Miral Review: రివ్యూ: మిరల్‌.. ‘ప్రేమిస్తే’ భరత్‌ నటించిన చిత్రం భయపెట్టిందా?

ప్రేమిస్తే సినిమా హీరో భరత్‌ నటించిన హారర్‌ థ్రిల్లర్‌ మూవీ ‘మిరల్‌’. ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమింగ్‌ అవుతోంది. రివ్యూ మీకోసం..

Updated : 25 Jun 2024 16:23 IST

చిత్రం: మిరల్‌; తారాగణం: భరత్‌, వాణీ భోజన్‌, కేఎస్‌ రవికుమార్‌, మీరా కృష్ణన్‌, రాజ్‌ కుమార్‌, మాస్టర్‌ అంకిత్‌ తదితరులు; సంగీతం: ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌; ఛాయాగ్రహణం: సురేశ్‌ బాలా; కూర్పు: ఆర్‌. కళైవాణన్‌; నిర్మాణ సంస్థ: యాక్సెస్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ; రచన, దర్శకత్వం: ఎం. శక్తివేల్‌; స్ట్రీమింగ్‌ వేదిక: ఆహా.

‘ప్రేమిస్తే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కోలీవుడ్‌ నటుడు భరత్‌ (Bharath). ఆయన నటించిన హారర్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌ ‘మిరల్‌’ (Miral). వాణీ భోజన్‌ (Vani Bhojan) మరో కీలక పాత్రధారి. దర్శకుడు ఎం.శక్తివేల్‌ తెరకెక్కించిన ఈ మూవీ తెలుగులో కొన్ని రోజుల క్రితం బాక్సాఫీసు ముందుకొచ్చింది. ఇప్పుడు ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ (Aha)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ఉన్న కంటెంట్‌ ఏంటి? ఎలా ఉందంటే? (Miral Review)

కథేంటంటే?: సివిల్‌ ఇంజినీర్‌ హరి (భరత్‌).. రమ (వాణీ భోజన్‌)ను ప్రేమించి, పెళ్లి చేసుకుంటాడు. ఈ దంపతుల ముద్దుల తనయుడి పేరు సాయి (మాస్టర్‌ అంకిత్‌). ఈ చిన్న కుటుంబంలో ఏదో అలజడి. మాస్క్‌ ధరించి తన భర్తను ఎవరో హత్య చేసినట్టు రమకు ఒక రాత్రి పీడకల వస్తుంది. జరగరానిదేదో జరగనుందంటూ ఎప్పుడూ ఆందోళన చెందుతుంటుంది. రమ పరిస్థితి గురించి హరి తన అత్తగారికి (మీరా కృష్ణన్‌) వివరిస్తాడు. గ్రామ దేవతకు పూజ చేస్తే తప్ప ప్రశాంతత ఉండదని ఆమె చెప్పడంతో.. భార్య, కుమారుడితో కలిసి హరి.. అత్తగారింటికెళ్తాడు. పూజ పూర్తయిన రోజు రాత్రే అర్జంట్‌ పని ఉందంటూ హరి కుటుంబం అక్కడినుంచి తిరిగి పయనమవుతుంది. మార్గమధ్యలో కారు టైరు పంక్చర్‌ అవుతుంది. అర్ధరాత్రి ఆ దారిలో ప్రయాణిస్తే ప్రాణాలు పోతాయనేది సమీప గ్రామస్థుల మూఢనమ్మకం. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఈ సమాచారాన్ని చేరవేస్తూ జాగ్రత్తగా ఉండమని హరి ఫ్యామిలీకి చెబుతాడు. అదే సమయంలో.. రమకు కొన్నిరోజుల క్రితం వచ్చిన కల కళ్లెదుట ప్రత్యక్షమవుతుంది. మరి, రమ ఊహించినట్టు హరి చనిపోయాడా? అతడి చావు కోరుకుందెవరు? ఆ రోడ్డులో నిజంగానే దెయ్యాలున్నాయా? రమ తండ్రి రవికుమార్‌ (కేఎస్‌ రవికుమార్‌), హరి స్నేహితుడు ఆనంద్‌ (రాజ్‌ కుమార్‌) పాత్రలేంటి? తదితర ప్రశ్నలన్నింటికీ సమాధానం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే (Miral Review in Telugu).

ఎలా ఉందంటే?: ఓ రొటీన్‌ రివెంజ్‌ స్టోరీకి హారర్‌ ఎలిమెంట్స్‌ జోడించి ఈ సినిమాని తెరకెక్కించారు దర్శకుడు శక్తివేల్‌. ఆయన ఆలోచన బాగుందిగానీ దాన్ని తెరపై అర్థవంతంగా చూపలేకపోయారు. అసలు పాయింట్‌ చెప్పేందుకు చాలా సమయం తీసుకున్నారు. షార్ట్‌ఫిల్మ్‌ స్టోరీని అనవసర సీన్స్‌తో సినిమాగా రూపొందించారనే ఫీలింగ్‌ ప్రేక్షకుడికి తప్పక కలుగుతుంది. హరి కుటుంబ నేపథ్యం, రాజ్‌ కుమార్‌తో స్నేహం, రమ పుట్టిల్లు, ఆ పల్లెటూరి వాతావరణం, అక్కడకు హరి, రాజ్‌కుమార్‌ ఫ్యామిలీల రాక.. ఫస్టాఫ్‌ మొత్తం ఈ అంశాలతోనే నిండిపోయింది. రమ పుట్టింట్లోనే భూతం ఉందా? అని సందేహపడేలా కొన్ని సీన్స్‌ క్రియేట్‌ చేశారు. కథలోకి వెళ్లేకొద్దీ రమ బ్యాక్‌స్టోరీ ఏమైనా చెబుతారేమో అని ఆశపడిన ప్రేక్షకుడికి నిరాశే ఎదురవుతుంది. ఫ్యామిలీతో కలిసి హరి అర్ధరాత్రి ఇంటికి బయలుదేరడం నుంచి సినిమాలో వేగం పెరుగుతుంది. హరి- రమల ప్రేమ వివాహాన్ని స్వాగతించని రవికుమారే వారికి అపాయం తలపెట్టాడా? అన్న ప్రశ్నను లేవనెత్తుతూ ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ సెకండాఫ్‌పై ఆసక్తి రేకెత్తిస్తుంది (Miral Review in Telugu).

అడవిని తలపించే దారిలో అర్ధరాత్రి అపాయంలో చిక్కుకున్న తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు హీరో చేసే ప్రయత్నమే ద్వితీయార్ధంలో సింహభాగంగా ఉంటుంది. ఓ వైపు భయం, మరోవైపు ఫ్యామిలీని రక్షించుకోవాలనే తాపత్రయం.. ఇలా విభిన్న కోణాలను స్పృశిస్తూ భరత్‌ ఆకట్టుకున్నారు. విజువల్స్‌, సౌండ్‌ ఎఫెక్ట్స్‌ మంచి థ్రిల్‌ పంచుతాయి. ఆ రోడ్డు ఎందుకంత ప్రమాదకరం? అన్నది మాటలకే పరిమితం చేశారు తప్ప దాన్నీ పెద్దగా ఎలివేట్‌ చేయలేదు. ప్రీ క్లైమాక్స్‌ని ఊహించలేని మలుపులతో రూపొందించడం మంచి అనుభూతి పంచే అంశమేగానీ.. అక్కడే అసలు సంగతి తెలియడంతో ప్రేక్షకుడికి అసంతృప్తి కలుగుతుంది. డబ్బింగ్‌ కూడా ఈ చిత్రానికి ఓ సమస్యే. కొన్ని ఎపిసోడ్స్‌లో ఎవరు?ఎందుకు? కథ వివరిస్తున్నారో అర్థంకాని పరిస్థితి (Miral Review).

ఎవరెలా చేశారంటే?: హరి పాత్రలో భరత్‌ సెటిల్డ్‌గా నటించి, మెప్పించారు. కుటుంబాన్ని రక్షించుకునేందుకు ఆయన చేసిన సాహసం ఆకట్టుకుంది. ‘మీకు మాత్రమే చెప్తా’తో తెలుగు ఆడియన్స్‌ను పలకరించిన వాణీ భోజన్‌.. ఇందులో ఎక్కువగా భయపడుతూనే కనిపిస్తారు. హీరోయిన్‌ తండ్రిగా ప్రముఖ దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌, తల్లిగా మీరా కీష్ణన్‌, హీరో మిత్రుడిగా రాజ్‌ కుమార్‌ పాత్రల పరిధి మేరకు నటించారు. తన అల్లరితో మాస్టర్‌ అంకిత్‌ అలరిస్తాడు. సాంకేతిక బృందం విషయానికొస్తే.. సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం పలు సన్నివేశాలకు బలాన్ని చేకూర్చాయి. ఎడిటింగ్‌ లోపం కనిపించింది. రచయిత, దర్శకుడు శక్తివేల్‌ అటు దైవాన్ని, ఇటు భూతాన్ని తెరపైకి తీసుకొచ్చి.. రొటీన్‌ కథను కొన్ని ట్విస్ట్‌లతో నింపారు.

ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా?:  ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. హారర్‌ ఎలిమెంట్స్‌ ఉన్నాయి కాబట్టి చిన్న పిల్లలను దూరంగా ఉంచడం బెటర్‌. అసభ్యకర సన్నివేశాలు, సంభాషణలు లేవు. ట్విస్ట్‌ల కోసం ఈ మూవీని ఈ వీకెండ్‌ ప్రయత్నించొచ్చు.

  • బలాలు
  • + ద్వితీయార్ధం
  • + భరత్‌ నటన
  • బలహీనతలు
  • - కథ
  • - ప్రథమార్ధంలో సాగదీత
  • చివరిగా: ‘మిరల్‌’ థ్రిల్‌.. కొంత వరకే (Miral Review in Telugu)!
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని