Matti kusthi review: రివ్యూ: మట్టికుస్తీ
matti kusthi review: విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన ‘మట్టికుస్తీ’ ఎలా ఉందంటే?
matti kusthi review; చిత్రం: మట్టికుస్తీ; నటీనటులు: విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, కరుణాస్, శ్రీజా రవి, అజయ్, శత్రు, మునీష్‌కాంత్, కాళీ వెంకట్, రిడిన్ కింగ్ స్లే, హరీష్ పేరడీ తదితరులు; సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎం నాథన్; సంగీతం: జస్టిన్ ప్రభాకరన్; నిర్మాతలు: రవితేజ, విష్ణు విశాల్; రచన, దర్శకత్వం: చెల్లా అయ్యావు; విడుదల తేదీ: 02-12-2022
తమిళంలో వైవిధ్యభరితమైన కథలకు చిరునామాగా నిలిచే హీరో విష్ణు విశాల్. 'అరణ్య ', 'ఎఫ్ఐఆర్ ' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆయన ఇప్పుడు 'మట్టి కుస్తీ'తో అలరించేందుకు సిద్ధమయ్యారు. చెల్లా అయ్యావు తెరకెక్కించిన చిత్రమిది. ఐశ్వర్య లక్ష్మీ కథానాయిక. విష్ణు విశాల్‌తో కలిసి కథానాయకుడు రవితేజ స్వయంగా నిర్మించడంతో దీనిపై తెలుగులోనూ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్లుగానే పాటలు, ప్రచార చిత్రాలు ఆకట్టుకునేలా ఉండటంతో ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. మరి ఈ చిత్ర కథేంటి? థియేటర్లో ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందించింది? ఈ సినిమాతో రవితేజ నిర్మాతగా విజయాన్ని అందుకున్నారా? లేదా? తెలుసుకుందాం పదండి..
కథేంటంటే: వీరా (విష్ణు విశాల్) ఆంధ్రా ప్రాంతానికి చెందిన కుర్రాడు. ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో మామయ్యే (కరుణాస్) అన్నీ తానై పెంచి పెద్ద చేస్తాడు. తండ్రీతాతలు సంపాదించిన ఆస్తిని జల్సా చేస్తూ తిరగడం.. ఊర్లో చిన్న చిన్న పంచాయితీలు చేయడం.. ఫ్రెండ్స్‌తో కలిసి కబడ్డీ ఆడటం.. ఇదే అతడి దినచర్య. తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తనకంటే తక్కువ చదువుకోవాలని.. ఆమెకు పొడుగు జడ ఉండాలని అతనికంటూ కొన్నినియమాలుంటాయి. ఇక కీర్తి (ఐశ్వర్య లక్ష్మీ)ది మరో కథ. కేరళలోని పాలక్కడ్‌లో పుట్టి పెరిగిన ఈ అమ్మాయి బీఎస్సీ వరకు చదువుకుంది. బాబాయ్ (మనీష్‌కాంత్) ప్రోత్సాహంతో ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకపోయినా రెజ్లర్‌గా మారుతుంది. అయితే అబ్బాయిలా కటింగ్ చేసుకొని.. కుస్తీలు పట్టే ఆ అమ్మాయిని చూసి ఏ ఒక్కరూ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు. అయితే కీర్తి బాబాయ్ ఆమె చదువు కోలేదని, పొడుగు జడ ఉందని రెండు అబద్దాలు చెప్పి వీరాతో పెళ్లి జరిపిస్తాడు. అయితే ఓరోజు వీరాపై కొందరు శత్రువులు దాడి చేస్తారు. దీంతో వాళ్లను చిత్తు చిత్తుగా కొట్టి అతడిని కాపాడుకుంటుంది కీర్తి. కానీ, ఆ తర్వాత నుంచి వీరా - కీర్తి దాంపత్య జీవితంలో రకరకాల సమస్యలొస్తాయి. మరి ఆ సమస్యలేంటి? దానికి కారణం ఎవరు? ఈ భార్యాభర్తలిద్దరూ మట్టి కుస్తీలో ఎందుకు తలపడాల్సి వచ్చింది? చివరకు వీళ్లు ఎలా ఒక్కటయ్యారు? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి.
ఎలా సాగిందంటే: టైటిల్ చూసి ఇది క్రీడా నేపథ్య చిత్రమనుకుంటే పొరపాటు పడినట్లే. వినోదాత్మకంగా సాగే భార్యాభర్తల ప్రేమకథ ఇది. ఆ కథని మట్టి కుస్తీ ఆటతో ముడిపెట్టి అందులో చక్కటి సందేశాన్ని మేళవించి తెరపై ఆసక్తికరంగా ఆవిష్కరించాడు దర్శకుడు చెల్లా అయ్యావు. ప్రథమార్ధమంతా నాయకానాయికల పరిచయం.. పెళ్లి తర్వాత అహం వల్ల వాళ్లిద్దరి మధ్య వచ్చే సమస్యల చుట్టూనే తిరుగుతుంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది మగాళ్ల ఈగో కథ. తన భార్య ఎప్పుడూ తన కింద అణిగిమణిగి ఉండాలి.. చెప్పిందే చేయాలి అని ఆరాటపడే ఒక మగాడికి ఓ రెజ్లర్ భార్యగా వస్తే అతనెలాంటి ఇబ్బందులు పడతాడో వినోదాత్మకంగా చూపించారు దర్శకుడు. ఆరంభంలో నాయకానాయికల పరిచయ సన్నివేశాలు సాదాసీదాగా ఉన్నా.. వారి పెళ్లి చూపుల దగ్గర్నుంచి అసలైన నవ్వుల రైడ్ మొదలవుతుంది. పెళ్లి తర్వాత భార్య ముందు బడాయి పోవడానికి వీరా చేసే ప్రయత్నాలు.. తన సవరాన్ని జడ అని నమ్మించడానికి కీర్తి పడే కష్టాలు నవ్వులు పూయిస్తాయి. భార్యల్ని అదుపులో ఎలా పెట్టాలి అని మగాళ్లు.. భర్తల్ని ఎలా చెప్పుచేతల్లో పెట్టుకోవాలని భార్యలు కూర్చొని మాట్లాడుకునే సన్నివేశాలు కావాల్సినంత వినోదాన్ని పంచిస్తాయి. విరామానికి ముందు ఓ యాక్షన్ ఎపిసోడ్‌తో కీర్తిలో అసలు కోణం బయట పడటం.. అది చూసి వీరా కంగు తినడంతో ద్వితీయార్ధం ఏం జరుగుతుందా? అన్న ఆసక్తి మొదలవుతుంది.
ఇక తన భార్య ఓ రెజ్లర్ అని తెలిశాక వీరా ప్రవర్తనలో వచ్చే మార్పు.. ఊర్లో వాళ్ల నుంచి అతడికి ఎదురయ్యే అనుభవాలు కడుపుబ్బా నవ్విస్తాయి. మామయ్య చెప్పుడు మాటలు విని.. వీరా, కీర్తిని దూరం పెట్టిన దగ్గర్నుంచి కథ ఒక్కసారిగా సీరియస్‌గా మారుతుంది. భార్యపై గెలిచి పైచేయి సాధించేందుకు వీరా మట్టికుస్తీ పోటీలో తలపడాలనుకోవడం.. 15రోజుల్లోనే ఆ ఆట నేర్చుకొని బరిలో దిగడం మరీ సినిమాటిక్‌గా అనిపిస్తాయి. పతాక సన్నివేశాలు ఊహకు తగ్గట్లుగానే ఉన్నాఆకట్టుకుంటాయి. మహిళలకు మగవాళ్లతో సమానంగా గౌరవం ఇవ్వాలి.. వాళ్ల ప్రతిభను ప్రోత్సహించాలి అంటూ మంచి సందేశంతో సినిమాని ముగించిన తీరు మెప్పిస్తుంది.
ఎవరెలా చేశారంటే: సినిమాలో విష్ణు విశాల్ కథానాయకుడైనా.. అసలైన హీరోయిజమంతా ఐశ్వర్య లక్ష్మీ పాత్రలోనే కనిపిస్తుంది. ఓవైపు భర్తకు నిజం తెలియనీయకుండా భయపడుతూ బతికే గృహిణిగా.. వీర వనితగా రెండు కోణాల్లోనూ అదరగొట్టింది ఐశ్వర్య. వీరా పాత్రకు విష్ణు విశాల్ నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. నాయికా ప్రాధాన్య కథలా కనిపించినా.. కథను నమ్మి ఆ పాత్ర చేసేందుకు ముందుకొచ్చిన అతడి ప్రయత్నాన్ని అభినందించాలి. హీరో మామయ్య, హీరోయిన్ బాబాయ్ పాత్రలు కాలక్షేపాన్నిస్తాయి. అజయ్, శత్రు పాత్రలు పరిధి మేరకు ఆకట్టుకుంటాయి. దర్శకుడు భార్యాభర్తల ఆధిపత్య పోరును ఓ స్పోర్ట్స్ డ్రామా కథతో మిళితం చేసిన తీరు.. దానికి సందేశాన్ని జోడించిన విధానం మెప్పిస్తుంది. ప్రధమార్ధంలో తొలి 20నిమిషాలు కాస్త సాగతీతగా అనిపిస్తాయి. తెలుగు డబ్బింగ్ విషయంలో మరింత శ్రద్ధ పెట్టాల్సింది. పాటలు ఏమాత్రం ఆకట్టుకోవు. తమిళ నేటివిటీ కాస్త ఇబ్బంది పెడుతుంది. ఛాయాగ్రహణం, నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి.
బలాలు: కథా నేపథ్యం, విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మీ నటన, వినోదం
బలహీనతలు: ఊహకు తగ్గట్లుగా సాగే కథనం, రొటీన్ క్లైమాక్స్
చివరిగా: నవ్వులు పూయించే భార్యాభర్తల కుస్తీ.
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇదీ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Suicide: చదువుకోమని చెప్పారని.. 9 ఏళ్ల చిన్నారి ఆత్మహత్య
-
Movies News
Kamal Haasan: ఆయన్ని చూస్తే చాలా అసూయగా ఉంది: కమల్ హాసన్
-
Sports News
Virat Kohli: చాలా కార్లు అమ్మేసిన విరాట్.. కారణం చెప్పేసిన స్టార్ బ్యాటర్
-
Crime News
TSRTC: బైక్ ఢీకొనడంతో ప్రమాదం.. దగ్ధమైన ఆర్టీసీ రాజధాని బస్సు
-
India News
India Corona: అమాంతం 40 శాతం పెరిగి.. 3 వేలకు చేరిన కొత్త కేసులు
-
Movies News
Tollywood:యాక్టింగ్‌తో అలరించి.. టేకింగ్‌తో మెప్పించి.. రెండు పడవలపై ప్రయాణించిందెవరంటే?