Manamey Movie Review: రివ్యూ: మనమే.. శర్వానంద్‌, కృతిశెట్టిల మూవీ ఎలా ఉంది?

Manamey Movie Review: శర్వానంద్‌, కృతిశెట్టి జంటగా, శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామా మెప్పించిందా?

Updated : 07 Jun 2024 13:59 IST

Manamey Movie Review; చిత్రం: మనమే; నటీనటులు: శర్వానంద్‌, కృతిశెట్టి, విక్రమ్‌ ఆదిత్య, సీరత్‌కపూర్‌, ఆయేషా ఖాన్‌, వెన్నెల కిషోర్‌, రాహుల్‌ రవీంద్రన్‌, రాహుల్‌ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన్‌ తదితరులు; సంగీతం: హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌; సినిమాటోగ్రఫీ: జ్ఞాన శేఖర్‌ వి.ఎస్‌. విష్ణు శర్మ; ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి; నిర్మాత: టి.జి. విశ్వప్రసాద్‌; రచన, దర్శకత్వం: శ్రీరామ్‌ ఆదిత్య; విడుదల: 07-06-2024

న్నికల సందడి ముగిసింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి సినిమాలపై పడింది. ఈ వారం బాక్సాఫీస్‌ బరిలో నిలిచిన చిత్రాల్లో ‘మనమే’ ఒకటి. ‘ఒకే ఒక జీవితం’ విజయం తర్వాత శర్వానంద్‌ నుంచి వస్తున్న సినిమా ఇది. శ్రీరామ్‌ ఆదిత్య తెరకెక్కించారు. విడుదలకు ముందే పాటలు, ప్రచార చిత్రాలు మంచి ఆదరణ దక్కించుకోవడంతో సినీప్రియుల చూపు దీనిపై పడింది. మరి ఈ ‘మనమే’ కథేంటి? (Manamey Movie Review) ఇది శర్వాకు మరో విజయాన్ని అందించిందా?

కథేంటంటే: లండన్‌లో మాస్టర్స్‌ పూర్తి చేసి ఖాళీగా ఉంటూ జీవితాన్ని జల్సాగా గడిపేస్తుంటాడు విక్రమ్‌ (శర్వానంద్‌). అనాథైన తన మిత్రుడు అనురాగ్‌ (త్రిగుణ్‌)ను చిన్నప్పటి నుంచి అన్నీ తానై చూసుకుంటాడు. ఆఖరికి అతని ప్రేమ పెళ్లిని దగ్గరుండి జరిపిస్తాడు. అనురాగ్‌ ఒక పని విషయమై ఫ్యామిలీతో కలిసి భారత్‌కు వస్తాడు. కానీ, ఓ ప్రమాదంలో భార్యభర్తలిద్దరూ కన్నుమూస్తారు. దీంతో అనాథగా మిగిలిన వాళ్ల కొడుకు ఖుషి (విక్రమ్‌ ఆదిత్య) సంరక్షణ బాధ్యత శాంతి స్నేహితురాలు సుభద్ర (కృతి శెట్టి)తో కలిసి విక్రమ్‌ తీసుకోవాల్సి వస్తుంది. అలా వాళ్లిద్దరూ పెళ్లి కాకున్నా ఖుషి కోసం తల్లిదండ్రుల బాధ్యతలు భుజానికెత్తుకుంటారు. మరి ఆ బాబును పెంచే విషయంలో విక్రమ్, సుభద్రలకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు జరిగాయి? పెళ్లికి ముందే వేరే కుర్రాడితో కలిసి ఓ చిన్నారి సంరక్షణ బాధ్యతలు తీసుకున్నందుకు సుభద్రకు కాబోయే భర్త కార్తీక్‌ (శివ కందుకూరి) ఎలా స్పందించాడు? ఖుషిని పెంచే క్రమంలో విక్రమ్‌ తనని తాను ఎలా మార్చుకున్నాడు? సుభద్రపై కలిగిన ప్రేమను ఆమెకు తెలియజేశాడా? లేదా? ఆఖరికి తన ప్రేమ పెళ్లి పీటలెక్కిందా? ఈ కథలో జోసెఫ్‌ (రాహుల్‌ రవీంద్రన్‌) పాత్రేంటి?(Manamey Movie Review) అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి.

ఎలా సాగిందంటే: ఒకరితో ఒకరికి ఏ సంబంధం లేని ఓ పెళ్లి కాని జంట అనుకోని పరిస్థితుల్లో ఒక బాబుకు సంరక్షకులుగా ఉండాల్సి వస్తే.. ఆ ప్రయాణం వాళ్లిద్దరి జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందన్నదే క్లుప్తంగా ఈ చిత్ర కథాంశం. దీన్ని వినోదంతో పాటు బలమైన భావోద్వేగాల్ని మేళవించి దర్శకుడు శ్రీరామ్‌ ఆసక్తికరంగా తీర్చిదిద్దుకోవడమే కాదు అంతే చక్కగా తెరపై ఆవిష్కరించాడు. ప్రథమార్ధమంతా ఓ ఫన్‌ రైడ్‌లా సరదా సరదాగా సాగిపోతే.. ద్వితీయార్ధం భావోద్వేగాలతో మదిని బరువెక్కిస్తుంది. ఇది శర్వాకు మాత్రమే సరిగ్గా సరిపోయే కథ. సినిమాలో విక్రమ్‌గా ఆయన పాత్రను తీర్చిదిద్దిన తీరు.. ప్లేబాయ్‌లా అతను చేసే అల్లరి అందరికీ నచ్చుతుంది. దర్శకుడు ప్రేక్షకుల్ని కథలోకి తీసుకెళ్లడానికి ఎక్కువ టైమ్‌ కూడా తీసుకోలేదు. టైటిల్‌ కార్డ్స్‌తోనే విక్రమ్‌ - అనురాగ్‌ల స్నేహాన్ని పరిచయం చేసేసి.. ఆ వెంటనే ఓ విషాదంతో వాళ్ల స్నేహానికి పుల్‌స్టాప్‌ పెట్టి.. అక్కడి నుంచి అసలు కథలోకి తీసుకెళ్లిపోయాడు.

ఖుషి సంరక్షణ బాధ్యతల్ని విక్రమ్, సుభద్ర భుజానికెత్తుకున్న దగ్గర్నుంచి కథలో నవ్వుల జల్లు మొదలవుతుంది. పిల్లాడ్ని చూసుకోవడానికి విక్రమ్‌ పడే అవస్థలు.. ఖుషి నుంచి అతనికెదురయ్యే సవాళ్లు.. వీళ్లిద్దరి అల్లరితో సుభద్రకు వచ్చే తలనొప్పులు.. ఈ మధ్యలో వచ్చే వెన్నెల కిషోర్‌ ఎపిసోడ్‌ అన్నీ భలే నవ్విస్తాయి. ఆరంభంలోనే సుభద్రకు పెళ్లి కుదిరినట్లు చెప్పడం వల్ల ఆమెతో విక్రమ్‌ ఎలా ప్రేమలో పడతాడు.. వాళ్లిద్దరూ ఎలా ఒక్కటవుతారన్న ఆసక్తి ప్రేక్షకుల్ని వెంటాడుతుంటుంది. సరిగ్గా ఈ పాయింట్‌తోనే ఇంటర్వెల్‌ను ఆసక్తికరంగా ముగించాడు దర్శకుడు శ్రీరామ్‌. విక్రమ్‌ ఓవైపు సుభద్రకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించడం.. మరోవైపు ఆమె కాబోయే భర్త వాళ్లిద్దరి మధ్యకు రావడం.. ఈ క్రమంలో ముగ్గురు మధ్య జరిగే ఆసక్తికరమైన డ్రామా కాసేపు కాలక్షేపాన్నిస్తుంది. (Manamey Movie Review) కాకపోతే ఫస్టాఫ్‌లో కనిపించినంత వినోదం ద్వితీయార్ధంలో అంతగా కనిపించదు. ఇక ఈ మధ్యలో వచ్చే బెలూన్‌ ఫెస్టివల్‌ ఎపిసోడ్‌ కాస్త బోరింగ్‌. ఓవైపు ఖుషి.. మరోవైపు సుభద్ర తన జీవితంలో నుంచి వెళ్లిపోయాక విక్రమ్‌ పడే మానసిక సంఘర్షణ మదిని బరువెక్కిస్తుంది. ప్రీక్లైమాక్స్‌లో పేరెంట్స్‌ ఎమోషన్స్‌ నేపథ్యంలో వచ్చే ఎపిసోడ్‌ అందర్నీ ఆలోచింపజేస్తుంది. ఎలాంటి యాక్షన్‌ హంగామా లేకుండా దర్శకుడు ఈ కథను ఆహ్లాదకరంగా ముగించిన తీరు కూడా మెప్పిస్తుంది.

Krithi Shetty: నేనొక్కదాన్నే కారణం కాదు: కృతిశెట్టి

ఎవరెలా చేశారంటే: విక్రమ్‌ పాత్రలో శర్వానంద్‌ చాలా అందంగా... ఎనర్జిటిక్‌గా కనిపించాడు. తనదైన హుషారైన నటనతో ప్రేక్షకుల్ని నవ్వించడమే కాదు.. భావోద్వేగభరితమైన నటనతో మదిని బరువెక్కించాడు. కథలో కీలకమైన ఖుషి పాత్రలో విక్రమ్‌ ఆదిత్య నటన ముద్దొచ్చేలా ఉంటుంది. ఆ పిల్లాడితో శర్వా చేసే అల్లరి సినిమాకి ఆకర్షణ. సుభద్రగా కృతి తెరపై అందంగా కనిపించడమే కాదు పరిణతితో కూడిన నటనతో కట్టిపడేసింది. ‘ఉప్పెన’ తర్వాత ఆమెకు పడిన మంచి నటనా ప్రాధాన్యమున్న పాత్ర ఇదే. ప్రతినాయకుడిగా రాహుల్‌ రవీంద్రన్‌ పాత్ర తెరపై అంత బలంగా కనిపించదు. సీరత్‌ కపూర్, ఆయేషా అతిథి పాత్రల్లో తళుక్కున మెరిశారు. వెన్నెల కిషోర్‌ కనిపించే రెండు మూడు సీన్లు బాగా వర్కవుటయ్యాయి. రాహుల్‌ రామకృష్ణ పాత్రను మాత్రం పెద్దగా వాడుకోలేకపోయారు. (Manamey Movie Review) త్రిగుణ్, శివ కందుకూరి, సచిన్‌ ఖేడ్కర్‌ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. దర్శకుడు శ్రీరామ్‌ రాసుకున్న కథ.. దాన్ని తెరపైకి తీసుకొచ్చిన తీరు బాగున్నాయి. ద్వితీయార్ధంలో వినోదాన్ని.. భావోద్వేగాల్ని సమంగా బ్యాలెన్స్‌ చేయడంలో కాస్త తడబడ్డాడనిపిస్తుంది. ఈ చిత్రానికి హిషమ్‌ సంగీతం మరో ఆకర్షణ. ఇందులో 16 పాటలున్నా అవన్నీ కథలో సహజంగా భాగమైపోయి ఉంటాయి. పాటలు ఎక్కువైన ఫీలింగ్‌ ఎక్కడా అనిపించదు. విజువల్స్‌ చాలా రిచ్‌గా ఉన్నాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉంటాయి.

  • బలాలు
  • + కథా నేపథ్యం
  • + శర్వానంద్, కృతిశెట్టి నటన
  • + వినోదం.. భావోద్వేగాలు
  • బలహీనతలు
  • - ద్వితీయార్ధంలో కొన్ని సీన్లు
  • - ప్రతినాయక పాత్ర
  • చివరిగా: ‘మనమే’.. వినోదభరిత ప్రయాణం (Manamey Movie Review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని