కెనడాలో వద్దిపర్తి పద్మాకర్‌ ‘సప్త ఖండ అవధానం’

తెలుగు భాషకే చెందిన ‘అవధాన ప్రక్రియ’ను ప్రపంచానికి పరిచయం చేయాలనే సంకల్పంతో ప్రముఖ సహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి ......

Published : 06 Apr 2022 20:12 IST

కెనడా: తెలుగు భాషలో ‘అవధాన ప్రక్రియ’ను ప్రపంచానికి పరిచయం చేయాలనే సంకల్పంతో ప్రముఖ సహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్‌ ‘సప్త ఖండ అవధాన సాహితీ ఝరి’ అనే కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.  ప్రతి నెలా ఒక్కో ఖండం చొప్పున ఇప్పటికే వర్చువల్‌గా 11 అష్టావధానాలు చేసిన ఆయన.. తాజాగా కెనడాలో 12వ అవధానాన్ని పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎనిమిది మంది మహిళలతో పాటు పెరూ నుంచి శ్రీనివాస్‌ పోలవరపు సైతం భాగస్వాములుగా ఉన్నారు. 

ఈ అవధానంలో కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి పాల్గొని పద్మాకర్‌కు ఆశీస్సులు అందించారు.  ఎంతో రసవత్తరంగా, కన్నుల పండువగా సాగిన ఈ అవధానాన్ని సాహితీ ప్రియులు, సాహిత్యాభిమానులూ తిలకించి, ఇటువంటి సభలే తెలుగు భాషను కలకాలం వెలిగింపజేసేవంటూ తమ హర్షాన్ని ప్రకటించారు. వద్దిపర్తి పద్మాకర్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ‘శ్రీ ప్రణవ పీఠం’స్థాపించారు. ప్రవచన కర్తగా ఆయన సుప్రసిద్ధులు. సంగీత, సాహిత్యాల్లో సమ ప్రతిభ, తెలుగు, సంస్కృతం, హిందీ భాషల్లో సమ పాండిత్యం కలిగిన ఆయన.. తెలుగు భాషా సంస్కృతుల్ని కాపాడేందుకు ఆధ్యాత్మిక యాత్రలు చేస్తుంటారు. 

 ఈ 12 అవధానాలతో కలుపుకొని ఇప్పటివరకు పద్మాకర్‌ 1242 అష్టావధానాలు, 12 శతావధానాలు, 8 జంట అవధానాలతో పాటు తెలుగు, సంస్కృతం, హిందీలో ఏకకాలంలో మహా సహస్రావధానం చేసి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన అసాధారణ ప్రతిభను వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, జీనియస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, తెలుగు బుక్‌ఆఫ్‌ రికార్డ్స్‌ సంస్థలు గుర్తించాయి. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అంతర్జాతీయ సంస్థ ప్రతినిధులు బింగి నరేంద్ర గౌడ్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అంతర్జాతీయ సంస్థ ప్రతినిధులు డాక్టర్ ఎం.విజయలక్ష్మి, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ నుంచి చీఫ్ అడ్వైజర్ డా. సాయిశ్రీ, ఏలూరు జిల్లా చీఫ్ కో-ఆర్డినేటర్ డా.శివశంకర్ తదితరులు నేరుగా శ్రీ ప్రణవ పీఠానికి విచ్చేసి వద్దిపర్తి పద్మాకర్‌కు సర్టిఫికెట్‌, మెడల్‌ అందజేసి సత్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని