ పరిచిన ఆయన ‘స్వయంభూ’తో ఆ లోటుని తీర్చేందుకు సన్నద్ధమవుతున్నారు. మరోవైపు, ‘కార్తికేయ 3’ ఖరారు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని