May 9th: చిరు టు మహేశ్‌.. తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ రోజెంతో ప్రత్యేకం..!

వేర్వేరు సంవత్సరాల్లో మే 9న విడుదలై మంచి విజయాలు అందుకున్న సినిమాలపై ప్రత్యేక కథనం. అవేంటో చూసేయండి..

Updated : 09 May 2024 09:55 IST

తెలుగు చిత్ర పరిశ్రమకు (Tollywood) అతి పెద్ద పండగ సంక్రాంతి. ఆ తర్వాత ఆ స్థాయిలో క్రేజ్‌ ఉన్న సీజన్‌ వేసవి.. అందులోనూ మే 9 (May 9th) ఎంతో ప్రత్యేకం. పలు సినిమాలు ఇదే రోజున విడుదలై బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి. ఆ తేదీన మూవీ రిలీజైతే హిట్‌ కొట్టినట్టే అనేది ఓ సెంటిమెంట్‌గా మారింది. ఎంతో ప్రత్యేకమైన మే 9న ఏయే సినిమాలు వచ్చి ప్రేక్షకులను అలరించాయో ఓసారి గుర్తు చేసుకుందాం..

పేరుకు తగ్గట్టే వీరుడు..

కంటెంట్‌ బాగుంటే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించకుండా ప్రకృతి సైతం ఆపలేదని నిరూపించిన చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ (Jagadeka Veerudu Athiloka Sundari). 1990లో మే 9న ఈ సినిమా విడుదల సమయానికి తుపాను ముంచుకొచ్చింది. భారీ వర్షాల కారణంగా పలు చోట్ల మార్నింగ్‌ షోలు పడలేదు. అయినా మంచి సినిమాకి విజయం తథ్యం అని టీమ్‌ నమ్మింది. వారు ఊహించినట్టే.. మౌత్‌టాక్‌తో థియేటర్లకు వెళ్లిన వారి సంఖ్య పెరిగింది. దేవకన్య భూమ్మీదకు వస్తే.. అన్న కాన్సెప్ట్‌ ఆడియన్స్‌కు కొత్త అనుభూతి పంచింది. చిరంజీవి (Chiranjeevi)- శ్రీదేవిల (Sridevi) కెమిస్ట్రీ, అమ్రిష్‌ పురి విలనిజం, ఇళయరాజా సంగీతం, రాఘవేంద్రరావు టేకింగ్‌ సినిమాను విజయ పథంలో నడిపాయి. రూ.2 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ మూవీ రూ.15 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టింది. ఐదు విభాగాల్లో నంది అవార్డులు సొంతం చేసుకుంది. ఈ సినిమా య్యూటూబ్‌ (YouTube), ఓటీటీ ‘సన్‌నెక్ట్స్‌’ (Sun Next)లో అందుబాటులో ఉంది.

చిరు మరోసారి రఫ్పాడించారు..

ఎవర్‌గ్రీన్‌ ఫిల్మ్‌ ‘జగదేక వీరుడు.. అతిలోక సుందరి’ విడుదలైన ఏడాదికే మరో హిట్‌ అందుకున్నారు చిరంజీవి. అదే ‘గ్యాంగ్‌ లీడర్‌’ (Gang Leader) (1991). రఘుపతి, రాఘవ, రాజారామ్‌ అనే ముగ్గురు అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో దర్శకుడు విజయ బాపినీడు తెరకెక్కించిన చిత్రమిది. ‘చెయ్యి చూశావా.. ఎంత రఫ్‌గా ఉందో. నాతో పెట్టుకోకు రఫ్పాడించేస్తా’ వంటి డైలాగ్స్‌తో, డ్రెస్సింగ్‌ స్టైల్‌తో చిరు అదరగొట్టారు. ‘పాపా రీటా’, ‘వానా వానా వెల్లూవాయే’, ‘సండే అనను రా.. మండే అనను రా’ లాంటి పాటలతో బప్పీ లహరి ఉర్రూతలూగించారు. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా రూ.10 కోట్ల వసూళ్లు చేసిందని సినీ వర్గాల సమాచారం. ఓటీటీ ‘జియో సినిమా’ (Jio Cinema), ‘ఆహా’ (Aha), యూట్యూబ్‌లోనూ ఈ మూవీ అందుబాటులో ఉంది.

ఫ్యాక్షన్‌+ లవ్‌= హిట్‌

ప్రేమకు వ్యతిరేకమైన పవర్‌ఫుల్‌ ఫ్యాక్షనిస్ట్‌ కుమార్తెని ప్రేమించిన హీరో ఆమెను వివాహం చేసుకునేందుకు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘ప్రేమించుకుందాం రా’ (Preminchukundam Raa). జయంత్‌ సి. పరాన్జీ దర్శకుడు. గిరిగా వెంకటేశ్‌ (Venkatesh), కావేరిగా అంజలా జవేరి నటన ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. లిటిల్‌ హార్ట్స్‌ ప్యాకెట్‌, గ్రీటింగ్‌ కార్డుతో వెంకటేశ్‌ హీరోయిన్‌కి ప్రపోజ్‌ చేసేందుకు ప్రయత్నించే సీన్‌ ఇప్పటికీ ఫ్రెష్‌గా ఉంటుంది. ఈ సినిమా వల్ల లిటిల్‌ హార్ట్స్‌ సేల్స్‌ పెరిగాయంటే అతిశయోక్తి కాదు. మహేశ్‌ మహదేవన్‌, మణిశర్మ అందించిన స్వరాలు ఈ సినిమా విజయంలో ప్రధాన పాత్ర పోషించాయి. 1997లో మే 9న విడుదలైన ఈ సినిమా రూ. 20 కోట్లు వసూళ్లు చేసింది. యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.

నాగార్జున ‘సంతోషం’..

నాగార్జున (Nagarjuna) హీరోగా దర్శకుడు దశరథ్‌ తెరకెక్కించిన సినిమా ‘సంతోషం’ (Santosham). గ్రేసీ సింగ్‌, శ్రియ హీరోయిన్లు. అక్క ప్రమాదవశాత్తూ చనిపోవడంతో బావను పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికొచ్చిన అమ్మాయి.. అతడినే చేసుకుందా? తనను ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడిందా? అనే సున్నితమైన అంశంతో తెరకెక్కిన ఈ సినిమా 2002లో ఇదే రోజున బాక్సాఫీసు ముందుకొచ్చింది. మ్యూజికల్‌గానూ హిట్‌ అయిన ఈ చిత్రం ఉత్తమ నటుడిగా నాగార్జునకు ‘నంది’ అవార్డును అందించింది. ‘థర్డ్‌ బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌- బ్రాంజ్‌’ కేటరిగిలో నంది పురస్కారం దక్కించుకున్న ఈ సినిమా రెండు ఫిల్మ్‌ఫేర్‌లూ (బెస్ట్‌ ఫిల్మ్‌, బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌- ఆర్పీ పట్నాయక్‌) పొందింది. యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.

‘మహానటి’గా కీర్తిసురేశ్‌..

సావిత్రి జీవితాధారంగా నాగ్‌ అశ్విన్‌ రూపొందించిన చిత్రం ‘మహానటి’ (Mahanati). సావిత్రి పాత్ర పోషించిన కీర్తిసురేశ్‌ (Keerthy Suresh) సినిమా విడుదల తర్వాత మహానటిగా పేరొందారు. బయోపిక్స్‌లో ప్రత్యేకంగా నిలిచే ఈ మూవీ మూడు జాతీయ పురస్కారాలు (బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ ఇన్‌ తెలుగు, బెస్ట్‌ యాక్ట్రెస్‌, బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైన్‌) సొంతం చేసుకుంది. పలు ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లోనూ ప్రదర్శితమైంది. 2018 మే9న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా రూ. 83 కోట్లు వసూళ్లు చేసింది. బడ్జెట్‌: రూ. 25 కోట్లు. ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Amazon Prime Video)లో ఉంది.

మహర్షి..

రైతుల సమస్యలను కళ్లకుకడుతూ వ్యవసాయ రంగ ప్రాధాన్యాన్ని చర్చించిన సినిమా ‘మహర్షి’ (Maharshi). మహేశ్‌ బాబు (Mahesh Babu) హీరోగా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించారు. 2019లో ఇదే రోజున విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టడంతోపాటు జాతీయ ఉత్తమ వినోదాత్మక చిత్రంగా నిలిచింది. ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా రాజు సుందరం సైతం జాతీయ అవార్డు అందుకున్నారు. ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

కల్కి రావాల్సింది.. కానీ..!

‘జగదేక వీరుడు.. అతిలోక సుందరి’, ‘మహానటి’ని మే 9న విడుదల చేసి బ్లాక్‌బస్టర్‌ హిట్‌లు అందుకున్న నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)ని అదే డేట్‌కి రిలీజ్‌ చేయనున్నట్లు గతంలో ప్రకటించింది. కానీ, అనివార్య కారణాల వల్ల జూన్‌ 27కి వాయిదా వేసింది. ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. కమల్‌హాసన్‌ నటించిన ‘భారతీయుడు’ (Bharateeyudu) కూడా 1996లో మే 9న విడుదలై తమిళ, తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ‘భారతీయుడు2’ (Indian 2) వస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని