వైభవంగా సత్సంకల్ప ఫౌండేషన్‌ రెండో వార్షికోత్సవం

స్వచ్ఛందసంస్థ సత్సంకల్ప ఫౌండేషన్ ద్వితీయ వార్షికోత్సవం వైభవంగా జరిగింది.

Updated : 26 May 2024 13:27 IST

స్వచ్ఛందసంస్థ సత్సంకల్ప ఫౌండేషన్ ద్వితీయ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. అమెరికాలోని కనెక్టికట్‌లో మే 19న ‘భారతీయత’ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రవాస భారతీయలకు మన దేశ సనాతన సంపద్రాయాల ఔన్నత్యాన్ని  చాటిచెప్పడం దీని ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి భారత్‌, కెనడా, స్కాట్లాండ్ దేశాలతో పాటు అమెరికాలోని పలు రాష్ట్రాల నుంచి 664 మందికి పైగా హాజరయ్యారు. మరో 300 మంది అంతర్జాలంలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.

సద్గురు శ్రీ శివానందమూర్తి చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ఆరంభమైంది. దీనికి ముఖ్యఅతిథిగా రిటైర్డ్‌ దౌత్యవేత్త మిత్ర వశిష్ఠ, భారత దౌత్య కార్యాలయానికి చెందిన ప్రజ్ఞాసింగ్‌ ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. సత్సంకల్ప ఫౌండేషన్ అధ్యక్షులు, స్థాపకులు అయిన శ్రీధర్ తాళ్ళపాక సభనుద్దేశిస్తూ ప్రసంగించారు. ప్రతిఒక్కరూ స్వీయధర్మ పరిశీలన చేసుకోవడం చాలా ముఖ్యమన్నారు. అది సమాజానికి ఎంతో అవసరమని, శ్రేయస్కరమని సందేశమిచ్చారు. 

పరాయి దేశంలో ఉంటూ సనాతన ధర్మాన్ని పాటిస్తున్నందుకు గానూ ప్రొఫెసర్ ఎమిరటస్ పీఆర్ ముకుంద్, డాక్టర్‌ ఉమా వైజయంతి మాల కాళ్ళకూరి, మధురెడ్డిని శివానంద స్మృతి పురస్కారంతో సంస్థ ప్రతినిధులు సత్కరించారు. కార్యక్రమంలో భాగంగా కనెక్టికట్‌లో ఉన్న వివిధ నాట్య సంస్థల నుంచి 28 మంది చిన్నారులు కూచిపూడి, భరతనాట్యం, కథక్, ఒడిస్సీ నృత్యాలను ప్రదర్శించారు. ఆయా సంస్థల నాట్య శిక్షకులను, సనాతన ధర్మాన్ని పాటిస్తున్న మరో ఆరు సాంస్కృతిక సంఘాల సంస్థాపకులను కూడా సంస్థ ఈ సందర్భంగా సత్కరించింది. కార్యక్రమానికి విచ్చేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేసి, రెండు దేశాల జాతీయ గీతాలాపనతో కార్యక్రమాన్ని ముగించారు. వచ్చిన అతిథులందరికీ శాకాహార విందును సత్సంకల్ప ఫౌండేషన్ ఏర్పాటు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని