హ్యూస్టన్‌లో ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్‌ జయంతి వేడుకలు

అమెరికాలోని హ్యూస్టన్‌ నగరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్‌ జయంతి వేడకులు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 

Updated : 22 Feb 2023 00:54 IST

అమెరికా: మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్‌ జయంతి వేడుకలు టెక్సాస్‌లోని హ్యూస్టన్‌ నగరంలో వేడుకగా జరిగాయి. ‘శివాజీ మహారాజ్‌ అంతరాష్ట్రీయ పరివార్‌’(ఎస్‌ఎంఏపీ) ఆధ్వర్యంలో ‘హద్దుల్లేని నాయకత్వం’ థీమ్‌ పేరిట ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గుజరాతీ సమాజ్‌ ఆఫ్‌ హ్యూస్టన్‌, సుగర్‌ల్యాండ్‌లలో సాంస్కృతిక వేడుకలు నిర్వహించారు. వేషధారణ, నాటక పోటీలు, రంగోలీ, శివ పూజ, ఆర్తి, కథక్‌ బీట్స్‌ తదితర కార్యక్రమాలతో సందడి చేశారు. కేరళకు చెందిన పరై కుజు కళాకారులు  కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. డప్పు ప్రదర్శనతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పలువురు చిన్నారులు భరత మాత, శివాజీ మహరాజ్‌, అస్సాం యోధుడు లచిత్‌ బర్ఫకన్‌, ఝాన్సీ లక్ష్మీభాయి, కిట్టూరు రాణి చెన్నమ్మ వేషధారణలలో అలరించారు. 

ఈ సందర్భంగా మహారాష్ట్ర డప్పు వాద్యం ‘ధోల్‌ తాషా’తో ఊరేగింపు నిర్వహించారు. ఈ  ప్రదర్శన అక్కడివారిని అకట్టుకుంది. కళాకారుల డప్పు వాద్యాలతో చుట్టూ ఉన్న పరిసరాలు మార్మోగాయి. ఈ కార్యక్రమాలు చిన్నారులకు గొప్ప అనుభవంగా మిగిలింది. ఈ సందర్భంగా నిర్వాహకులు పలువురికి బహుమతులు అందజేశారు. ధోల్‌ తాషా, కథక్‌, పిల్లల కార్యక్రమాలు, మహారాష్ట్ర పాపులర్‌ శివాజీ ఖిలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో స్థానిక అధికారులు పాల్గొన్నారు. కౌంటీ ప్రెసింక్ట్‌ 3 కమిషనర్‌ అండీ మైయర్స్‌, కౌంటీ జిల్లా జడ్జిలు సురేంద్రన్‌ పటేల్‌, చడ్‌ బ్రిడ్జెస్‌, కౌంటీ కోశాధికారి బిల్‌ రికెర్ట్‌, పియర్లాండ్‌ సిటీ మేయర్‌ కెవిన్‌ కోలె, ఫోర్ట్‌ బెండ్‌ కౌంటీ రిపబ్లికన్‌ పార్టీ ఛైర్మన్‌ బాబీ ఎబెర్లె తదితరులు హాజరయ్యారు. ‘శివాజీ మహారాజ్‌ అంతరాష్ట్రీయ పరివార్‌’ ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా 100 నగరాల్లో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను నిర్వహించింది. ఇందులో 70 ప్రాంతాలు ఇతర దేశాల్లోని కాగా, 30 ప్రాంతాలు భారత్‌లో ఉన్నాయి.  భారత్‌లోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన 125 మంది వాలంటీర్లు తమ సేవలు అందించి కార్యక్రమాలను విజయవంతం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని