Anupama Parameswaran: అందుకు బోర్‌ ఫీలయ్యా.. గ్లామర్‌ డోస్‌పై స్పందించిన అనుపమ

సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్‌’. ఈ సినిమా సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌లో హైదరాబాద్‌లో జరిగింది.

Published : 19 Mar 2024 00:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కెరీర్‌ ప్రారంభం నుంచీ ఒకే తరహా పాత్రల్లో నటించడంతో బోర్‌ ఫీలయ్యాయని నటి అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) అన్నారు. ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square) సినిమాలో గ్లామర్‌ డోస్‌ పెంచడంపై ఎదురైన ప్రశ్నకు ఆమె పైవిధంగా సమాధానమిచ్చారు. సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) హీరోగా దర్శకుడు మల్లిక్‌ రామ్‌ రూపొందించిన సినిమా ఇది. మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో ‘ఓ మై లిల్లీ’ పాట విడుదల వేడుక నిర్వహించింది. అనుపమతోపాటు సిద్ధు, మల్లిక్‌ రామ్‌, నిర్మాత నాగవంశీ పాల్గొన్నారు. మీడియాతో వారు పంచుకున్న సంగతులివీ.. 

* ఓ వైపు పరీక్షలు, మరోవైపు ఎన్నికల హీట్‌ మొదలైంది. సినిమా విడుదలకు ఇది సరైన సమయం అనుకుంటున్నారా?

నాగవంశీ: మార్చి చివరకు దాదాపు అన్ని పరీక్షలు పూర్తవుతాయి. ఎన్నికలు మేలో ఉన్నాయి. గుడ్‌ఫ్రైడే సెలవును దృష్టిలో పెట్టుకుని మా చిత్రాన్ని విడుదల చేయనున్నాం. ఇందులో అడల్ట్‌ కంటెంట్‌ లేదు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.

* తమన్‌కు బదులు భీమ్స్‌ నేపథ్య సంగీతం అందించడానికి కారణం?

నాగవంశీ: వేసవి కానుకగా ప్రేక్షకులకు మా చిత్రాన్ని ఫస్ట్‌ చూపించాలనుకుని మార్చి 29ని ఫిక్స్‌ చేశాం. ఆ లోపు పనులన్నీ పూర్తవ్వాలి. తమన్‌ బిజీగా ఉండడంతో భీమ్స్‌ని తీసుకున్నాం.

* ఈ చిత్రం విషయంలో మీరు గ్లామర్‌ డోస్‌ పెంచినట్లున్నారు?

అనుపమ: అందంగా కనిపించడం మంచిదే కదా (నవ్వుతూ). నా కెరీర్‌లో నేను పోషించిన పాత్రల్లో లిల్లీ (ఈ సినిమాలోని క్యారెక్టర్‌) ప్రత్యేకం. మూడేళ్ల క్రితం ప్రయోగాత్మక పాత్రల్లో నటించడం ప్రారంభించా. అంతకుముందు నాకున్న పరిధుల దృష్ట్యా కొన్ని క్యారెక్టర్లు ప్లే చేయలేకపోయా. అన్ని చిత్రాల్లో ఒకేలాంటి పాత్రల్లో నటించడంతో బోర్‌ ఫీలయ్యా. ఏదైనా పెర్ఫామెన్స్‌కు స్కోప్‌ ఉంటేనే చేస్తా తప్ప హీరోయిన్‌ ఇమేజ్‌ కోసం కాదు.

* ఈ సినిమాలో హీరోయిన్‌గా తొలుత కొన్ని పేర్లు వినిపించాయి. వాళ్లెందుకు చేయలేదో తెలుసుకుని మీరు ఈ చిత్రాన్ని అంగీకరించారా? కథ నచ్చి నటించారా?

అనుపమ: నా దగ్గరకు కథ వచ్చింది. నాకు నచ్చింది. లిల్లీ పాత్రను వదులుకోకూడదనుకుని నటించా. మిగతా విషయాలు తెలియదు. నా తొలి సినిమా ‘ప్రేమమ్‌’లో నటించేటప్పుడు నా వయసు 19 ఏళ్లు.  ఆ తర్వాత తెలుగులో ‘అ ఆ’లో నటించా. నా కెరీర్‌ ప్రారంభమై దాదాపు పదేళ్లవుతుంది. ఎప్పుడూ ఒకేలాంటి పాత్రలు చేయాలని కోరుకోవడం తప్పు కదా (నవ్వుతూ).

* హిట్‌ సినిమాకి సీక్వెల్‌ అంటే ఒత్తిడి ఉంటుంది. ఆ భయమే అడల్ట్‌ డోస్‌/యూత్‌ డోస్‌ను పెంచేలా చేసిందా?

సిద్ధు: యూత్‌ డోస్‌ ఓకేగానీ మేం అడల్ట్‌ డోస్‌ అనడం సరైంది కాదు. ఒక్కో సినిమాకి ఒక్కో థీమ్‌ ఉంటుంది. ఇందులో డీజే టిల్లు క్లాస్‌గా కనిపిస్తే చూసే మీకు, చేసే మాకు వినోదం ఉండదు. ఆ క్యారెక్టర్‌ మోసపోవడం, బాధపడడం కూడా యూత్‌ డోసే. మనసు విరిగితేనే ఇలాంటి సినిమాలు తీయగలం.

*  దర్శకుడి గురించి చెబుతారా?

సిద్ధు: ఈ సినిమాని చేద్దామనుకునే సమయానికి విమల్‌ కృష్ణ (డీజే టిల్లు దర్శకుడు) మరో ప్రాజెక్టుతో బిజీ అయ్యాడు. అప్పటికే నేను, మల్లిక్‌ రామ్‌ వేరే కథా చర్చల్లో ఉన్నాం. ‘టిల్లు స్క్వేర్‌’కి అతడు దర్శకత్వం వహిస్తే బాగుంటుందనిపించింది.

*  టైటిల్‌ ఆలోచన ఎవరిది?

సిద్ధు: ఆ ఆలోచన దర్శకుడు త్రివిక్రమ్‌ది. మేం ‘టిల్లు బ్యాక్‌’, ‘టిల్లు రిటర్న్స్‌’లాంటి టైటిల్స్‌ అనుకుంటుంటే ఆయన ‘టిల్లు స్క్వేర్‌’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని