true lover: ‘బేబి’తో అసలు పోల్చలేం

‘‘ట్రూ లవర్‌’ చిన్న సినిమా. చిన్న రిలీజ్‌. ‘ఈగల్‌’తో పోటీపడే పెద్ద చిత్రం కాదు. అయినా సరే అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్న నిర్ణయాన్ని తీసుకొని ఈనెల 10న తెలుగులో విడుదల చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత ఎస్‌కేఎన్‌. మణికందన్‌, శ్రీగౌరి ప్రియ, కన్న రవి ప్రధాన పాత్రల్లో ప్రభురామ్‌ వ్యాస్‌ రూపొందించిన చిత్రమే ‘ట్రూ లవర్‌’.

Updated : 07 Feb 2024 09:33 IST

‘‘ట్రూ లవర్‌’ చిన్న సినిమా. చిన్న రిలీజ్‌. ‘ఈగల్‌’తో పోటీపడే పెద్ద చిత్రం కాదు. అయినా సరే అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్న నిర్ణయాన్ని తీసుకొని ఈనెల 10న తెలుగులో విడుదల చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత ఎస్‌కేఎన్‌. మణికందన్‌, శ్రీగౌరి ప్రియ, కన్న రవి ప్రధాన పాత్రల్లో ప్రభురామ్‌ వ్యాస్‌ రూపొందించిన చిత్రమే ‘ట్రూ లవర్‌’. దీన్ని తెలుగులో దర్శకుడు మారుతి, ఎస్‌కేఎన్‌ సంయుక్తంగా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో మంగళవారం విలేకర్లతో మాట్లాడారు ఎస్‌కేఎన్‌.

‘‘ప్రేమలో ఉన్న యువతకు బాగా కనెక్ట్‌ అయ్యే సబ్జెక్ట్‌ ఇది. ప్రేమికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని దర్శకుడు ఈ చిత్రంలో ఆకట్టుకునేలా చూపించారు. ఏ బంధంలోనైనా నమ్మకం అనేది పునాదిగా ఉండాలి. అదే ఈ చిత్ర ప్రధాన ఇతివృతం. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు హత్తుకునేలా అనిపించాయి. అవి చూసే ఈ చిత్రం కచ్చితంగా విజయవంతమవుతుందని నమ్మా’’.

  • ‘‘ఈ సినిమాని మా గత చిత్రం ‘బేబి’తో అసలు పోల్చలేం. రెండూ పూర్తి భిన్నమైన కథలతో రూపొందాయి. ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు తెరపై పాత్రల్ని తమతో పోల్చుకుంటారు. దర్శకుడు తను ఎంచుకున్న కథకు పూర్తి న్యాయం చేశాడు. ఇవాళ మిగతా భాషల సినిమాలు ఎలా ఉన్నాయన్నది విడుదలైన గంటలోనే తెలిసిపోతోంది. అందుకే అక్కడా.. ఇక్కడా ఒకే తేదీన విడుదల చేస్తే మంచిది. మేము ‘2018’ చిత్రాన్ని ఇక్కడ థియేటర్స్‌లో విడుదల చేయగానే.. మలయాళంలో ఓటీటీలోకి వచ్చేసింది. ‘లవ్‌టుడే’ విషయంలోనూ ఇదే జరిగింది. ఒకేసారి విడుదల చేయకపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి. అందుకే ఈ చిత్రాన్ని తమిళంలో ఈనెల 9న.. తెలుగులో 10న విడుదల చేస్తున్నాం’’.
  • ‘‘ప్రస్తుతం మా బ్యానర్‌లో ఆనంద్‌ దేవరకొండ - వైష్ణవి చైతన్య జంటగా ఓ చిత్రం రూపొందుతోంది. అలాగే సంతోష్‌ శోభన్‌తో ఒక సినిమా చేస్తున్నా. సందీప్‌ రాజ్‌తో ఓ ప్రాజెక్ట్‌ చేయనున్నాం. వాటితో పాటు ఓ సూపర్‌ నేచురల్‌ చిత్రం చేయనున్నాం. ‘బేబి’ హిందీ రీమేక్‌ను త్వరలో ప్రకటిస్తాం. దానికోసం ‘కల్ట్‌ బొమ్మ’ అనే టైటిల్‌ రిజిస్టర్‌ చేయించాను. హిందీలోనూ సాయి రాజేశే దర్శకత్వం వహిస్తారు. ఆ చిత్రాన్ని స్టార్‌ కిడ్స్‌తో కానీ, కొత్తవాళ్లతో గానీ చేయాలన్న ఆలోచనలో ఉన్నాం. ప్రస్తుతం నేను నిర్మాతగా అప్పర్‌ ప్రైమరీ స్థాయిలో ఉన్నా. కాలేజీ స్థాయికి వచ్చాక అల్లు అర్జున్‌తో సినిమా నిర్మిస్తా’’.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని