Alluri Seetaram Raju: సంచలనానికి 50 ఏళ్లు.. ‘అల్లూరి సీతారామరాజు’ తెర వెనక ఎన్ని విశేషాలో..!

‘అల్లూరి సీతారామరాజు’ సినిమా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సినిమా గురించి ప్రత్యేక కథనం.

Updated : 01 May 2024 10:30 IST

కొన్ని సినిమాలు.. కొన్ని పాత్రలు కొందరి కోసమే పుడతాయి. ఆయా పాత్రల్లో నటించాలని ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా,  చేరాల్సిన వారికే అది చేరుతుంది. ఆ పాత్రే విప్లవ వీరుడు.. అల్లూరి సీతారామరాజు. ఇతర అగ్ర నటులను దాటుకొని చివరకు కృష్ణను వరించింది. టాలీవుడ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన ఈ సినిమా నేటితో 50 వసంతాలు పూర్తి చేసుకుంది (1-5-1974 విడుదల). ఈసందర్భంగా ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు మీకోసం..

ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, శోభన్‌బాబులతో ప్రయత్నించినా..!

తేనె మనసులు (1965) చిత్రంతో చలనచిత్ర రంగప్రవేశం చేసి, అడ్వెంచర్‌ చిత్రాల్లో కొత్త ఒరవడి సృష్టించిన కృష్ణ 12వ చిత్రం అసాధ్యుడు (1968). ఈ సినిమాలోని ఓ అంతర్నాటకంలో కృష్ణ అల్లూరి సీతారామరాజుగా నటించినప్పుడు, ఆ విప్లవ వీరుడి ఇతివృత్తాన్ని సినిమాగా మలచాలన్న ఆకాంక్షకు తొలి బీజం పడింది. అంతకుముందు జగ్గయ్య కూడా ఆలు-మగలు (1958) సినిమాలోని ఒక అంతర్నాటకంలో సీతారామరాజుగా నటించారు. అది కూడా కృష్ణకు స్ఫూర్తే! అక్కినేని నాగేశ్వరరావుతో ఈ సినిమా తీయాలని తాతినేని ప్రకాశరావు కూడా ప్రయత్నాలు చేశారు. కానీ, ఎందుకో తీయలేకపోయారు. ఇదే ఆలోచన ఎన్టీఆర్‌కీ వచ్చింది. ప్రముఖ నాటక రచయిత పడాల రామారావుతో స్క్రిప్టు కూడా తయారుచేయించారు. ఆ ప్రయత్నమూ ఫలించలేదు. ‘దేవదాసు’ నిర్మాత డి.ఎల్‌. శోభన్‌బాబుతో ఈ సినిమా తీయాలని భావించినా, అదీ కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలోనే త్రిపురనేని మహారథితో స్క్రిప్టు రూపొందించి చిత్ర నిర్మాణానికి నడుం బిగించారు కృష్ణ. మహారథి అప్పట్లో చాలా బిజీ రచయిత. కేవలం ఈ చిత్రం కోసం ఆయన అంతకుముందు అంగీకరించిన సినిమాలను కూడా రద్దు చేసుకొని, ఆ ఆదర్శయోధుడి వీర చరిత్ర గురించి అనేక పరిశోధనల అనంతరం కథ తయారుచేశారు.

మన్యంలో మహాయజ్ఞం

1973 డిసెంబరు 12న చిత్రీకరణ ప్రారంభమైంది. పద్మాలయా సంస్థకు ఆస్థాన ఛాయాగ్రాహకుడైన వి.ఎస్‌.ఆర్‌.స్వామి.. సినిమా స్కోప్‌లో చిత్రాన్ని రూపొందిస్తే అద్భుతంగా ఉంటుందని సలహా ఇచ్చారు. సాహసానికి మారుపేరైన కృష్ణ వెంటనే ముంబయి నుంచి సంబంధిత లెన్సులు తెప్పించారు. నాగరిక ప్రపంచానికి నలభై మైళ్ల దూరంలో కొండలు, కోనల మధ్య చింతపల్లిలో గృహవసతితో సహా యూనిట్‌ మొత్తానికి సకల సౌకర్యాలను కల్పించారు కళా దర్శకుడు రామలింగేశ్వరరావు. చింతపల్లికి దగ్గరలో ఉన్న లోతుగడ్డ, సప్పర్ల, లంబసింగి, పోశనపాడు, అన్నవరం, కృష్ణదేవిపేట, బలిమెల మన్యం ప్రాంతాల్లో శీతాకాలంలో నిర్విరామంగా దాదాపు రెండు నెలలపాటు షూటింగ్‌ చేశారు. ఏజెన్సీ ప్రాంతం కావడంతో మంచినీళ్లకు కూడా చాలా దూరం వెళ్లాల్సివచ్చేది. బస్సులు, మినీ ట్రక్కులు, కార్లు, క్రేన్లు ఒకటేమిటి.. అన్నీ మన్యంలోకే వచ్చేశాయి. నటీనటులతో పాటు సాంకేతిక సిబ్బందీ ఒక అనిర్వచనీయమైన భావావేశంతో చిత్ర నిర్మాణాన్ని జయప్రదం చేశారు. తొలి ప్రయత్నంలోనే షాట్‌ ఒకే అయ్యేది. ఇది ఒక చిత్రమైన అనుభూతిగా ఉండేదని గంటందొరగా నటించిన గుమ్మడి ఒకానొక సందర్భంలో పంచుకున్నారు. సెట్స్‌లోనే మహారథి సంభాషణలు రాసేవారు. మన్యంలో షూటింగ్‌ జరిగినన్ని రోజులు మహారథి ఒకపూట మాత్రమే భోజనం చేసేవారు. పతాక సన్నివేశానికి అవసరమైన సంభాషణలు రాసేందుకు ఒకరోజు మహారథి యూనిట్‌ సభ్యులకి దూరంగా వెళ్లి సాయంకాలం వరకు రాలేదు. సీతారామరాజే తనని ఆవహించి అద్భుతమైన డైలాగులు రాయించాడని మహారథి చెబుతుండేవారు. అంతవరకూ కృష్ణ నటించిన చిత్రాలన్నీ ఒక ఎత్తయితే, అల్లూరి సీతారామరాజు మరో ఎత్తు. సంభాషణలు పలికే తీరు, హావభావాలు ప్రదర్శించే విధానం, ఆహార్యం వంటి విషయాల్లో కృష్ణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏకబిగిన 30 కాల్షీట్లు పని చేశారు.

చిత్రీకరణ దశలో దర్శకుడి మృతి

చిత్ర దర్శకుడు వి.రామచంద్రరావు కృష్ణ నటించిన మూడో చిత్రం ‘గూఢచారి 116’ చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌. కృష్ణ నటించిన ‘అసాధ్యుడు’ సినిమా రామచంద్రరావుకు దర్శకుడిగా తొలి చిత్రం. నేనంటే నేనే, అఖండుడు, కర్పూర హారతి, ఆస్తులు- అంతస్తులు, అల్లూరి సీతారామరాజు వంటి 13 విజయవంతమైన కృష్ణ చిత్రాలకు దర్శకత్వం వహించారు రామచంద్రరావు. ‘అల్లూరి..’ చివరి దశ చిత్రీకరణలో రామచంద్రరావు (47) హృద్రోగంతో మృతి చెందారు. కృష్ణనే దర్శకత్వ బాధ్యతలు నిర్వహించమని మహారథి కోరినా.. దర్శకుడు కె.ఎస్‌.ఆర్‌. దాసుకు ఆ పనులు అప్పగించారు కృష్ణ. ఈ సినిమా 19 కేంద్రాల్లో శతదినోత్సవంతో భారీ విజయాన్ని నమోదు చేసింది. రిపీట్‌ రన్‌లోనూ వంద రోజులు ఆడిన మాయాబజార్‌, దేవదాసు వంటి అతి తక్కువ సినిమాల సరసన అల్లూరి సీతారామరాజు చోటు సంపాదించింది.

విజయవాడ నగరంలో ఏకంగా నాలుగు థియేటర్లలో ఒకేరోజు విడుదలై ఈ సినిమా రికార్డు సృష్టించింది. ఎన్టీఆర్‌ ఈ సినిమా తీద్దామని కృతనిశ్చయంతో ఉన్నా.. తనకోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ప్రదర్శన చూసి కృష్ణను అభినందించి, తను సినిమా నిర్మించే ప్రయత్నాన్ని విరమించుకున్నారు. సినిమా మొత్తం కాషాయ వస్త్రాలతో కనిపించిన కృష్ణను ప్రేక్షకులు మరిచిపోలేరని, రాబోయే కృష్ణ సినిమాలపై కనీసం ఒక సంవత్సర కాలమైనా ఈ సినిమా ప్రభావం ఉంటుందని చక్రపాణి చమత్కరించారు. చిత్రంలో రూథర్‌ఫర్డ్‌గా నటించిన జగ్గయ్య వేషధారణ కోసం మేకప్‌ మేన్‌ మాధవరావు చాలా శ్రమించారు. నీలిరంగు కాంటాక్ట్‌ లెన్సులను అమర్చి బ్రిటిషు దొర రూపాన్ని తీర్చిదిద్దారు. అగ్గిరాజు పాత్రకు తొలుత ఎస్వీఆర్‌ని అనుకున్నా.. ఆ పాత్ర బాలయ్యను వరించింది. గంటందొర వేషం పల్నాటి యుద్ధంలో బ్రహ్మనాయుడు పాత్ర వంటిది. తమ్ముడు మల్లుదొర (ప్రభాకర రెడ్డి) ఎంతటి దూకుడు స్వభావుడో, గంటందొర అందుకు పూర్తి భిన్నం. సర్వసేనానిగా గంటందొర తీసుకునే నిర్ణయాలను చివరకు సీతారామరాజు కూడా ఆచరించిన సందర్భాలు ఉన్నాయి. ఈ సినిమాలో మహాకవి శ్రీశ్రీ రాసిన ‘తెలుగు వీర లేవరా’ పాటకు జాతీయస్థాయిలో ఉత్తమ గీత రచన పురస్కారం లభించింది. తెలుగు సినిమాకు ఈ అవార్డు రావడం అదే ప్రథమం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ చిత్రానికి స్వర్ణ నందిని బహూకరించింది. ఆఫ్రో-ఏషియన్‌ చలన చిత్రోత్సవంలో కూడా ఈ సినిమా ప్రదర్శితమై బహుమతి అందుకుంది. ఈ చిత్రాన్ని హిందీలో ‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’ పేరిట డబ్‌ చేసి విడుదల చేశారు. ఈ సినిమా స్వర్ణోత్సవం సందర్భంగా సీతారామరాజు తమ్ముడు సత్యనారాయణరాజును కృష్ణ సత్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని