Better Trajectories: ‘బెటర్‌ ట్రాజెక్టరీస్‌’ గ్రంథావిష్కరణ

త్యాగరాయగానసభ నిర్వహణలో ఎన్‌ఆర్‌ఐ అంజన గోలి రచించిన ‘బెటర్‌ ట్రాజెక్టరీస్‌’ గ్రంథావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.

Updated : 24 May 2024 14:47 IST

హైదరాబాద్‌: త్యాగరాయగానసభ నిర్వహణలో ఎన్‌ఆర్‌ఐ అంజన గోలి రచించిన ‘బెటర్‌ ట్రాజెక్టరీస్‌’ గ్రంథావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. కళాసుబ్బారావు కళావేదికపై ఏర్పాటు చేసిన సభకు వి.ఎస్‌ జనార్దన్‌మూర్తి అధ్యక్షత వహించగా.. హాస్యావధాని, సీనియర్‌ పాత్రికేయులు శంకర్‌ నారాయణ విశిష్ట అతిథిగా, యల్లాప్రగడ మల్లికార్జునరావు, రాయారావు విశ్వేశ్వరరావు ఆత్మీయ అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వి.ఎస్‌ జనార్దన్‌ మూర్తి మాట్లాడుతూ.. ‘‘అంజన గోలి ఎనిమిదేళ్ల వయసులోనే త్యాగరాయ గానసభ నిర్వహణలో భగవద్గీత కార్యక్రమం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. కళలపై ఉన్న మక్కువతో తెలుగువారి కోసం అమెరికాలో కూడా రెండు అసోసియేషన్లు ఏర్పాటు చేసి అధ్యాత్మిక అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్టు వివరించారు. పలువురి జీవిత విశేషాలను క్రోడీకరించి.. అధ్యాత్మికమైన అంశాలతో అంజన గోలి అద్భుతమైన గ్రంథాన్ని రచించినట్టు చెప్పారు. హాస్యావధాని శంకరనారాయణ మాట్లాడుతూ.. అన్ని దానాల్లోకి అన్నదానం మంచిదంటారు. అన్నదానం ఒక్క పూట మాత్రమే కడుపునింపుతుంది.. కానీ, విద్యాదానం, కళాదానం జీవితాంతం వారి కడుపునింపుతాయన్నారు.

16 ఏళ్ల వయస్సులోనే అసామాన్య ప్రతిభ!

పదహారేళ్ల వయసులోనే అంజన గోలి అసామాన్య ప్రతిభాపాటవాలతో అబ్బురపరుస్తున్నారు. స్టాన్‌ఫోర్డ్ ఆన్‌లైన్ హైస్కూల్‌లో హైస్కూల్ జూనియర్‌గా.. సమాజానికి మేలు చేయాలనే సంకల్పంతో మాలిక్యులర్‌ బయాలజీ, మరీ ముఖ్యంగా క్యాన్సర్‌పై పరిశోధన చేయడం ద్వారా ప్రపంచంలో మార్పు కోసం కృషిచేస్తున్నారు. బెటర్ ట్రాజెక్టరీస్ వ్యవస్థాపకురాలిగా,  సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్‌  యూనివర్శిటీలో ఎఫెక్టివ్ ఆల్ట్రూయిజం క్లబ్‌కు ఎగ్జిక్యూటివ్ బృందంలో భాగమై పలువురు విద్యార్థులతో కలిసి నిస్వార్థమైన సేవలందించేలా పనిచేస్తున్నారు. సింథటిక్‌ బయాలజీపై పరిశోధనను ప్రచురించడంతో పాటు క్యాన్సర్‌పై పరిశోధన చేస్తున్నారు. మెలనోమా, రొమ్ము క్యాన్సర్ వంటి వాటిల్లో కణితి వైవిధ్య సంబందిత సమస్యల్ని పరిష్కరించేందుకు ఉద్దేశించిన జీన్ జెనెసిస్ అనే బయోటెక్నాలజీ సంస్థకు అంజన వ్యవస్థాపకురాలిగా ఉండటం మరో విశేషం.  ఆమె తన హైస్కూల్‌లో ప్రముఖ జర్నల్ OHS STEM అనే మ్యాగజీన్‌కు ఎడిటర్‌ ఇన్‌-చీఫ్‌గానూ ఉన్నారు.  అంతేకాకుడా, ఇంత చిన్న వయస్సులోనే 'బెటర్ ట్రాజెక్టరీస్ - పాత్ టు ఎఫెక్టివ్ ఆల్ట్రూయిజం'; 'బ్రెయిన్‌ వెంచర్స్: ది ఎన్‌చాంటెడ్‌ కార్టెక్స్ క్వెస్ట్' అనే రెండు పుస్తకాలను రాసి అందరి ప్రశంసలు అందుకొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని